ఎం.తుమ్మలపల్లెలో జల కాలుష్యం.. ప్రకృతి పరమైందే

వైయస్‌ఆర్‌ జిల్లా ఎం.తుమ్మలపల్లెలోని యురేనియం శుద్ధి కర్మాగారం పరిసర గ్రామాల్లో భూగర్భ జల కాలుష్యానికి ఆ వ్యర్థాల్ని నిల్వచేసే టెయిలింగ్‌ పాండ్‌ కారణం కాదని కేంద్ర అణుశక్తి

Published : 13 Aug 2022 03:43 IST

యురేనియం నిల్వల గాఢతే కారణం

ఎన్జీటీకి కేంద్ర అణుశక్తి విభాగం నివేదిక

‘ఈనాడు’ కథనంపై ట్రైబ్యునల్‌ విచారణ

ఈనాడు, అమరావతి: వైయస్‌ఆర్‌ జిల్లా ఎం.తుమ్మలపల్లెలోని యురేనియం శుద్ధి కర్మాగారం పరిసర గ్రామాల్లో భూగర్భ జల కాలుష్యానికి ఆ వ్యర్థాల్ని నిల్వచేసే టెయిలింగ్‌ పాండ్‌ కారణం కాదని కేంద్ర అణుశక్తి విభాగం పేర్కొంది. యురేనియం నిల్వలు అధికంగా ఉండటమే కారణమని తెలిపింది. ఆ ప్రాంతంలో భూగర్భ జలకాలుష్యం ప్రకృతి పరంగా ఏర్పడిందే తప్ప, మానవకల్పిత చర్య కాదని పేర్కొంది. ఈ మేరకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కు తాజాగా నివేదించింది. ‘కాలుష్యం సుద్దులు యురేనియానికి వర్తించవా’ శీర్షికన గతేడాది ఆగస్టు 7న ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై తాజాగా ఎన్జీటీ విచారణ చేపట్టింది. ఆ ప్రాంతంలో భూగర్భ జల కాలుష్యంపై కేంద్ర అణుశక్తి విభాగం అభిప్రాయాల్ని కోరింది. ఆ విభాగం జులై 20న ఎన్జీటీకి సమర్పించిన నివేదికలో పై అంశాల్ని ప్రస్తావించింది. ‘భౌగోళిక మార్పుల వల్ల ఆ ప్రాంతంలోని రాళ్లల్లో యురేనియం మోతాదు అధికంగా ఉంది. అదే అక్కడి భూగర్భ జలకాలుష్యానికి కారణమవుతోంది’ అని వివరించింది. నివేదికలోని ప్రధానాంశాలివి.

* ఎం.తుమ్మలపల్లె పరిసర ప్రాంతాల్లో భూగర్భ జల ప్రవాహ దిశపై అధ్యయనం చేశాం. మొత్తం 10 కిలోమీటర్ల పరిధిలోని 50 బావుల నుంచి నీటి నమూనాలు సేకరించాం. టెయిలింగ్‌ పాండ్‌ దిగువ భాగంలో ఉన్న బావుల్లోని జలాల్లో యురేనియం గాఢత తక్కువగా ఉంది. ఎగువ భాగంలోని బావుల నుంచి సేకరించిన నమూనాల్లో ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి ఆ ప్రాంతంలో భూగర్భ జల కాలుష్యానికి టెయిలింగ్‌ పాండ్‌ కారణం కాదు.

* హైడ్రోజియోలాజికల్‌ అధ్యయనంలోనూ కాలుష్య కారకాలేవీ టెయిలింగ్‌ పాండ్‌ నుంచి విడుదల అవుతున్నట్లు తేలలేదు.

* ఇక్కడి మాదిరిగానే పంజాబ్‌లోనూ పలుచోట్ల భూగర్భ జలాల్లో యురేనియం మోతాదు అధికంగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. అది అక్కడి భూగర్భ జలకాలుష్యానికి కారణమవుతోంది. ఆ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతను విడుదల చేసే గ్రానైట్లు, యాసిడ్‌ వాల్కొనిక్‌ శిలల్లో యురేనియం అధికంగాఉండటమే దీనికి కారణం.


కర్మాగారం రాకముందు కాలుష్యం లేదేం?
-కె.బాబురావు, ప్రజల కోసం శాస్త్రవేత్తల బృందం ప్రతినిధి

ఎన్జీటీకి కేంద్ర అణుశక్తి విభాగం సమర్పించిన నివేదికే నిజమైతే.. యురేనియం కర్మాగారం ఏర్పాటు కాకముందు కూడా ఎం.తుమ్మలపల్లె ప్రాంతంలో భూగర్భ జల కాలుష్యం ఉండాలి కదా! అప్పట్లో లేని కాలుష్యం.. కర్మాగారం నెలకొల్పిన తర్వాతే ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? టెయిలింగ్‌ పాండ్‌లోని యురేనియం వ్యర్థాలు భూగర్భంలోకి ఇంకడం వల్ల కాదా? పర్యావరణ ఉల్లంఘనల్ని సమర్థించేలా, వైఫల్యాల్ని కప్పిపుచ్చేలా ప్రభుత్వ సంస్థలే అభిప్రాయాలు చెప్పటం దురదృష్టకరం. టెయిలింగ్‌ పాండ్‌ నుంచి యురేనియం వ్యర్థాలు భూగర్భంలోకి ఇంకకుండా వేయాల్సిన లైనింగ్‌పై గతంలోనే పీసీబీ ఆదేశాలిచ్చింది. అవి ఇంతవరకూ ఎందుకు అమలు చేయలేదు? భూగర్భ జల కాలుష్యానికి టెయిలింగ్‌ పాండ్‌ కారణం కాదంటున్న కేంద్ర అణుశక్తి విభాగం.. అందుకు సంబంధించిన స్పష్టమైన అధ్యయన నివేదికలు విడుదల చేయాలి.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts