Updated : 14 Aug 2022 06:06 IST

ఆశావాద దృక్పథంతో ముందుకెళ్తేనే గ్రామీణాభివృద్ధి

వాసిరెడ్డి నారాయణరావు పుస్తకావిష్కరణ సభలో జయప్రకాశ్‌ నారాయణ

ఈటీవీ-హైదరాబాద్‌: ఆత్మవిశ్వాసం, ఆశావాద దృక్పథంతో ముందుకెళ్తేనే గ్రామీణాభివృద్ధి దిశగా నిర్దేశిత లక్ష్యాలను సాధించగలుగుతామని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్‌ నారాయణ అభిప్రాయపడ్డారు. దేశంలోని కొన్ని రంగాలు ఉత్పత్తి లక్ష్యాలను సాధించినప్పటికీ, చాలా రంగాలు వెనకబడే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగిన ‘అన్నదాత’ వ్యవసాయ మాసపత్రిక పూర్వ సంపాదకులు, డాక్టర్‌ వాసిరెడ్డి నారాయణరావు సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ, దేశాభివృద్ధికి కీలకమైన వ్యవసాయం, పశుపోషణ, గ్రామీణాభివృద్ధి కోసం నారాయణరావు పడిన తపన, చేసిన కృషి ఎంతో ఉందన్నారు. రైతు పక్షపాతం అందరి మనసులో ఉందని, ఆ మనసును మేధస్సుతో సంధానించకపోతే వారి ఆదాయాలు పెరగవన్నారు. ఈ సందర్భంగా ‘వ్యవసాయ రుషి వాసిరెడ్డి నారాయణ రావు’ పేరిట ప్రచురించిన స్మృతి సంచికను జయప్రకాశ్‌ నారాయణ, ‘ఈనాడు’ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ‘‘అత్యున్నత స్థానంలో ఉండి సాధారణ జీవితం గడిపిన వ్యక్తి పదుగురిలో ఒకనిగా సంతోషంగా జీవిస్తాడు. ఉన్నతంగా ఆలోచించే వ్యక్తి నిస్వార్థంగా జీవనం సాగిస్తాడు. ఈ రెండు లక్షణాల కలబోతగా మూర్తీభవించిన అరుదైన వ్యక్తి ‘మరపురాని మనీషి వాసిరెడ్డి గారు’ అంటూ రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఆ స్మృతి సంచికలో ప్రస్తావించి కొనియాడారు.


పాడి పరిశ్రమ అభివృద్ధి వెనక ‘అన్నదాత’ పత్రిక కృషి

తెలుగు రాష్ట్రాల్లో పాడి పరిశ్రమ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడం వెనుక అన్నదాత పత్రిక, దాని పూర్వ సంపాదకులు డాక్టర్‌ వాసిరెడ్డి నారాయణరావు కృషి ఎంతో ఉందని ఎం.నాగేశ్వరరావు అన్నారు. 30 ఏళ్ల క్రితం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాల కొరత తీవ్రంగా ఉండేదని, అదనంగా పాలు కావాలంటే సిఫారసు లేఖలు కావాల్సి వచ్చేవని గుర్తుచేశారు. పాల ఉత్పత్తులు పెరగడంతో ప్రొటీన్‌ కొరత తగ్గి ప్రజారోగ్యం మెరుగుపడిందన్నారు. రైతులు ఎంత ఎక్కువ పండిస్తే.. అంత ఎక్కువ నష్టపోయే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పంటలకు మద్దతు ధరలు లభించనంతవరకు అన్నదాతల కష్టాలు తీరవన్నారు. కీలకమైన వ్యవసాయ రంగాన్ని ఇలాగే నిర్లక్ష్యం చేస్తూ పోతే దేశంలో ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. నారాయణరావు ఆదర్శాలు ముందుకు తీసుకెళ్లేలా ఏటా ఆగస్టు 13న ప్రఖ్యాత వ్యవసాయ నిపుణులతో స్మారక ఉపన్యాస కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. సభకు కథా సాహితీ సంపాదకులు వాసిరెడ్డి నవీన్‌ అధ్యక్షత వహించగా, నారాయణరావు సతీమణి, మహిళా విజయం మాసపత్రిక సంపాదకులు కాశీరత్నం, కుమార్తెలు పుతుంబాక ఇంద్రాణి, పెనుమత్స మైత్రేయి, పడాల పద్మ, సన్నిహిత మిత్రుడు డాక్టర్‌ దొడ్డపనేని ప్రసాద్‌, అభ్యుదయ రైతు సుఖవాసీ హరిబాబు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని