హంద్రీనీవాకు నీటిని మళ్లించే పథకాన్ని ఆపండి

గాలేరు-నగరి ప్రాజెక్టు నుంచి హంద్రీ-నీవా ఎత్తిపోతలకు నీటిని మళ్లించే పథకాన్ని నిలిపివేయాలని, పర్యావరణ అనుమతిని అపరిష్కృతంగా ఉంచాలని కోరుతూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు లేఖ రాయాలని తెలంగాణ

Updated : 13 Aug 2022 06:14 IST

కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

ఈనాడు హైదరాబాద్‌: గాలేరు-నగరి ప్రాజెక్టు నుంచి హంద్రీ-నీవా ఎత్తిపోతలకు నీటిని మళ్లించే పథకాన్ని నిలిపివేయాలని, పర్యావరణ అనుమతిని అపరిష్కృతంగా ఉంచాలని కోరుతూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు లేఖ రాయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు బోర్డు ఛైర్మన్‌కు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) మురళీధర్‌ శుక్రవారం లేఖ రాశారు. ‘గాలేరు-నగరి నుంచి హంద్రీనీవాకు నీటిని మళ్లించే పథకానికి రూ.5,036 కోట్లతో 2020 ఆగస్టు 26న ఏపీ ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. అప్పుడే దీనిపై అభ్యంతరం తెలిపాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ ప్రభావ మదింపు కమిటీ దీనికి అనుమతి ఇస్తూ ఈ ప్రాజెక్టు వివరాలను స్పష్టంగా పేర్కొంది. 15.53 టీఎంసీల నీటిని మళ్లించే ఈ ప్రాజెక్టు పూర్తిగా ప్రత్యేకమైనదే. ఇందులో భాగంగా గాలేరు-నగరి ప్రధాన కాలువ 56వ కిలోమీటరు వద్ద హంద్రీనీవాను కలిపి పుంగనూరు బ్రాంచి కాలువకు నీటిని మళ్లిస్తారు. ఇది ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చడమే. కొత్తగా ఆవులపల్లి వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణాన్నీ చేపట్టారు. దీనికింద 9,700 హెక్టార్ల ఆయకట్టు ఉంది. మొదట 2.5 టీఎంసీలు, తర్వాత 3.5 టీఎంసీలు వినియోగించుకోవడం దీని లక్ష్యం. ఇది అనధికార ప్రాజెక్టు. ఈ నేపథ్యంలో ఏపీ పర్యావరణ మదింపు కమిటీ ఇచ్చిన పర్యావరణ అనుమతిని పెండింగ్‌లో ఉంచేలా కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు బోర్డు లేఖ రాయాల్సిన అవసరం ఉందని’’ లేఖలో ఈఎన్‌సీ కోరారు.

శ్రీశైలం పూర్తి వివరాలివ్వండి

శ్రీశైలం రూల్‌కర్వ్‌పై నిర్ణయానికి రావడానికి ముందు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు  అందజేయాలని కృష్ణామరో లేఖ రాశారు. ఇటీవల జరిగిన రిజర్వాయర్‌ యాజమాన్య కమిటీ సమావేశంలో తాము శ్రీశైలం ప్రాజెక్టు వివరాలు అడిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం సహా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దస్త్రాలు తమ వద్ద లేవని, వచ్చే సమావేశంలోగా వీటిని అందజేయాలని కోరారు. శ్రీశైలం కుడిగట్టుకాలువ, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ప్రభావం శ్రీశైలం రూల్‌కర్వ్‌ మీద ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని