టెండర్లలో నిబంధనలకు పాతరేస్తున్న ఏపీఈడబ్ల్యుఐడీసీ

ఏపీ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యుఐడీసీ) టెండర్ల ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పరిపాలన అనుమతులు లేకుండానే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, గుత్తేదారుతో ఒప్పందం

Published : 18 Aug 2022 04:51 IST

  పాఠశాలల్లో సామగ్రి కొనుగోళ్లపై విమర్శలు

ఈనాడు, అమరావతి: ఏపీ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యుఐడీసీ) టెండర్ల ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పరిపాలన అనుమతులు లేకుండానే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, గుత్తేదారుతో ఒప్పందం చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల పనులకు సంబంధించిన సామగ్రి కొనుగోలుకు టెండర్లు నిర్వహించే బాధ్యతలను ఏపీఈడబ్ల్యుఐడీసీకి అప్పగించారు. ‘నాడు-నేడు’ మొదటి విడత పూర్తి చేసిన ఉన్నత పాఠశాలకు రెండు, ప్రాథమిక పాఠశాలకు ఒకటి చొప్పున అగ్నిమాపక పరికరాలు కొనేందుకు రూ.9 కోట్లకుపైగా అంచనాలతో టెండర్లను పిలిచారు. వీటికి సమగ్ర శిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) నుంచి నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు వచ్చిన తర్వాత టెండర్లను ఖరారు చేసి, గుత్తేదారుతో ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా సంస్థ వ్యవహరించింది. గుత్తేదారుతో ఒప్పందం జరిగిన తర్వాత పరిపాలన అనుమతి కోసం దస్త్రాన్ని ఎస్‌ఎస్‌ఏకి పంపింది. ఈ విషయం తెలిసిన అప్పటి ప్రాజెక్టు డైరెక్టర్‌ ఈ దస్త్రాన్ని పక్కన పెట్టారు. ఇటీవల ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మరో అధికారి ఈ దస్త్రానికి ఆమోదం తెలిపారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు ఇతర అంశాల్లోనూ ఏపీఈడబ్ల్యుఐడీసీ నిబంధనలు ఉల్లంఘించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొదటి విడత ‘నాడు-నేడు’లో డ్యూయల్‌ డెస్క్‌లు, గ్రీన్‌ చాక్‌పీస్‌ బోర్డులు తదితర సామగ్రి టెండర్లలోనూ నిబంధనలకు పాతరేశారు. ఒప్పందం కుదుర్చుకున్న మొత్తం కంటే అదనంగా 50 శాతం ఆర్డర్లు ఇచ్చారు. అంచనాల కంటే 10శాతం మించితే కొత్తగా టెండర్లు పిలవాల్సిఉన్నా పట్టించుకోలేదు. అదనంగా సరఫరా చేసిన దానికి గుత్తేదారుతో ఒప్పందం చేసుకోకుండానే చెల్లించేశారు. ఇలా రూ.కోట్ల చెల్లింపులు జరపడంపైనా విమర్శలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని