సంక్షిప్త వార్తలు (4)

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లను 11 నుంచి 15 వరకు నిర్వహిస్తున్నందున రెండో శనివారం పాఠశాలలు పని చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పిల్లలకు వ్యాసరచన,

Updated : 12 Aug 2022 05:38 IST

పాఠశాలలకు రెండో శనివారం సెలవు రద్దు

ఈనాడు, అమరావతి: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లను 11 నుంచి 15 వరకు నిర్వహిస్తున్నందున రెండో శనివారం పాఠశాలలు పని చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పిల్లలకు వ్యాసరచన, నృత్యం, చిత్రలేఖనం తదితర పోటీలు, విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించాలని సూచించింది.


ఏపీటీడీసీ డిప్యూటీ సీఈవోగా రాముడు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఉప ముఖ్య కార్యనిర్వాహక అధికారి (డిప్యూటీ సీఈవో)గా రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుడు వి.రాముడిని ప్రభుత్వం నియమించింది. ఆయన ఏడాదిపాటు డిప్యుటేషన్‌పై ఏపీటీడీసీలో సేవలు అందించనున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో వివిధ హోదాల్లో 40 ఏళ్లపాటు పని చేసిన రాముడి సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.


వార్డు సచివాలయాల్లో మేయర్‌, గ్రామాల్లో సర్పంచితో పతాకావిష్కరణ

ఈనాడు, అమరావతి: వార్డు సచివాలయాల్లో మేయర్‌, కార్పొరేటర్లు, పురపాలక సంఘాల్లో ఛైర్మన్‌, కౌన్సిలర్లు, గ్రామ సచివాలయాల్లో సర్పంచి ఆగస్టు 15న జాతీయ జెండా ఎగర వేసేలా ఏర్పాట్లు చేయాలని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. పాలకవర్గం లేని చోట అక్కడి ప్రత్యేక అధికారులు జెండా ఆవిష్కరించేలా చూడాలని అధికారులకు సూచించింది.


పాఠశాలల విద్యార్థుల కోసం 23, 24 తేదీల్లో ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థుల కోసం ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు నిర్వహించనున్నారు. ఆధార్‌ సేవలు అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వీటిని నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవలసిన చర్యలపై గ్రామ, వార్డు సచివాలయాలశాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి విద్యార్థీ ఆధార్‌ తీసుకునేలా వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని