మానవ కణజాలంతో త్రీడీ ప్రింటెడ్‌ కార్నియా అభివృద్ధి

దేశంలోనే మొట్టమొదటిసారిగా మానవ కణజాలం ఆధారంగా 3డి-ప్రింటెడ్‌ కార్నియాను అభివృద్ధి చేసినట్లు ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ (ఎల్‌వీపీఇఐ) ఆదివారం ప్రకటించింది. ఈ కార్నియాను కుందేలు

Updated : 15 Aug 2022 06:43 IST

కుందేలు కంటిలోకి విజయవంతంగా మార్పిడి

ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌, సీసీఎంబీ, ఐఐటీహెచ్‌ పరిశోధనలలో పురోగతి

ఈనాడు, హైదరాబాద్‌; ఫిలింనగర్‌ న్యూస్‌టుడే: దేశంలోనే మొట్టమొదటిసారిగా మానవ కణజాలం ఆధారంగా 3డి-ప్రింటెడ్‌ కార్నియాను అభివృద్ధి చేసినట్లు ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ (ఎల్‌వీపీఇఐ) ఆదివారం ప్రకటించింది. ఈ కార్నియాను కుందేలు కంటిలోకి విజయవంతంగా మార్పిడి చేసినట్లు వెల్లడించారు. ఇది కార్నియల్‌ స్కార్రింగ్‌ (కార్నియా పారదర్శకంగా లేకుండా మారడం) లేదా కెరటోకోనస్‌ (కార్నియా క్రమంగా సన్నగా మారడం) వంటి వ్యాధుల చికిత్సలో చవకగా అందించగలిగే ఆవిష్కరణ అని పేర్కొన్నారు. ప్రభుత్వం, దాతృత్వ నిధుల ద్వారా దీనిని తయారు చేశామని.. సింథటిక్‌ భాగాలు, జంతువుల అవశేషాలు లేనందున రోగులకు ఉపయోగించడానికి ఇది సురక్షితమైందని ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ ప్రధాన పరిశోధకులు డా.సయన్‌ బసు, డా.వివేక్‌ సింగ్‌ వివరించారు.

ఎలా చేశారంటే..:

ప్రపంచవ్యాప్తంగా కార్నియల్‌ ప్రత్యామ్నాయాల కోసం చురుగ్గా పరిశోధనలు జరుగుతున్నా అవి జంతు ఆధారమైనవి, కృత్రిమమైనవి. ఇవి భారత్‌ వంటి దేశాలకు అనువైనది కాదని తేలింది. ఈ నేపధ్యంలో ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి, ఐఐటీహెచ్‌, సీసీఎంబీ పరిశోధకులు ఒక ప్రత్యేకమైన హైడ్రోజెల్‌ను అభివృద్ధి చేశారు. దీనిద్వారా మానవ కంటి నుంచి సేకరించిన మూల కణాలను ఉపయోగించి సహజంగా ఉండే త్రీడీ ప్రింటెడ్‌ కార్నియాను అభివృద్ధి చేశారు. మానవ కణజాలం నుంచి ఉత్పన్నమయ్యే పదార్థాలతో దీన్ని తయారు చేసినందున సహజమైందిగా వైద్యులు చెబుతున్నారు. దాత నుంచి సేకరించిన ప్రతి కార్నియా నుంచి మూడు త్రీడీ ప్రింటెడ్‌ కార్నియాలను తయారు చేయొచ్చు. కార్నియాను 3మి.మీ. నుంచి 13 మి.మీ. వరకు వివిధ వ్యాసాల్లో ముద్రించి రోగులకు అమర్చవచ్చని ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు తెలిపారు.

ఎన్నో ప్రయోజనాలు..

* కార్నియా అనేది కంటి ముందు పొర.. ఇది కాంతిని కేంద్రీకరించడంలో, చూపు స్పష్టంగా ఉండడంలో సహాయపడుతోంది.

* కార్నియా దెబ్బతినడంవల్ల ఏటా 15 లక్షల మందికిపైగా దృష్టిలోపంతో బాధపడుతున్నారు.

* దాతల కొరతతో 5 శాతం మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు.

* త్రీడీ  ప్రింటెడ్‌ మానవ కార్నియాతో కార్నియల్‌ చిల్లులను మూసివేయడం, ఇన్‌ఫెక్షన్లను నిరోధించడం, గాయపడిన ప్రదేశంలో చూపు కోల్పోకుండా చూడడం సాధ్యమవుతుంది.

* త్రీడీ ప్రింటెడ్‌ కార్నియాలను రోగులకు ఉపయోగించే ముందు మరింత క్లినికల్‌ టెస్టింగ్‌ చేయాల్సి ఉంది. ఇందుకు చాలా సంవత్సరాలు పట్టవచ్చు అని పరిశోధకుల్లో ఒకరైనా సీసీఎంబీ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ బోకారా కిరణ్‌కుమార్‌ అన్నారు. ఐఐటీ హైదరాబాద్‌ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఫల్గుణి పతి, పరిశోధక విద్యార్థులు శిబు చమీట్టాచల్‌, దీక్షా ప్రసాద్‌, పరేఖ్‌ పరిశోధనలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని