అవినీతిపై అలుసొద్దు

‘అవినీతి ఉన్నచోట అభివృద్ధి సాధ్యం కాదు. అది సమాజానికి క్యాన్సర్‌ వంటింది. డిజిటల్‌ యుగంలోనూ అవినీతి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎవరో అవినీతి చేస్తే మాకెందుకని అనుకోవద్దు. మీ జీవితాల్లో పెనుమార్పులు

Published : 16 Aug 2022 03:15 IST

అది సమాజానికి క్యాన్సర్‌ వంటిది
విజన్‌-2047తో అగ్రగామిగా భారత్‌
తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ‘అవినీతి ఉన్నచోట అభివృద్ధి సాధ్యం కాదు. అది సమాజానికి క్యాన్సర్‌ వంటింది. డిజిటల్‌ యుగంలోనూ అవినీతి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎవరో అవినీతి చేస్తే మాకెందుకని అనుకోవద్దు. మీ జీవితాల్లో పెనుమార్పులు వస్తాయి. పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుంది’ అని మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్స్‌లో జరిగిన ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘ప్రతి ఒక్కరిలో వ్యక్తుల కంటే దేశమే మిన్న అనే భావన రావాలి. అదే స్వాతంత్య్ర సమరయోధులకు మనమిచ్చే ఘనమైన నివాళి. ప్రజా జీవితంలో ఉన్నవారు నైతిక విలువలతో వ్యవహరించాలి. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా పేదరికం, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, రోడ్లు, మౌలిక వసతులు లేని గ్రామాలు ఉండటం బాధాకరం. 400 ఏళ్ల కిందట ఎంతో ముందంజలో ఉన్న భారతదేశం వలస పాలనలో తీవ్రంగా నష్టపోయింది. స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ, పీవీ, వాజ్‌పేయీ, మోదీ వంటి వారు దేశాన్ని ముందుకు నడిపించారు. తెలుగుజాతి, బడుగు బలహీనవర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్‌ సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ముందుకెళ్లారు. నాడు పీవీ నరసింహారావు తీసుకువచ్చిన సంస్కరణలతో భారత్‌ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. ప్రపంచ దేశాలకు కరోనా టీకా అందించే దేశంగా అవతరించింది. దేశంలో వచ్చిన అనేక సంస్కరణలలో తెదేపా భాగస్వామిగా ఉన్నందుకు ఎంతో ఆనందిస్తున్నా. విజన్‌-2020తో లక్ష్యాలను నిర్దేశించుకుని జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషించింది’ అని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు కన్నెగంటి సీతారామయ్య, జయలక్ష్మి దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు.

25 ఏళ్లలో సమగ్ర ప్రగతికి 10 సూచనలు

స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకోవడానికి ఇంకా 25 ఏళ్లు ఉందని, ఈ వ్యవధిలో విజన్‌-2047 రూపొందించుకుని ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళితే భారత్‌ ప్రపంచంలోనే తొలి స్థానానికి ఎదుగుతుందని చంద్రబాబు తెలిపారు. ఈమేరకు రానున్న 25 ఏళ్లలో ఎలా ముందుకెళ్లాలనే అంశంలో ప్రత్యేకమైన ప్రణాళికతో, లక్ష్యంతో పని చేయాలని సూచించారు. మున్ముందు 9 రెట్లు సంపద పెంచుకుంటే మూడు అగ్రదేశాల్లో ఒకటిగా ఎదుగుతాం. 12 రెట్లు పెంచుకుంటే అమెరికాను, 15 రెట్లు పెంచుకుంటే చైనాను అధిగమిస్తామన్నారు. అందుకు పది అంశాలను సూచించారు.

విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించాలి.

ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలి.

యువశక్తికి అవకాశాలు కల్పించాలి. సమాచార, సాంకేతిక పరిజ్ఞానంతో యువత ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

దేశంలో సంపద సృష్టించి పేదలకు పంచాలి. ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం కోసం ఎప్పటికప్పుడు రోడ్‌మ్యాప్‌ను రూపకల్పన చేసుకోవాలి.

రైతుల కోసం ప్రత్యేక విధానాలు తీసుకురావాలి. 75 ఏళ్ల తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు దేశానికి గౌరవం కాదు. వారిని ఆదుకోవడానికి అందరూ ముందుకురావాలి.

విద్య, ఆరోగ్యం అందరికీ చేరువకావాలి.

మహిళా సాధికారతకు ప్రణాళికలు అమలు చేయాలి.

నదుల అనుసంధానం ప్రారంభం కావాలి. ఏపీలో గోదావరి-కృష్ణా అనుసంధానం చేశాం.

అవినీతి లేని పాలనను అందించాలి.

ప్రభుత్వంతోపాటు ప్రజలూ ఒక సంకల్పంతో, ప్రణాళికతో పనిచేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని