యాప్‌ హాజరుపై అంతర్గత పోరు

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల యాప్‌ ఆధారిత హాజరుపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. యాప్‌ ఆధారిత హాజరును ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో), ఇతర

Updated : 16 Aug 2022 06:51 IST

డౌన్‌లోడ్‌ చేసుకోవద్దంటున్న ఉపాధ్యాయ సంఘాలు
నేటి నుంచి తప్పనిసరని విద్యాశాఖ అధికారుల ఆదేశాలు


గురువుల సెల్ఫీ పాట్లు

చిత్రంలోని వ్యక్తులు సెల్‌ఫోన్లో ఫొటోలు దిగుతున్నారనుకుంటే పొరపాటే. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఉపాధ్యాయుల పడుతున్న పాట్లు ఇవి. ఉపాధ్యాయుల హాజరు నమోదుపై ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటి ప్రకారం మొబైల్‌ యాప్‌లో సెల్ఫీ అప్‌లోడ్‌ చేస్తేనే హాజరు నమోదవుతుంది. మంగళవారం నుంచి ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఈ యాప్‌లో ముఖం, కళ్లు తదితర ఫొటోలు అప్‌లోడ్‌ చేసుకునేందుకు సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గౌరిదేవిపేట జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. సిగ్నల్స్‌ అందకపోవడంతో వివరాలు అప్‌లోడ్‌ కావడం లేదని వారు వాపోతున్నారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో సంకేతాలు అందవని, ఇక్కడ ఈ విధానానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.

- ఎటపాక, న్యూస్‌టుడే


నాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల యాప్‌ ఆధారిత హాజరుపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. యాప్‌ ఆధారిత హాజరును ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో), ఇతర ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాల సూచనలతో చాలా మంది యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోలేదు. మంగళవారం నుంచి యాప్‌లో హాజరు వేయాల్సిందేనని, దీన్నే ప్రామాణికంగా తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది పాఠశాల విద్యలో ఉపాధ్యాయులు, అధికారుల మధ్య అంతర్గత పోరుకు దారి తీసింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆన్‌లైన్‌ హాజరుపై ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాల విద్యాశాఖ ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ ఆధారిత) హాజరు నమోదుకు ప్రత్యేకంగా యాప్‌ తీసుకొచ్చింది. ఉపాధ్యాయుల సెల్‌ఫోన్‌లోనే దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని, తమ ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి. ప్రతిరోజూ పాఠశాల వద్ద యాప్‌ ఓపెన్‌ చేసి, హాజరు నమోదు చేయాలి. ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా సగం రోజు సెలవుగా పరిగణిస్తారు. ఉదయం పాఠశాలకు వచ్చినప్పుడు, సాయంత్రం తిరిగివెళ్లేటప్పుడు రెండు పర్యాయాలు హాజరు నమోదు చేయాలి.

అనేక సందేహాలు

యాప్‌ హాజరుపై ఉపాధ్యాయుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కిలోమీటరు దూరంలోని ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేశారు. ఉపాధ్యాయులను కొత్త బడిలో సర్దుబాటు చేశారు. యాప్‌లో మాత్రం పాత పాఠశాలలోనే ఉన్నట్లు చూపిస్తున్నారు. వీరి హాజరు నమోదుపై అనేక ఫిర్యాదులు రావడంతో సోమవారం రాత్రి విద్యాశాఖ అధికారులు మార్గదర్శకాలిచ్చారు. అప్పటికే ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లిపోయినందున మంగళవారం ఉదయం హాజరు ఎలాగనే ఆందోళన నెలకొంది.

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఏదైనా కారణంతో ఉపా ధ్యాయులు కొంచెం ఆలస్యంగా వస్తే.. సగం రోజు హాజరు లేకున్నా పాఠాలు చెప్పాలా? సెలవు తీసుకోవాలా? సెలవు తీసుకుంటే అప్పటికప్పడు వేరే ఉపాధ్యాయుణ్ని ఎలా సర్దుబాటు చేస్తారో స్పష్టత లేదు.

ఉదయం 9 గంటల్లోపే హాజరు వేయాలనే నిబంధన పెట్టారు. ఎక్కడైనా నెట్‌వర్క్‌ సమస్యతో హాజరుపడకపోతే పరిస్థితి ఏమిటనేదీ సందిగ్ధమే.  

యాప్‌ను ఉపాధ్యాయుల సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలనే నిబంధన పెట్టారు. స్మార్ట్‌ఫోన్‌ లేని ఉపాధ్యాయులు ఏం చేయాలి? కొంత మంది టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌ వినియోగంపై సరైన అవగాహన లేదు. వీరి హాజరు నమోదు ఎలా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

ప్రభుత్వమే తమకు ట్యాబ్‌లు ఇచ్చి, ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. తమిళనాడు, కర్ణాటకల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉందని చెబుతున్నారు.


యాప్‌ హాజరును రద్దు చేయాలి

-నరహరి, రమణయ్య, డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

సెల్‌ఫోన్‌లో హాజరు వేసే విధానాన్ని రద్దు చేయాలి. సొంత సెల్‌ఫోన్‌లో ఈ యాప్‌ వేసుకోవడం వల్ల ఉపాధ్యాయుల వ్యక్తిగత సమాచార భద్రతకు విఘాతం కలుగుతుంది. ఏకోపాధ్యాయులు సకాలంలో హాజరుకాకపోతే ఆ పాఠశాల ఆ రోజు మూతపడుతుంది. గతంలోలాగా డివైజ్‌లు, ఇంటర్నెట్‌ సదుపాయం ఇస్తే హాజరు వేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు.


ఉపాధ్యాయుణ్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం
- హృదయరాజు, చిరంజీవి, ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

పాధ్యాయులందరికీ స్మార్ట్‌ఫోన్లు లేవు. చాలా ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సౌకర్యం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుణ్ని దోషిగా నిలబెట్టి, విద్యావ్యవస్థను కార్పొరేట్‌ పరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. యాప్‌ల భారం తగ్గించి, బోధనకు అవకాశం ఇవ్వాలి.


ఆఫ్‌లైన్‌ ఎంచుకునే అవకాశం  

- సురేష్‌కుమార్‌, కమిషనర్‌, పాఠశాల విద్యాశాఖ

నెట్‌వర్క్‌ సమస్య లేకుండా ఆఫ్‌లైన్‌ ఎంపిక అవకాశం ఇచ్చాం. సిగ్నల్‌ వచ్చిన తర్వాత డేటా సర్వర్‌కు వస్తుంది. ఇప్పటికే రంపచోడవరంలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాం.

పాఠశాలలు ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతాయి. ఉపాధ్యాయులు దీనికి అర్ధగంట ముందే రావాలి. కాబట్టి హాజరు నమోదు ఆలస్యమవుతుందనే సమస్య ఉండదు. యాప్‌ హాజరు నమోదును కొద్ది రోజులు పరిశీలించిన తర్వాత ఎంత మంది ఆలస్యంగా వస్తున్నారు? నెట్‌వర్క్‌ సమస్య  ఎన్నిచోట్ల  ఉంటోంది వంటివి పరిశీలించి, ఉదయం 9 గంటల నిబంధనపై నిర్ణయం తీసుకుంటాం.

ఎక్కువ రోజుల సెలవుకు సంబంధించిన మరో సబ్‌మాడ్యూల్‌ను యాప్‌లో త్వరలో తీసుకువస్తాం.

ట్రెజరీలకు వెళ్లే పని లేకుండా ఉపాధ్యాయుల జీతాల బిల్లుకూ ఆన్‌లైన్‌ హాజరును అనుసంధానించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని