237మంది ఎంపీడీఓలకు పదోన్నతి

‘రాష్ట్రంలో ఒకేసారి 237మంది ఎంపీడీఓలకు జిల్లా అధికారులుగా పదోన్నతులు కల్పించడమనేది ఇదే తొలిసారి’ అని ఎంపీడీఓల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య తెలిపారు. ‘26 ఏళ్ల

Published : 13 Aug 2022 03:39 IST

సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సంఘం ప్రతినిధులు

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో ఒకేసారి 237మంది ఎంపీడీఓలకు జిల్లా అధికారులుగా పదోన్నతులు కల్పించడమనేది ఇదే తొలిసారి’ అని ఎంపీడీఓల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య తెలిపారు. ‘26 ఏళ్ల కిందట గ్రూప్‌-1 విభాగంలో ఎంపీడీఓలుగా చేరి అవే పోస్టుల్లోనే మగ్గుతున్నాం..పదోన్నతుల కోసం అందరి చూట్టూ తిరిగాం. కష్టపడి పనిచేస్తున్నా పదోన్నతులు లేవు..ఇప్పుడు మాలో అర్హులైన 237మందికి జిల్లా అధికారులుగా పదోన్నతులు కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’ అని చెప్పారు. ఎంపీడీఓల సంఘం ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు. తర్వాత వెంకటరామిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ‘వీరికి ఏప్రిల్‌లోనే పదోన్నతులు కల్పించినప్పటికీ జిల్లాల పునర్‌ విభజన తదితర సాంకేతిక కారణాలవల్ల గురువారం నుంచే వారికి వ్యక్తిగతంగా ఉత్తర్వులు అందాయి. అలాగే ఉపాధ్యాయుల బదిలీల గడువును 8ఏళ్ల నుంచి 5ఏళ్లకు తగ్గించరాదని సీఎంను కోరాం’ అని తెలిపారు. ఎంపీడీఓల సంఘం ప్రధాన కార్యదర్శి జీవీ నారాయణరెడ్డి మాట్లాడుతూ..‘ఈ పదోన్నతులతో పంచాయతీరాజ్‌ శాఖలోని అటెండర్‌ నుంచి వివిధ స్థాయిల్లోని 12వేల నుంచి 16వేల మంది ఉద్యోగోన్నతికి వెసులుబాటు కలుగుతుంది’ అని చెప్పారు. సీఎంను కలిసినవారిలో ఎంపీడీఓల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి, సమన్వయకర్త కేఎస్‌వీ ప్రసాదరావు, సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని