జగనన్న గోరుముద్దకు ధరాఘాతం

పిల్లలకు మేనమామలా ఉంటానని పదేపదే చెబుతున్న సీఎం జగన్‌.. వారు తినే మధ్యాహ్న భోజనం ఛార్జీలను మాత్రం పెంచడం లేదు. మెనూ మార్పు చేసినట్లు గొప్పగా చెబుతున్నా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఛార్జీల పెంపునకు మాత్రం చొరవ

Updated : 16 Aug 2022 06:48 IST

విద్యార్థులకు మధ్యాహ్న భోజనంపై ధరల పెరుగుదల ప్రభావం
ఛార్జీలు పెంచకపోతే నాణ్యమైన భోజనం పెట్టలేమంటున్న వంట ఏజెన్సీలు
ఈనాడు - అమరావతి


రుచికరమైన పోషకాహారాన్ని అందించేలా జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నాం. రోజూ ఒకేరకంగా కాకుండా నాణ్యమైన భోజనం పెట్టేందుకు మెనూలో మార్పులు చేశాం. నిర్దేశించిన మెనూ మేరకు పిల్లలకు ఆహారం అందుతుందా లేదా నిరంతరం పర్యవేక్షించాలి.

- సమీక్షల్లో సీఎం జగన్‌


మార్కెట్‌లో గ్యాస్‌, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇందుకు అనుగుణంగా జగనన్న గోరుముద్ద పథకం భోజనం ఛార్జీలు పెంచలేదు. కందిపప్పు, నూనెలు, చింతపండు, కూరగాయల ధరలు అప్పటితో పోల్చితే 17 శాతం నుంచి 90 శాతం వరకు పెరిగాయి. పిల్లలకు భోజనం పెట్టేందుకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవడం లేదు.

- మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులు


పిల్లలకు మేనమామలా ఉంటానని పదేపదే చెబుతున్న సీఎం జగన్‌.. వారు తినే మధ్యాహ్న భోజనం ఛార్జీలను మాత్రం పెంచడం లేదు. మెనూ మార్పు చేసినట్లు గొప్పగా చెబుతున్నా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఛార్జీల పెంపునకు మాత్రం చొరవ చూపడం లేదు. జగనన్న గోరుముద్దగా పథకం పేరు మార్చిన ప్రభుత్వం.. చుక్కలను తాకుతున్న ధరలకు అనుణంగా భోజనం ఛార్జీలు పెంచడంపై దృష్టి సారించడం లేదు. భోజనం నాణ్యంగా ఉండాలి.. తనిఖీలు నిర్వహించాలని ఆదేశిస్తున్న అధికారులు ఛార్జీలు పెంచకపోతే నాణ్యత ఎలా వస్తుందో ఆలోచించడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న ధరలతో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడం ఇబ్బందిగా మారిందని వంట కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 45,054 పాఠశాలల్లోని 38.44 లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. 1-5 తరగతుల్లో ఒక్కో విద్యార్థికి రోజుకు కేంద్రం రూ.1.98 ఇస్తుండగా.. రాష్ట్రం రూ.2.42 చెల్లిస్తోంది. 6- 8 తరగతులకు కేంద్రం రూ.4.44, రాష్ట్రం రూ.3.36 భరిస్తున్నాయి. 9,10 తరగతులకు రూ.7.80 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రస్తుత ధరలకు ఈ ఛార్జీలు సరిపోవడం లేదని, ఒక్కో విద్యార్థికి రూ.9- రూ.10 ఇవ్వాలని వంట ఏజెన్సీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

గ్యాస్‌ బండ భారం

వంట ఏజెన్సీల నిర్వాహకులకు ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వడం లేదు. దీంతో సరకుల ధరలతో పాటు సిలిండర్‌ భారాన్నీ మోయాల్సి వస్తోంది. 800 మంది కంటే ఎక్కువ మంది పిల్లలున్న చోట రోజుకో సిలిండర్‌ ఖాళీ అవుతోంది. దాని ధర కూడా రూ.1,076కు పెరగడంతో చాలా బడుల్లో కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. వంట ఏజెన్సీలకు బిల్లులు చెల్లించడంలోనూ తరచూ జాప్యం చేస్తున్నారు. చాలా చోట్ల జూన్‌, జులై నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ధరల పెరుగుదలకు తోడు బిల్లులు సకాలంలో అందకపోవడంతో తమకు గిట్టుబాటవడం లేదని వంట ఏజెన్సీల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌ను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని కోరుతున్నారు.


తమిళనాడు విధానం అమలు చేయాలి

-స్వరూపరాణి, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి

రలు పెరిగాయి.. భోజనం ఛార్జీలు పెంచాలని ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు చాలక వంట కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడు మాదిరిగా మధ్యాహ్న భోజన పథకంలో రోజువారీ కొనే కూరగాయలు మినహా గ్యాస్‌తో పాటు అన్నింటిని ప్రభుత్వమే సరఫరా చేయాలి. లేదంటే ఛార్జీలు పెంచాలి.


ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం

- దివాన్‌ మైదీన్‌, డైరెక్టర్‌, మధ్యాహ్న భోజనం పథకం

ధ్యాహ్న భోజనం పథకం ఛార్జీల పెంపుపై కేంద్రానికి లేఖ రాశాం. రాష్ట్ర ప్రభుత్వానికీ  ప్రతిపాదనలు పంపాం. ఛార్జీల పెంపుపై త్వరలో నిర్ణయం రావచ్చు.

 

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని