Published : 18 Aug 2022 05:21 IST

ప్రభుత్వం మొండికేస్తే ‘యాప్‌ డౌన్‌’

 ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం  

నేడు మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో ఫ్యాప్టో భేటీ  

సానుకూల నిర్ణయం రాకపోతే కార్యాచరణపై ప్రకటన

ఈనాడు, అమరావతి: యాప్‌ ఆధారిత నమోదుపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మొత్తం యాప్‌లను డౌన్‌ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. ఈ-హాజరు నమోదుపై ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులను కలవనున్నారు. యాప్‌ల భారంతో బోధనకు ఏర్పడుతున్న ఆటంకాలు, ఈ-హాజరుతో క్షేత్రస్థాయిలో వస్తున్న సమస్యలను వారికి విన్నవించనున్నారు. వారి నుంచి వచ్చే హామీ మేరకు కార్యాచరణ ప్రకటించనున్నారు. సానుకూల హామీ లభించకపోతే అన్ని యాప్‌లను నిలిపివేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల హాజరు, మరుగుదొడ్ల శుభ్రత, విద్యాకానుక, ‘నాడు-నేడు’ పనుల వివరాలను ఉపాధ్యాయులు యాప్‌ల్లో నమోదు చేస్తున్నారు. తమ సొంత సెల్‌ఫోన్ల ద్వారానే వాటిని నిర్వహిస్తున్నారు. యాప్‌ల డౌన్‌ ప్రకటిస్తే ఆ వివరాల సేకరణ నిలిచిపోతుంది. సొంత సెల్‌ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని, హాజరు నమోదు చేయబోమని పేర్కొంటూ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులకు బుధవారం కూడా ఉపాధ్యాయులు వినతులు సమర్పించారు. ఇందుకోసం ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యేక నమూనా సిద్ధం చేసి పంపాయి. బుధవారం ఈ-హాజరు నమోదు 50 శాతంలోపే నమోదైంది. చాలామంది ఉపాధ్యాయులు యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోలేదు. సిగ్నల్స్‌, సాంకేతిక సమస్యల కారణంగా కొందరి హాజరు నమోదు కాలేదు. 

వ్యక్తిగత భద్రతకు ముప్పు! 

ముఖ ఆధారిత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం వల్ల ఫోన్‌లోని వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు ఏర్పడవచ్చని ఉపాధ్యాయులు అంటున్నారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత కాల్స్‌ మేనేజ్‌, ఫొటోలు, వీడియోల మేనేజ్‌కు అనుమతి ఇవ్వాల్సి వస్తోందని, లోకేషన్‌ ఆన్‌ చేస్తేనే హాజరు తీసుకుంటోందని, దీని కారణంగా తమ వ్యక్తిగత భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఫోన్‌లోని సమాచారం ఇతరులు తెలుసుకునే వీలుంటుందని ఆందోళన చెందుతున్నారు. కొందరైతే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న ఫోన్‌ను పక్కనపెట్టి వ్యక్తిగత కాల్స్‌ కోసం మరో ఫోన్‌ వాడుతున్నారు. ప్రభుత్వమే డివైజ్‌లు, డాటా ఇస్తే హాజరు నమోదుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఈ-హాజరును తాము వ్యతిరేకించడం లేదని చెబుతున్నారు. సొంత ఫోన్‌లో యాప్‌లు వేసుకోవడాన్నే వ్యతిరేకిస్తున్నామని అంటున్నారు.

86 మందికి షోకాజ్‌ నోటీసులు..

బుధవారం మధ్యాహ్న భోజనం పథకం విద్యార్థుల హాజరు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 86 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కర్నూలు జిల్లా విద్యాధికారి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. యాప్‌ పని చేయకపోవడం వల్లనే హాజరు నమోదు చేయలేకపోయామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.


ముఖ హాజరుతో ముప్పుతిప్పలు

వెంకట్‌నగర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే:  పాఠశాలల్లో ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు నమోదులో రెండోరోజూ ఇబ్బందులు తప్పలేదు. కొందరు యాప్‌ డౌన్‌లోడ్‌ కోసమే గంటల తరబడి ప్రయత్నం చేయాల్సి వచ్చింది. బుధవారం ఉదయం 9 గంటలకు ఒకేసారి వేలమంది హాజరు నమోదుకు సిద్ధమవడంతో సర్వర్‌ స్తంభించి సేవలు నిలిచిపోయాయి. చాలామందికి లాగిన్‌ అయ్యేందుకే అవకాశం రాలేదని ఉపాధ్యాయులు తెలిపారు. మధ్యాహ్నం వరకు సర్వర్‌ అందుబాటులోకి రాకపోవడంతో ఉపాధ్యాయుల హాజరు నమోదు కాలేదు. ఈ విధానం బోధనపై తీవ్ర ప్రభావం చూపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని