సంక్షిప్త వార్తలు

రాష్ట్రంలోని 10 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన మరో 6 నెలలు పొడిగించారు. వీరి పదవీ కాలం ఈ ఏడాది జూన్‌, ఇంకొన్ని చోట్ల జులైలో ముగిసింది. ఆమదాలవలస, చింతలపూడి, వైఎస్‌ఆర్‌

Published : 18 Aug 2022 04:51 IST

10 చోట్ల ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని 10 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన మరో 6 నెలలు పొడిగించారు. వీరి పదవీ కాలం ఈ ఏడాది జూన్‌, ఇంకొన్ని చోట్ల జులైలో ముగిసింది. ఆమదాలవలస, చింతలపూడి, వైఎస్‌ఆర్‌ తాడిగడప, నరసరావుపేట, పొన్నూరు, కందుకూరు, పొదిలి, కావలి, ఆలూరు, బి.కొత్తకోట పురపాలక, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన పొడిగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


వక్ఫ్‌బోర్డు సభ్యునిగా షెర్వాని తొలగింపు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వక్ఫ్‌బోర్డు సభ్యునిగా కె.కె. షెర్వానిని తొలగిస్తూ మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇంతియాజ్‌ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. షెర్వాని తెదేపా ప్రభుత్వ హయాంలో వక్ఫ్‌బోర్డు సభ్యునిగా నియమితులయ్యారు. తాజాగా ఆయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో తొలగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఏపీఎంఎస్‌ఈఎఫ్‌ కౌన్సిల్‌ పునర్‌నియామకం

ఈనాడు, అమరావతి: ఏపీ స్టేట్‌ మైక్రో అండ్‌ స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఫెసిలిటేషన్‌ కౌన్సిల్‌ (ఏపీఎంఎస్‌ఈఎఫ్‌సీ)ని పునర్‌నియమిస్తూ ప్రభుత్వం బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. పరిశ్రమలశాఖ సంచాలకులు ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. సభ్యులుగా ఫ్యాప్సీ అధ్యక్షులుగానీ, అతను నామినేట్‌ చేసినవారు, ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ ఎండీగానీ, ఆయన నామినేట్‌ చేసే డిప్యూటీ జీఎం స్థాయికి తగ్గని అధికారి, ఏపీఐఐసీ జీఎం (లీగల్‌), పరిశ్రమలశాఖ సంయుక్త సంచాలకులు (ఎంఎస్‌ఎంఈ)ను నియమించారు. 


జవాన్‌ రాజశేఖర్‌ మృతికి సీఎం సంతాపం   

జమ్ము కశ్మీర్‌లో జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిన దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డి.రాజశేఖర్‌తో పాటు మరికొందరు జవాన్లు దుర్మరణం చెందడంపై సీఎం జగన్‌ విచారం వ్యక్తం చేశారు. ఆ దుర్ఘటనలో మృతిచెందిన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాజశేఖర్‌ది అన్నమయ్య జిల్లాలోని సంబెపల్లి మండలంలోని దేవపట్ల గ్రామం. 


సీమకు 15 వేల టన్నుల బియ్యం తరలింపు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా నుంచి రాయలసీమ జిల్లాలకు 15వేల టన్నుల బియ్యాన్ని తరలించినట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు డి.పుష్పమణి చెప్పారు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన (పీఎంజీకేఏవై) కింద పేదలకు ఉచిత బియ్యం పంపిణీకి వీటిని తరలించినట్లు తెలిపారు. జిల్లాలో సీఎంఆర్‌ కింద సేకరించిన నాన్‌సార్టెక్స్‌ (ముతక బియ్యం)ను పంపామన్నారు. కడప జిల్లాకు 10వేల టన్నులు, కర్నూలు, సత్యసాయి జిల్లాలకు 2,500 టన్నుల చొప్పున బియ్యాన్ని తరలించినట్లు వివరించారు. జిల్లాలో సమృద్ధిగా నాన్‌సార్టెక్స్‌ బియ్యం నిల్వలు ఉన్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని