విశ్వ యవనికపై వికసించిన మైత్రి

స్వాతంత్య్రం వచ్చే నాటికి భారత్‌ ఏకాకి. బ్రిటన్‌ను కాదని... మనతో జట్టు కట్టి.. వెన్నుతట్టిన దేశమంటూ లేదు. విదేశాంగ విధానం పరంగా తొలి ప్రధాని నెహ్రూ వేసిన అడుగులు విశ్వవేదికపై పథనిర్దేశం చేశాయి.

Updated : 14 Aug 2022 06:03 IST

ప్రపంచ దేశాలతో భారత్‌కు సుదృఢ బంధాలు

అంతర్జాతీయ కూటముల్లో కీలక భూమిక

స్వాతంత్య్రం వచ్చే నాటికి భారత్‌ ఏకాకి. బ్రిటన్‌ను కాదని... మనతో జట్టు కట్టి.. వెన్నుతట్టిన దేశమంటూ లేదు. విదేశాంగ విధానం పరంగా తొలి ప్రధాని నెహ్రూ వేసిన అడుగులు విశ్వవేదికపై పథనిర్దేశం చేశాయి. ఒంటరిగా ఆరంభమైన భారత్‌ ప్రయాణం... నేడు దాదాపు అన్ని దేశాలతో బంధాలు పెనవేసుకుని కొనసాగుతోంది. ఏళ్లు దొర్లుతున్నకొద్దీ మన సంతతి, సంస్కృతి, బంధాలు ప్రపంచమంతటా విస్తరిస్తూ, వేళ్లూనుకుంటూనే ఉన్నాయి. అంతర్జాతీయ కూటముల్లోనూ భారత్‌ కీలక భూమిక పోషిస్తోంది. శతాబ్ది ఉత్సవాలు జరుపుకొనే నాటికి దేశ అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉండాలి? వచ్చే పాతికేళ్లలో ఎలాంటి విధానాలను అనుసరించాలి?...


ఆధిపత్య రాజకీయాల్లో చిక్కుకోకుండా...

నెహ్రూ హయాంలో భారత్‌ అంతర్జాతీయంగా తటస్థ వైఖరిని అనుసరించింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా, నాటి సోవియెట్‌ల నేతృత్వంలో రెండు బలమైన కూటములు ఏర్పడ్డాయి. తమతో కలిసి రావాలంటూ ఇవి వర్ధమాన దేశాలపై ఒత్తిళ్లు తేవడంతో ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం నెలకొంది. అభివృద్ధి చెందుతున్న, చిన్న దేశాలు... వీటికి లొంగకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించేందుకు, సమైక్య స్వరం వినిపించేందుకు అలీనోద్యమ (నామ్‌) కూటమి అవతరించింది. నెహ్రూ ఆలోచనలతో అంకురించిన ఈ కూటమి తొలి సమావేశం 1961లో యుగోస్లేవియాలో జరిగింది. 25 దేశాలతో ప్రారంభమై నేడు 120 దేశాల ఉమ్మడి వేదికగా నిలుస్తోంది. 


* 1971లో భారత్‌-పాక్‌ యుద్ధం వేళ అమెరికా పాకిస్థాన్‌ పక్షాన నిలవడంతో భారత్‌ తన పంథాను మార్చుకుంది. నాటి సోవియట్‌ యూనియన్‌కు చేరువయ్యేలా విదేశాంగ విధానాన్ని మార్చుకుంది.


* 1980వ దశకంలో మాల్దీవుల్లో తిరుగుబాటు తలెత్తినప్పుడు నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ జోక్యం చేసుకోవడాన్ని అమెరికా స్వాగతించింది. ‘ప్రాంతీయ సమగ్రతను కాపాడటంలో భారత్‌ విలువైన సహాయం చేసింది’ అని నాటి అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ ప్రస్తుతించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ భూమిక పెరుగుతోందని ఆ దేశ అప్పటి విదేశాంగమంత్రి కూడా కితాబిచ్చారు. భారత్‌ క్రియాశీల దౌత్య వ్యూహాలకు దశాబ్దాల కిందటే అడుగులు పడ్డాయనడానికి ఇదో ఉదాహరణ.


* 1991 నుంచి 2004 వరకు పీవీ నరసింహారావు, వాజ్‌పేయీల హయాంలో భారత్‌ సరికొత్త ఆర్థిక శక్తిగా, అణ్వస్త్ర దేశంగా అవతరించింది. తర్వాత పదేళ్లపాటు మన్మోహన్‌సింగ్‌ పాలనాకాలంలో అమెరికాతో వ్యూహాత్మక దౌత్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి.


క్షీణ దశ నుంచి స్నేహపూర్వక స్థాయికి...

స్వాతంత్య్రానంతరం భారత్‌, అమెరికాల మధ్య మొదలైన సంబంధాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. 1971 భారత్‌-పాక్‌ యుద్ధ సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ పాక్‌కు మద్దతివ్వడంతో ఆ దేశంతో మన సంబంధాలు క్షీణించాయి. మళ్లీ పీవీ, మన్మోహన్‌సింగ్‌ల హయాంలో ఉభయ దేశాల నడుమ స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. ద్వైపాక్షిక సంబంధాలు దాటి వ్యూహాత్మక దశకు ఎదిగాయి. అణు సరఫరాదారుల సమూహంలో భారత్‌ను చేర్చిన అమెరికా... తన ప్రధాన రక్షణ భాగస్వామిగానూ మన దేశాన్ని అభివర్ణించింది. అమెరికన్లలో 72% మంది భారత్‌ పట్ల సానుకూలంగా ఉన్నట్టు 2019లో ఓ సర్వే వెల్లడించింది.


2014 నుంచి మోదీ దౌత్య వ్యూహాల ఫలితంగా ప్రాపంచికంగా భిన్న కూటముల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ‘నయా భారత్‌’ ఆవిర్భవిస్తోంది. తటస్థ విశ్లేషకుడు సి.రాజ్‌మోహన్‌ మాటల్లో చెప్పాలంటే.. మోదీకి సుదీర్ఘ పార్లమెంటరీ అనుభవంగానీ, అంతర్జాతీయ సంబంధాల్లో భూమికగానీ లేనప్పటికీ అంచనాలను తలకిందులు చేస్తూ ఇండియాను తిరుగులేని శక్తిగా నిలిపారు.


ఒత్తిళ్లకు తలొగ్గని నైజం...

విదేశాంగ విధానంలో భారత్‌ స్వతంత్రంగా వ్యవహరించగలదని 2022 నిరూపించింది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధంపై అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా దిల్లీ తటస్థ వైఖరికే కట్టుబడింది. ‘రష్యా అంటే భారత్‌కు వణుకు’ అన్న అధ్యక్షుడు బైడెన్‌ అసందర్భ వ్యాఖ్యలకు స్వయంగా శ్వేతసౌధమే సంజాయిషీ ఇచ్చుకుంది. ‘భారత్‌ తన భాగస్వాములను ఎంపిక చేసుకోవడంలో అమెరికా ఓ ఐచ్ఛికం మాత్రమే’నని చెప్పడం గమనార్హం. ఇటీవల ప్రభావశీలంగా కన్పిస్తున్న క్వాడ్‌ (అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌, ఇండియా)లోని మిగతా మూడు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినా భారత్‌ తన పంథా మార్చుకోలేదు.


కలగానే స్నేహ గీతిక

నాలుగు యుద్ధాల నేపథ్యంలో భారత్‌-పాక్‌ల మధ్య స్నేహగీతిక ఓ కలగానే మిగిలిపోతోంది. నిత్యం కవ్వింపు చర్యలతో పేచీకి దిగుతున్న పాక్‌... ఇండియా నుంచి ఏమి ఆశిస్తుందో తనకే స్పష్టత లేకుండా పోయింది. 2016 నుంచి సార్క్‌ సమావేశాలు నిలిచిపోవడంతో ఉభయ దేశాలు వేదికను పంచుకునే సందర్భాలు మృగ్యమయ్యాయి. పుల్వామాలో ఉగ్రదాడి, బాలాకోట్‌లో భారత్‌ మెరుపుదాడులతో 2019లో ప్రథమార్థంలో ఇండియా, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. అదే సమయంలో యూఏఈ వేదికగా నిర్వహించిన ఇస్లామిక్‌ దేశాల విదేశాంగ మంత్రుల సదస్సుకు నాటి విదేశీ వ్యవహారాలమంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. 18.5 కోట్ల భారతీయ ముస్లింల ప్రతినిధిగా ఆమె చేసిన ప్రసంగం సభికుల మనసులు గెలుచుకుంది.  ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ ద్వంద్వ వైఖరిని.. ఇస్లాం సంప్రదాయాలను బలంగా ఆచరించే పశ్చిమాసియా దేశాలు పశ్నించేలా చేయడంలో భారత్‌ సఫలీకృతమైంది.


డ్రాగన్‌ డోలాయమానం

భారత్‌-చైనా సంబంధాల్లోనూ ఊగిసలాట కొనసాగుతోంది. 1962లో యుద్ధం తర్వాత పలు ఒప్పందాలు కుదిరినా డ్రాగన్‌ తరచూ ఉల్లంఘిస్తూనే ఉంది. 2017లో డోక్లాంలో, 2020లో తూర్పు లద్దాఖ్‌లో జరిగిన ఘర్షణలు ఉభయదేశాల నడుమ శాంతి, సామరస్యతలను తీవ్రంగా దెబ్బతీశాయి. 2018లో వుహాన్‌లో, 2019లో మహాబలిపురంలో మోదీ, జిన్‌పింగ్‌ల చర్చల తర్వాతా ఉద్రిక్తతలు చల్లారలేదు.


1950-1980 మధ్య నాటి నాయకత్వ ఆలోచనా దృక్పథం, జాతీయ అవసరాలు మన విదేశాంగ విధానాన్ని శాసించాయి. 1962లో చైనాతో యుద్ధంలో పరాజయం, 1965లో పాక్‌పై విజయం, 1971లో బంగ్లా విమోచనంలో పైచేయి వంటి మిశ్రమ ఫలితాలు చూశాం.


సముద్ర భద్రత (మారిటైమ్‌ సెక్యూరిటీ)పై 2021లో ఐరాస భద్రతా మండలి నిర్వహించిన చర్చాగోష్ఠికి తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.


భారత్‌ 2015లో ఐరాసలో ప్రతిపాదించిన యోగా దినోత్సవానికి ఏకగ్రీవ మద్దతు లభించింది. ఏటా జూన్‌ 21న  సభ్య దేశాల్లో యోగా డే  జరుపుతున్నారు.


 కూటముల్లో మేటిగా...

* బ్రిటన్‌ పాలిత రాజ్యంగా కామన్వెల్త్‌ దేశాల కూటమి (చోగమ్‌)లో భారత్‌ కీలకంగా భాసిస్తోంది.

* నూతన పారిశ్రామిక దేశంగా, ప్రబల ఆర్థికశక్తిగా అవతరిస్తూ... బ్రెజిల్‌, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ‘బ్రిక్స్‌’లో కీలకంగా మారింది.

* నైబర్‌హుడ్‌ ఫస్ట్‌ విధానంతో పొరుగు దేశాలతో మైత్రికి ప్రాధాన్యమిస్తోంది.

* తూర్పు ఆసియా దేశాలతో విస్తృత ఆర్థిక, వ్యూహాత్మక బంధాల కోసం ‘లుక్‌ ఈస్ట్‌’ నినాదాన్ని అందుపుచ్చుకొంది.

* ప్రాంతీయంగా కీలకమైన ‘సార్క్‌’లో ప్రధాన భాగస్వామిగా ఉంది.

* శాంతి, సుస్థిరతలను పెంచేందుకు... ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక సహకారానికి పనిచేస్తున్న భిన్న కూటముల్లోనూ మనదేశం భాగస్వామిగా ఉంది. ఏసియన్‌ లీగల్‌ కన్సల్టేటివ్‌ కమిటీ, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఆస్ట్రేలియా గ్రూప్‌, ఏసియన్‌, బిమ్స్‌టెక్‌, జి-20, డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్‌, షాంఘై కోఆపరేషన్‌ కౌన్సిల్‌ వంటి వేదికల్లోనూ తన పాత్ర పోషిస్తోంది.

* అంతర్జాతీయ ఆధిపత్యం కోసం అర్రులు చాస్తున్న చైనాను నిలువరించి, ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇటీవల అవతరించిన ఇండో-పసిఫిక్‌ ఎకనామిక్‌ ఫ్రేమ్‌వర్క్‌లో భాగస్వామిగా చేరింది.

* ఇజ్రాయెల్‌, అమెరికా, యూఏఈ, భారత్‌లతో కలిసి పశ్చిమ క్వాడ్‌ పురుడు పోసుకుంటోంది.


సంకోచాన్ని విడనాడి... క్రియాశీలకం కావాలి...

అనేక కీలక అంశాల్లో అంతర్జాతీయంగా భారత్‌కు విశేష ప్రాధాన్యం లభిస్తోంది. అయినాసరే... మన దౌత్యవేత్తలు, విదేశాంగ మంత్రులు దేశ ప్రయోజనాల కోణంలో మెతక వైఖరిని ప్రదర్శించిన ఉదంతాలున్నాయి. ‘సమతూకం, తటస్థం, అలీనం’ వంటి పదాలను కట్టిపెట్టి... సందర్భాన్ని బట్టి సుస్పష్ట వైఖరిని వెల్లడించడం, క్రియాశీల పాత్ర పోషించడం నేటి అవసరం.

* స్వభావరీత్యా మనది సాత్విక దేశం. ప్రపంచంలో శాంతి, సద్భావనను పెంపొందించేందుకు ముఖ్య భూమిక పోషించాలి. తద్వారా దేశం పట్ల మరింత సుహృద్భావ వాతావరణాన్ని కల్పించుకోవాలి.

* దేశీయంగా చేపట్టిన సంస్కరణలు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో... విదేశీ భాగస్వామ్యాన్ని పెంపొందించేలా నూతన విధానాలను రూపొందించుకోవాలి. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ ప్రయోజనాలకు, సమ్మిళిత అభివృద్ధికి విఘాతం కలగకుండా చూసుకోవాలి.

* దృఢ బంధాల కారణంగా అమెరికా, రష్యా తదితర ధనిక దేశాలు భారత్‌నువిస్మరించలేని పరిస్థితులు నేడు ఉన్నాయి. ఐరోపా, ఆఫ్రికా దేశాలతోనూ ఆ స్థాయిలో సంబంధాలను మెరుగుపరచుకోవాలి.

* ఆర్థికంగా, వాణిజ్యపరంగా, సాంకేతికంగా కీలక రంగాల్లో ముందడుగు వేసేందుకు విదేశీ సహకారం ఎంతో కీలకం. ఇందుకు అవసరమైన సరళీకృత, ‘విన్‌-విన్‌’ విధానాలను రూపొందించుకోవాలి.

* దేశ ఆర్థిక ప్రగతిని బట్టి... ముఖ్యమైన అంతర్జాతీయ బాధ్యతల్లో భారత్‌ పాలుపంచుకోవాలి. తద్వారా ఇతర దేశాలకు మార్గదర్శకత్వం చేసే స్థాయికి ఎదగాలి.


శాశ్వత సభ్యత్వ హోదా సాధించాలి...

అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటుచేసుకున్న ఉమ్మడి వేదిక... ఐక్యరాజ్యసమితి. 1945 అక్టోబరు 24న ఏర్పాటైన ఐరాసలో ప్రస్తుతం 193 సభ్య దేశాలున్నాయి. ఇందులోని ఆరు ప్రధాన అంగాలలో అత్యంత కీలకమైనది భద్రతా మండలి. వ్యవస్థాపక సభ్యదేశమైనప్పటికీ... ఈ మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా కోసం భారత్‌ ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. మన దేశానికి ఆ హోదా రాకుండా మండలిలో వీటో అధికారమున్న చైనా కొర్రీలు వేస్తూనే ఉంది. శతాబ్ది ఉత్సవాలు జరుపుకొనే నాటికైనా ఈ హోదాను సాధించేందుకు గట్టి కృషి చేయాలి.


- ఈనాడు, ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు