Updated : 13 Aug 2022 03:55 IST

టర్న్‌కీ చెప్పిందే లెక్క!

ఆన్‌లైన్‌ వేబిల్లులకు ససేమిరా

16 నెలలు అవుతున్నా ముద్రిత బిల్లులే

సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్లో విక్రయిస్తానంది. ఆర్టీసీ బస్సుల్లో యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ ద్వారా కండక్టర్లు ఆన్‌లైన్‌ టికెట్ల జారీ ఆరంభించారు. గనుల శాఖలో ఉమ్మడి రాష్ట్రం నుంచే ఆన్‌లైన్‌ వేబిల్లుల విధానం మొదలైంది. కానీ.. ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేస్తున్న టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ (జేపీ సంస్థకు ఉపగుత్తేదారు)కు గనులశాఖ ఈ-పర్మిట్లు ఇవ్వట్లేదు. ఆ సంస్థ ఇసుక రవాణాదారులకు ఆన్‌లైన్‌ వేబిల్లులకు బదులు ముద్రిత బిల్లులే ఇస్తోంది. వెరసి ఇసుక లెక్కలు పక్కాగా ఉండట్లేదు.

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో నిత్యం 40-50 వేల టన్నుల ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. కానీ వీటికి అధికారిక లెక్కలు ఉండటంలేదు. టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్‌ సంస్థ ప్రతినిధులు చూపే వివరాలనే గనులశాఖ అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో పారదర్శకతకు పాతరేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక టెండరును జేపీ సంస్థ దక్కించుకొని ఒప్పందం చేసుకుంది. చెన్నైకి చెందిన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్‌ సంస్థ ఉపగుత్తేదారుగా వచ్చి, గతేడాది మే 14 నుంచి తవ్వకాలు, విక్రయాలు ఆరంభించింది. మరో 8 నెలల్లో ఒప్పందం ముగియనుంది. ఇప్పటికి 16 నెలలు అవుతున్నా.. ముద్రిత వేబిల్లులే ఇస్తూ సర్కారుకు తప్పుడు లెక్కలు చూపుతోందనే ఆరోపణలు ఉన్నాయి. మొదటి నుంచి రేవులు, నిల్వకేంద్రాల్లో నగదునే తీసుకుంటున్నారు. డిజిటల్‌ చెల్లింపులైతే పూర్తిగా లెక్కలు చూపాలనే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  ఆన్‌లైన్‌ వేబిల్లులూ ఇవ్వడం లేదు.

సాఫ్ట్‌వేర్‌ సిద్ధంచేసి.. వెనకడుగు 

గనులశాఖ అనుమతించిన రేవుల్లో తవ్వే ఇసుకకు ఈ-పర్మిట్లు జారీ చేయాలి. వాహనాలకు ఆన్‌లైన్‌ వే-బిల్లులు ఇవ్వాలి. దీనికోసం గనులశాఖ అధికారులు కొంతకాలం క్రితం ఓ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. దీనిని టర్న్‌కీ సంస్థకు ఇచ్చినప్పటికీ.. ఆమలుకాలేదు. అన్ని రేవులు, నిల్వకేంద్రాల వద్ద సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు ఉండవని, అందువల్ల ఆన్‌లైన్‌ వేబిల్లుల జారీ కష్టమని గతంలో అధికారులు వాదించారు. 2019 సెప్టెంబరు నుంచి 2021 మే వరకూ ఇసుక తవ్వకాలు, విక్రయాలను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నిర్వహించింది. అప్పుడు సిబ్బంది ఈపోస్‌ మిషన్‌లో ఆన్‌లైన్‌ వేబిల్లు జారీచేసేవారు. ప్రభుత్వరంగ సంస్థకు సాధ్యమైన విధానం.. ప్రైవేటు సంస్థకు ఎందుకు వీలుపడదనేది ప్రశ్నార్థకంగా ఉంది.

అధికారులు చెబుతున్నారే తప్ప.. 

గుత్తేదారు సంస్థ త్వరలోనే ఆన్‌లైన్‌ వేబిల్లులు జారీ చేస్తుందని గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి గత ఏడాది డిసెంబరు 21న విలేకరులకు తెలిపారు. 10-15 రోజుల్లోనే ఆన్‌లైన్‌ వేబిల్లులు జారీ అవుతాయని గనులశాఖ ఇన్‌ఛార్జ్‌ సంచాలకుల హోదాలో డబ్ల్యుబి చంద్రశేఖర్‌ ఈ ఏడాది మే 14న చెప్పారు. ఇలా అధికారులు ప్రకటించడమే తప్ప.. ఆన్‌లైన్‌ వేబిల్లుల జారీ మొదలుకాలేదు, అయ్యే అవకాశాలూ కనిపించడం లేదు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని