సోమశిల నిర్వాసితులకు హైకోర్టులో ఊరట

ఉద్యోగ కల్పన వ్యవహారంలో సోమశిల ప్రాజెక్ట్‌ వెనుక జలాల నిర్వాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. 1258 మంది నిర్వాసితుల పేర్లను మొదటి విడత సీనియార్టీ జాబితాలో

Published : 14 Aug 2022 02:21 IST

మొదటి విడత సీనియార్టీ జాబితాలో పేర్లు చేర్చాలని ప్రభుత్వానికి ఆదేశం

ఈనాడు, అమరావతి: ఉద్యోగ కల్పన వ్యవహారంలో సోమశిల ప్రాజెక్ట్‌ వెనుక జలాల నిర్వాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. 1258 మంది నిర్వాసితుల పేర్లను మొదటి విడత సీనియార్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్వాసితుల్లో ఒకరైన టి.శ్రీధర్‌ న్యాయపోరాటం చేయగా.. ఆయన పేరును రెండో జాబితా నుంచి మొదటి జాబితాలోకి మార్చాలని హైకోర్టు గతంలో స్పష్టం చేసిందని గుర్తుచేసింది. ఆ ఉత్తర్వులను పిటిషనర్లకు వర్తింపజేయకపోవడం వివక్ష చూపినట్లవుతుందని పేర్కొంది. ప్రభుత్వం, దాని సంస్థలు పౌరుల ప్రాథమిక హక్కులను హరించేటప్పుడు.. ఆ హక్కులను కాపాడేందుకు న్యాయస్థానం రక్షకుడిగా ఉంటుందని తెలిపింది. ఒకే విధమైన అభ్యర్థనతో న్యాయస్థానం ముందుకు వచ్చిన వేర్వేరు పిటిషన్లలో భిన్నమైన ఉత్తర్వులిచ్చి వివక్ష చూపలేమని పేర్కొంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు పిటిషనర్లకు వర్తిస్తాయని చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చారు.  పిటిషనర్ల తరఫు న్యాయవాది ఫణిభూషణ్‌ వాదనలు వినిపిస్తూ.. శ్రీధర్‌ పేరును మొదటి జాబితాలోకి మార్చాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిందని.. ఆ ఉత్తర్వులు పిటిషనర్లకు వర్తిస్తాయన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. శ్రీధర్‌ ఒక్కరికే ఆ ఉత్తర్వులు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. పిటిషనర్లకు ఆ ఉత్తర్వులు వర్తించవన్నారు. ఈ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఒకే తరహా పరిస్థితులు, ఒకే ప్రాజెక్ట్‌ వ్యవహారంలో ఒక నిర్వాసితుడికి కల్పించిన ప్రయోజనం ఇతరులకు కల్పించకపోవడం వివక్ష అవుతుందన్నారు. పిటిషనర్ల పేర్లను మొదటి విడత సీనియార్టీ జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ప్రస్తుత వ్యాజ్యాల్లో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అధికారులు అమలు చేయలేదని నిర్వాసితులు వేసిన కోర్టుధిక్కరణ కేసు కొట్టేశారు. అధికారుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని