ఆగమేఘాలపై కార్యవర్గం

రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై ధార్మిక పరిషద్‌ను ఏర్పాటు చేసింది. మూడు రోజుల కిందట గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా అది సోమవారం బయటికొచ్చింది. దేవాదాయశాఖ మంత్రి ఛైర్మన్‌గా, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యునిగా,

Updated : 16 Aug 2022 06:35 IST

ధార్మిక పరిషద్‌పై ప్రభుత్వం ఉత్తర్వులు
నేడు కోర్టు ధిక్కరణ కేసు విచారణ నేపథ్యంలో నిర్ణయం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై ధార్మిక పరిషద్‌ను ఏర్పాటు చేసింది. మూడు రోజుల కిందట గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా అది సోమవారం బయటికొచ్చింది. దేవాదాయశాఖ మంత్రి ఛైర్మన్‌గా, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యునిగా, కమిషనర్‌ కార్యదర్శిగా, తితిదే ఈవో సహా ఇతర సభ్యులు కలిపి మొత్తం 21 మంది కార్యవర్గంతో దీనిని ఏర్పాటు చేసింది. ఓ కేసు విషయంలో హైకోర్టు ఆదేశాల ధిక్కరణపై మంగళవారం విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చాలాకాలంగా పూర్తి స్థాయి కార్యవర్గం ధార్మిక పరిషద్‌ లేదు. దేవాదాయ మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, తితిదే ఈవో కూడిన పరిషద్‌ మాత్రమే కొనసాగుతోంది. 2020లో తిరుపతి హథీరాంజీ మఠాధిపతిని తొలగిస్తూ అప్పటి దేవాదాయ కమిషనర్‌, ధార్మిక పరిషద్‌ కార్యదర్శి హోదాలో ఆదేశాలిచ్చారు. దీనిపై ఆ మఠాధిపతి హైకోర్టును ఆశ్రయించారు. పూర్తిస్థాయి కార్యవర్గం లేకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం ఆ నలుగురితో కూడిన ధార్మిక పరిషద్‌ పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కల్పిస్తూ చట్టసవరణ చేసింది. దీనిని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. పూర్తిస్థాయిలో ఎందుకు ఏర్పాటు చేయడంలేదని నిలదీసింది. కొంతకాలం కిందట దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న వాణీమోహన్‌ హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ కేసుపై మంగళవారం విచారణ జరగనుంది.

మరోవైపు వైఎస్‌ఆర్‌ జిల్లాలో బ్రహ్మంగారి మఠానికి చెందిన మఠాధిపతి మృతి చెందడంతో.. ఆయన ఇద్దరు భార్యల కుమారుల్లో ఎవరిని మఠాధిపతిగా నియమించాలనే దానిపై వివాదం ఏర్పడింది. దేవాదాయశాఖ తరఫున తాత్కాలికంగా ఒక ఇన్‌ఛార్జిని నియమించారు. మఠాధిపతి రెండో భార్య హైకోర్టును ఆశ్రయించారు. నలుగురితో కూడి ధార్మిక పరిషద్‌కు అధికారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో పూర్తిస్థాయి పరిషద్‌ ఏర్పాటు చేసినట్లు దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.

సభ్యులు వీరే..

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.వెంకటరమణ, రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి కె.సూర్యారావు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అజేయ కల్లాం, దేవాదాయశాఖ రిటైర్డ్‌ అదనపు కమిషనర్‌ ఏబీ కృష్ణారెడ్డి, వంశపారంపర్య ధర్మకర్తలు దాతులూరి జగన్నాథరాజు చౌట్రీ (భీమవరం)కి చెందిన ఎం.రామకుమార్‌రాజు, అన్నవరం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఇనుగంటి వెంకటరోహిత్‌, యాదాల్ల పిచ్చయ్య చౌట్రీ (కడప) డాక్టర్‌ జ్వాలా చైతన్య, చాకవారి చౌట్రీ (పాలకొల్లు) చాకా ప్రభాకరరావు, మాకా బాలాజీ, రాజన్‌ సుభాషిణి, తిరుమల  పెద్ద జీయంగార్‌ మఠం మఠాధిపతి, వైఎస్‌ఆర్‌ జిల్లా పుష్పగిరి మఠం మఠాధిపతి, దాతలు సంగా నర్సింహరావు, యూకే విశ్వనాథరాజు, ఆగమ పండితులు పీవీఎస్‌ఎస్‌ఆర్‌ జగన్నాథాచార్యులు, సీహెచ్‌.శ్రీరామశర్మ, ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ శ్రీరామమూర్తిలను ప్రభుత్వం   పరిషద్‌లో సభ్యులుగా నియమించింది. దేవాదాయ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌, తితిదే ఈవో కాకుండా.. మిగిలిన 17 మంది అనధికార సభ్యుల పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. వీరిలో   కె.సూర్యారావు ప్రస్తుతం దేవాదాయశాఖ న్యాయ సలహాదారుగా ఉన్నారు.

ధార్మిక పరిషద్‌ అధికారాలివి..

దేవాదాయశాఖకు సలహా మండలిగా వ్యవహరిస్తుంది. రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు పాలకవర్గాలను నియమిస్తుంది. ఉల్లంఘనలు జరిగి, ఫిర్యాదులు వచ్చినపుడు మఠాధిపతులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం.. మఠాధిపతి చనిపోతే కొత్తవారిని నియమించే అధికారం ధార్మిక పరిషద్‌కు ఉంటుంది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts