సమున్నత కీర్తి బావుటా సగర్వంగా ఇంటింటా..

మూడు రంగుల ఆ జెండా మన కీర్తి పతాక. భారత జాతి అస్తిత్వ బావుటా.. 141 కోట్ల మంది ప్రజల విజయ దీపిక.ప్రగతి చిహ్నంగా అశోక చక్రాన్ని.. మదిలో నింపుకొన్న ఆ జెండా సగర్వంగా ఎగరడమే ప్రతి భారతీయుడి ఆశ.. శ్వాస..

Published : 15 Aug 2022 04:45 IST

జాతీయ పతాకం ఎగురవేసే విధానాల్లో ఎన్నో మార్పులు

మూడు రంగుల ఆ జెండా మన కీర్తి పతాక. భారత జాతి అస్తిత్వ బావుటా.. 141 కోట్ల మంది ప్రజల విజయ దీపిక.

ప్రగతి చిహ్నంగా అశోక చక్రాన్ని.. మదిలో నింపుకొన్న ఆ జెండా సగర్వంగా ఎగరడమే ప్రతి భారతీయుడి ఆశ.. శ్వాస..

తరాలు మారినా ఆ జెండా కలిగించే ప్రేరణలో ఇసుమంతైనా మార్పులేదు. అలాంటి పతాక పవిత్రతను కాపాడేందుకు 1950 సెప్టెంబరు 1న తొలిసారి చిహ్నాలు, పేర్లు (అక్రమంగా వినియోగించకుండా నిషేధం) చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం మన జాతీయ చిహ్నాలను, జాతీయ జెండాను ఎవరు పడితే వారు, ఎక్కడపడితే అక్కడ.. స్వప్రయోజనాల కోసం, వ్యాపారాల కోసం వాడకుండా నిషేధించారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే అప్పట్లోనే రూ.500 వరకూ జరిమానా.. విచారణ లేకుండా శిక్ష విధించవచ్చు. ఈ చట్టం భారతదేశంతో పాటు.. విదేశాల్లోని భారతీయ పౌరులకూ వర్తిస్తుంది. దీని ప్రకారం సామాన్య ప్రజలు తమ ఇళ్లలో లేదా సంస్థల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి అనుమతి లేదు. అనుమతి ఉన్న ప్రాంతాల్లోనూ రాత్రివేళ జెండా ఎగురవేయడం నిషేధం.

* 1971లో జాతీయ పతాకం గౌరవానికి భంగం కలిగించకుండా నిషేధించే చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఎవరైనా జాతీయ జెండాను కానీ, రాజ్యాంగ ప్రతిని కానీ దహనం చేసినా, చించినా, ఇతరత్రా ఏ రకంగా అవమానించినా వారికి జరిమానా లేక మూడేళ్ల జైలు శిక్ష లేక ఆ రెండూ విధిస్తారు. జాతీయ గీతాలాపనకు భంగం కలిగించినా ఈ శిక్షకు అర్హులవుతారు.

* జాతీయ చిహ్నాలు, పేర్లు, వాటి గౌరవం.. సంబంధిత చట్టాలు, నిబంధనలు, అమలు విధానాలను ఒకగొడుగు కిందకు తెచ్చే లక్ష్యంతో కేంద్రం 2002లో ‘ఫ్లాగ్‌ కోడ్‌ అఫ్‌ ఇండియా’ను అమల్లోకి తెచ్చింది. సులభ వినియోగానికి వీలుగా దీన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో జాతీయ జెండా సాధారణ నిబంధనలు, రెండో భాగంలో.. ప్రజలు, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు జెండా ఎగురవేయడంలో పాటించాల్సిన నిబంధనలను పేర్కొన్నారు. మూడో భాగంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి ఆధ్వర్యంలోని సంస్థలు పాటించాల్సిన విధివిధానాలను ప్రస్తావించారు. 2021 డిసెంబరు 30న ఈ సవరణ ప్రకారం.. సామాన్య ప్రజలు తమ ఇళ్లు లేదా కార్యాలయాల్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ జెండా ఎగురవేయడానికి అనుమతి లభించింది.

* ప్రతి ఇంటిపై, రాత్రింబవళ్లూ జాతీయ జెండాలు ఎగురవేయడానికి అనుమతిస్తూ తాజాగా గత నెల 20న కేంద్రం చట్టసవరణ చేసింది. తద్వారా నేడు దేశవ్యాప్తంగా అన్ని నివాసాలు, సంస్థలు, వాహనాలపై 24 గంటలూ జాతీయ జెండాలు సగర్వంగా ఎగురుతూ ప్రతి భారతీయుడి మదిలో దేశభక్తిని ప్రోది చేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని