గనుల విధానాలపై సమీక్షకు సబ్‌ కమిటీలు

గనులశాఖలో కొంత కాలంగా అమల్లోకి వచ్చిన కొత్త విధానాలపై సమీక్షించేందుకు అధికారులు, లీజుదారుల సంఘాలతో ఇప్పటికే కమిటీ నియమించగా.. తాజాగా ఇందులో నాలుగు సబ్‌

Published : 13 Aug 2022 05:03 IST

ఈనాడు-అమరావతి: గనులశాఖలో కొంత కాలంగా అమల్లోకి వచ్చిన కొత్త విధానాలపై సమీక్షించేందుకు అధికారులు, లీజుదారుల సంఘాలతో ఇప్పటికే కమిటీ నియమించగా.. తాజాగా ఇందులో నాలుగు సబ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు గనులశాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తొలి సబ్‌కమిటీ గ్రానైట్‌, మార్బుల్‌ కోసం నియమించగా..  ఇందులో అదనపు సంచాలకుడు చంద్రశేఖర్‌, ప్రకాశం జిల్లా డీడీ జగన్నాథరావు, వివిధ లీజుదారుల సంఘాలకు చెందిన ఆరుగురు ఉన్నారు. రెండో సబ్‌ కమిటీని 31 చిన్న తరహా ఖనిజాల కోసం ఏర్పాటు చేయగా.. ఇందులో సంయుక్త సంచాలకుడు డి.శ్రీనివాసరావు, అనంతపురం ఏడీ తోట బాలసుబ్రమణ్యం, లీజుదారుల సంఘాలకు చెందిన అయిదుగురు ఉన్నారు. కంకర, గ్రావెల్‌, భవన నిర్మాణానికి వినియోగించే ఖనిజాలపై వేసిన మూడో సబ్‌ కమిటీలో సంయుక్త సంచాలకుడు పి.రాజబాబు, అనకాపల్లి ఏడీ సుబ్బరాయుడు, లీజుదారుల సంఘాలకు చెందిన 10 మంది ఉన్నారు. మినరల్‌ డీలర్‌ లైసెన్స్‌దారులకు సంబంధించి వేసిన నాలుగో సబ్‌ కమిటీలో ఉప సంచాలకుడు (మెరిట్‌) వి.రవిచంద్ర, మోహనరావు (ఐటీ), లీజుదారుల సంఘాలకు చెందిన 8 మందిని నియమించారు. వీరంతా ఆయా ఖనిజాలకు పెంచిన ఫీజులు, పన్నులు, ఈ-వేలం విధానం తదితరాలన్నింటిపై 15 రోజుల్లో నివేదికలు అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని