ఐటీశాఖ ఉత్తర్వుల నుంచి శేఖర్‌రెడ్డికి ఊరట

ఆదాయపు పన్నుశాఖ ఉత్తర్వుల నుంచి శేఖర్‌రెడ్డికి మద్రాసు హైకోర్టు ఊరట కల్పించింది. భారీ మొత్తంలో పన్ను చెల్లించాలన్న ఐటీ శాఖ ఉత్తర్వులను రద్దు చేసింది. శేఖర్‌రెడ్డికి చెందిన

Published : 12 Aug 2022 03:23 IST

ట్రిప్లికేన్‌, న్యూస్‌టుడే: ఆదాయపు పన్నుశాఖ ఉత్తర్వుల నుంచి శేఖర్‌రెడ్డికి మద్రాసు హైకోర్టు ఊరట కల్పించింది. భారీ మొత్తంలో పన్ను చెల్లించాలన్న ఐటీ శాఖ ఉత్తర్వులను రద్దు చేసింది. శేఖర్‌రెడ్డికి చెందిన ఎస్‌ఆర్‌ఎస్‌ మైనింగ్‌ కంపెనీ 2014-15 నుంచి 2017-18 మధ్యకాలంలో రూ.4,442 కోట్లను ఆర్జించినట్టు మదింపు కట్టిన ఆదాయపు పన్నుశాఖ.. దానికి రూ.2,682 కోట్లను పన్నుగా చెల్లించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని సవాల్‌ చేస్తూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మునీశ్వర్‌నాథ్‌ భండారి, న్యాయమూర్తి జస్టిస్‌ మాలా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. రూ.384.55 కోట్ల రిటర్న్స్‌ను ఎస్‌ఆర్‌ఎస్‌ మైనింగ్‌ దాఖలు చేయగా, దానికి భిన్నంగా ఆదాయాన్ని ఐటీశాఖ లెక్కకట్టిన విధానాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. క్రాస్‌ ఎగ్జామిన్‌ సమయంలో హైకోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా సాక్షుల వాంగ్మూలాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు ఆదాయపు పన్ను శాఖ తీరును ఖండించింది. ఆదాయాన్ని మరోమారు లెక్కగట్టి కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. 2016లో శేఖం్రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో జరిగిన సోదాలు సందర్భంగా వెలుగుచూసిన రూ.2వేలు కరెన్సీ కొత్త నోట్లు, పత్రాలు ఆధారంగా ఆదాయపన్నుశాఖ మదింపు చేపట్టి రూ.2,682 కోట్ల పన్ను చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని