కరుణ విశ్వవ్యాప్తికి భారత్‌ చొరవ చూపాలి

కరుణను విశ్వవ్యాప్తం చేయడంలో భారతదేశం ముందుండి ప్రపంచ దేశాలను నడిపించాలని నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్‌ సత్యార్థి ఉద్బోధించారు. విశాఖలో శనివారం జరిగిన

Published : 14 Aug 2022 03:24 IST

నోబెల్‌ గ్రహీత కైలాశ్‌ సత్యార్థి

ఈనాడు, విశాఖపట్నం: కరుణను విశ్వవ్యాప్తం చేయడంలో భారతదేశం ముందుండి ప్రపంచ దేశాలను నడిపించాలని నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్‌ సత్యార్థి ఉద్బోధించారు. విశాఖలో శనివారం జరిగిన గీతం విశ్వవిద్యాలయం 42వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు గీతం వ్యవస్థాపక దినోత్సవ అవార్డు, రూ.10 లక్షల నగదు, జ్ఞాపికను బహూకరించి సన్మానించారు. అనంతరం కైలాశ్‌ సత్యార్థి ప్రసంగిస్తూ.. తాను ఒక కానిస్టేబుల్‌ కుమారుడినని, ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎదిగిన తీరు వివరించారు. ‘విద్యార్థులు పెద్ద కలలు కనాలి. వాటిని సాకారం చేసుకోవటానికి శ్రమిస్తూనే ఇతరుల కలల సాకారానికి సాయం చేయాలి. కృషి, శ్రమకు మరో ప్రత్యామ్నాయం ఉండదని గుర్తుంచుకోవాలి. దేశంలో 53 శాతం మంది మహిళలు ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అత్యధికులు బయటకు రాకపోవడంతో వారి సమస్యలు పరిష్కారం కావడంలేదు. అన్యాయాలను ప్రశ్నిస్తూ, న్యాయం కోసం పోరాడినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో 40 మిలియన్ల మంది బాలలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి తలెత్తింది. పిల్లలను ఆర్థికంగా ఆదుకోవడానికి అంతర్జాతీయ నిధి ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పలు దేశాల మద్దతు కూడగడుతున్నా’ అని కైలాశ్‌ సత్యార్థి పేర్కొన్నారు. గీతం అధ్యక్షుడు శ్రీభరత్‌ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలతో ప్రారంభమైన గీతం విశ్వవిద్యాలయంలోని ప్రతి ఒక్కరూ గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో గీతం ఉపాధ్యక్షుడు కె. గంగాధరరావు, వీసీ ఆచార్య దయానంద సిద్ధవట్టం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని