వైద్యుల పోస్టుల రద్దుపై దుమారం

వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల రద్దు దుమారాన్ని రేకెత్తిస్తోంది. పలుచోట్ల వైద్యులు ఆందోళనబాట పట్టారు. నంద్యాల, విజయనగరం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, ఏలూరు జిల్లా ఆసుపత్రులను రాష్ట్ర

Published : 18 Aug 2022 04:56 IST

పలు జిల్లాల్లో రోడ్డెక్కిన డాక్టర్లు

ఈనాడు-అమరావతి: వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల రద్దు దుమారాన్ని రేకెత్తిస్తోంది. పలుచోట్ల వైద్యులు ఆందోళనబాట పట్టారు. నంద్యాల, విజయనగరం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, ఏలూరు జిల్లా ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వం బోధనాసుపత్రులుగా మార్చింది. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో 250 ఆసుపత్రులు ఉంటే.. ఆర్థోపెడిక్‌ వైద్యుల (సివిల్‌ సర్జన్‌) పోస్టులు 6 మాత్రమే ఉన్నాయి. ఇంతకుముందు 36 ఆర్థోపెడిక్‌ (సివిల్‌ సర్జన్‌) పోస్టులు (శాంక్షన్డ్‌) ఉన్నాయి. వీరిలో 22 మంది పనిచేస్తున్నారు. మిగిలిన పోస్టులను కింది స్థాయిలో సర్దుబాటు చేయడంపై వైద్యులు మండిపడుతున్నారు. పోస్టుల రద్దు కారణంగా కొన్ని విభాగాల్లో జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ లాంటి విభాగాల్లో ప్రస్తుత అవసరాల కంటే ఎక్కువ పోస్టులు చూపించారు. ఈ సంఖ్యకు తగ్గట్లు వైద్యులు లేరు. ఇవి ఖాళీగానే ఉంటాయి. ఈఎన్‌టీ, ఆప్తల్‌మాలజీ, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్‌, పాథాలజీ పోస్టులను రద్దుచేశారు. అలాగే సైకియాట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ పోస్టులు గల్లంతయ్యాయి. జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ ఖాళీలు ఎక్కువయ్యాయి.

ఐదు జిల్లా ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు కౌన్సెలింగ్‌ ద్వారా ప్రాధాన్య క్రమంలో మరోచోట పోస్టింగ్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీని ప్రకారం ఈ పోస్టులను ఇతర ఆసుపత్రులకు సర్దుబాటు చేసి, వాటి వివరాలను కూడా కౌన్సెలింగ్‌ జాబితాలో చూపించాలి. అయితే ప్రస్తుతం ఇతర ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను మాత్రమే కౌన్సెలింగ్‌లో చూపించారు. శాంక్షన్డ్‌ పోస్టులు కావడంతో కౌన్సెలింగ్‌లో చూపించకుండా అధికారులు అన్యాయం చేశారని వైద్యులు పేర్కొంటున్నారు. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ హోదాలో చేరిన వైద్యులు పదోన్నతుల ద్వారా డీసీఎస్‌ (డిప్యూటీ సివిల్‌ సర్జన్‌), సీఎస్‌ఎస్‌ (సివిల్‌ సర్జన్‌) అవుతారు. ఏకంగా పోస్టులను రద్దు చేసినందున కౌన్సెలింగ్‌లో సీఎస్‌ఎస్‌ పోస్టుల్లో తగిన ఖాళీలు లేకుండాపోయాయి. దీనివల్ల సీఎస్‌ఎస్‌లు డీసీఎస్‌, సీఏఏస్‌ పోస్టులను పొందాల్సి వచ్చింది. సివిల్‌ సర్జన్లుగా పదోన్నతి వచ్చిన వారికి స్థానిక జిల్లాలో పోస్టింగ్‌ ఇవ్వకపోవడంతో కొందరు విధుల్లో చేరలేదు. కొందరు విధుల్లో చేరినా దీర్ఘకాలిక సెలవులు పెట్టారు. ‘రోగుల అవసరాల కంటే సంఖ్యాపరంగా ఉన్న వైద్యులను పరిగణనలోనికి తీసుకొని చర్యలు తీసుకుంటున్నారు’ అని ఏపీవీవీపీ జేఏసీ తరపున డాక్టర్‌ జయధీర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ ఐదు జిల్లా ఆసుపత్రులకు చెందిన వైద్యులు బుధవారం ధర్నా చేశారు. తొలగించిన పోస్టులను ఇతర ఆసుపత్రుల్లో ఖాళీల కింద చూపించి, మళ్లీ కౌన్సెలింగ్‌ జరపాలని డిమాండ్‌ చేశారు. వీరికి సంఘీభావంగా రాష్ట్రంలో ఇతర ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు కూడా కాసేపు ఆందోళనకు దిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని