నిర్మాణ సామగ్రి ధరలు 5% పెంచాల్సిందే

జగనన్న కాలనీల్లో పేదల ఇళ్లకు సరఫరా చేస్తున్న నిర్మాణ సామగ్రి ధరల్ని 5% పెంచాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ అధికారులకు గుత్తేదారు సంస్థలు స్పష్టం చేశాయి. గతేడాదితో

Published : 13 Aug 2022 05:03 IST

బహిరంగ మార్కెట్‌లో అన్ని వస్తువుల ధరలూ పెరిగాయి

గృహనిర్మాణ సంస్థ అధికారులకు స్పష్టం చేసిన గుత్తేదారులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగనన్న కాలనీల్లో పేదల ఇళ్లకు సరఫరా చేస్తున్న నిర్మాణ సామగ్రి ధరల్ని 5% పెంచాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ అధికారులకు గుత్తేదారు సంస్థలు స్పష్టం చేశాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలూ భారీగా పెరిగాయని, పాత ధరకు సరఫరా చేయడం గిట్టుబాటు కాదని వెల్లడించాయి. దీనిపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. కొన్ని గుత్తేదారు సంస్థల టెండరు ఈ నెలాఖరుకు, మరికొన్నింటికి సెప్టెంబరు మొదటి వారంలో గడువు పూర్తికానుంది. ఇప్పటికే గుత్తేదారు సంస్థలతో అధికారులు ఒక దఫా సమావేశం నిర్వహించారు.  ఇందులో ధరలు కొలిక్కి రాలేదు. పేదల ఇళ్లు అయినందున ప్రస్తుత ధరలకే సామగ్రిని అందించాలని అధికారులు చెప్పినట్లు తెలిసింది. సరఫరాకు గుత్తేదారులు సరేనంటున్నా.. ధరల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.'

రూ.2 వేల వరకు అదనపు భారం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మొదటివిడతగా 15.60 లక్షల గృహాల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందుకు రాష్ట్రస్థాయిలో టెండర్లు పిలిచి 12 రకాల నిర్మాణ సామగ్రిని సరఫరా చేయాలని నిర్ణయించింది. వీటిలో తలుపుల నుంచి పెయింట్లు, విద్యుత్‌సామగ్రి, తాగునీటి పైపుల్లాంటివి ఉన్నాయి. ఏడాది కాలపరిమితితో 44 గుత్తేదారు సంస్థలతో సరఫరాకు గతేడాది ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకూ 5 సంస్థలు పాతధరకే సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయి. మిగతా కంపెనీలు ధరలు పెంచాలని కోరినట్లు తెలిసింది. అన్ని ఇళ్లకూ సామగ్రి సేకరిస్తామని చెప్పి... కొన్నింటికే తీసుకోవడంతో తాము నష్టపోయామని కొన్ని కంపెనీలు వెల్లడించినట్లు సమాచారం. ఇప్పటివరకు గృహనిర్మాణ సంస్థ రూ.130 కోట్ల విలువైన సామగ్రిని ఆయా కంపెనీల నుంచి సేకరించింది. కంపెనీలు ప్రతిపాదించిన 5% మేర పెంచితే ఒక్కో లబ్ధిదారుడిపై రూ.2 వేల వరకు అదనపు భారం పడుతుందని అంచనా. మళ్లీ టెండరు పిలిచినా ప్రస్తుతం ధరల ప్రకారం చూస్తే గతంలో కంటే కంపెనీలు ఎక్కువ ధర కోట్‌ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. గుత్తేదారు సంస్థలతో మరోమారు సమావేశమయ్యాక.. ధరల విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని