పోలవరం వైఫల్యంపై పిల్లిమొగ్గలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా పడకేయడంతో ఆ వైఫల్యాన్ని ఎవరో ఒకరి ఖాతాలో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. మొన్నటి వరకు పాత ప్రభుత్వానిదే తప్పని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాజాగా ఆ నెపాన్ని

Updated : 19 Aug 2022 07:38 IST

మొన్నటి వరకు పాత ప్రభుత్వానిదే తప్పని ప్రకటనలు
ఐఐటీ హైదరాబాద్‌ నివేదికతో ఇప్పుడు కేంద్రంపై నెపం
పోలవరం అథారిటీ సమావేశ నిర్ణయాలకూ వక్రీకరణ
విస్మయం కలిగిస్తున్న రాష్ట్రం తీరు

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమంది?

చంద్రబాబు ప్రభుత్వం స్పిల్‌ వే పూర్తి చేయకుండా ఎగువ కాఫర్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేపట్టడంవల్లే పోలవరంలో సమస్యలు తలెత్తాయి. అందువల్లే ప్రాజెక్టు నిర్మాణం నిలిచిపోయింది.

- సీఎం, జలవనరులశాఖ మంత్రి


ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా పడకేయడంతో ఆ వైఫల్యాన్ని ఎవరో ఒకరి ఖాతాలో వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. మొన్నటి వరకు పాత ప్రభుత్వానిదే తప్పని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాజాగా ఆ నెపాన్ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సంస్థలపైకి నెట్టేస్తోంది. అధికారిక అంశాలను కూడా వక్రీకరిస్తూ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.  

2019 మే నెలాఖరులో వైకాపా ప్రభుత్వం ఏర్పడే నాటికి పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణ పని 64 శాతం జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వ అధికారిక గణాంకాలే తెలియజేస్తున్నాయి. 2022 మే నెల నాటి నివేదికల ప్రకారం పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణం 76.39 శాతం పూర్తయింది. అంటే ఈ మూడున్నరేళ్లలో జరిగిన పని కేవలం 12 శాతమే. ప్రస్తుతం పోలవరంలో పనులు ఆగిపోయాయి. దిగువ కాఫర్‌ డ్యాం సకాలంలో నిర్మించి ఉంటే వరద ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగించే అవకాశం ఏర్పడేది. దిగువ కాఫర్‌ డ్యాం సకాలంలో నిర్మించలేకపోయారని పోలవరం అథారిటీయే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. మరోవైపు ప్రధాన డ్యాం నిర్మించే చోట పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఎగువ కాఫర్‌ డ్యాంలో గ్యాప్‌లు సకాలంలో పూడ్చి ఉంటే ఇంత పెద్ద సమస్య ఏర్పడి ఉండేది కాదని తృతీయ పక్షంగా ఉన్న హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులు తేల్చారు. స్పిల్‌ వే పూర్తి చేయకుండా ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించడం వల్లే పోలవరంలో సమస్యలు ఎదురయ్యాయని, ఇందుకు చంద్రబాబు ప్రభుత్వమే కారణమని వైకాపా ప్రభుత్వ పెద్దలు ఇన్నాళ్లూ విమర్శిస్తూ వచ్చారు. తాజాగా పోలవరం అథారిటీ, హైదరాబాద్‌ ఐఐటీ పోలవరం వైఫల్యాలకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ తీరే కారణమని కుండబద్దలు కొట్టాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ ఐఐటీ నివేదికను తప్పుపడుతోంది. ఐఐటీ తప్పుబట్టిన అన్ని అంశాలకు కేంద్రానిదే తప్పంటూ వేలెత్తి చూపుతోంది. పోలవరం ఎస్‌ఈ కేంద్రాన్ని తప్పుపడుతూ అధికారికంగా వివరణ పంపడం ఇప్పుడు చర్చనీయాంశమయింది.  

కేంద్ర సంస్థలదే తప్పిదం  
హైదరాబాద్‌ ఐఐటీ నివేదికపై పోలవరం ఎస్‌ఈ నరసింహమూర్తి తాజాగా పత్రికలకు వివరణ పంపారు. అందులో ఆయన ఏమన్నారంటే..

పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యాంలలో మిగిలిన గ్యాప్‌లను పూడ్చకూడదని పోలవరం అథారిటీ 2019 మే 31న నిర్ణయం తీసుకుని, పనులు నిలిపేయాలని ఆదేశించింది. అదే ఏడాది జూన్‌లో జరిగిన డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) 13వ సమావేశంలో అథారిటీ నిర్ణయాన్ని ధ్రువీకరించారు. +35 మీటర్ల వరకు పునరావాస పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నందున మిగిలిన ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం పనులు నిలిపివేశాం. పోలవరం అథారిటీ 2020 ఏప్రిల్‌ 12న అత్యవసర సమావేశం నిర్వహించి +35 మీటర్ల వరకు ఆర్‌అండ్‌ఆర్‌ పనులు పూర్తి కానందున కాఫర్‌ డ్యాం మిగిలిన గ్యాప్‌ పనులు చేపట్టవద్దని సూచించింది. అందువల్ల 2020లో వాటిని చేపట్టలేదు.

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సూచన మేరకు పోలవరంలో టెండర్లు పిలిచి గుత్తేదారును మార్చాం.

పోలవరానికి కీలకమైన ఆకృతుల ఆమోదం, రాష్ట్రం ఖర్చు చేసిన నిధులను సకాలంలో తిరిగి చెల్లించడం కేంద్రం ప్రధాన బాధ్యతలు. వీటిలో జాప్యాన్నే ఐఐటీ హైదరాబాద్‌ నివేదికలో ప్రణాళికా వైఫల్యంగా ప్రస్తావించింది.

వివిధ సంస్థల్లో సమన్వయ లోపం ఉందని ఐఐటీ నివేదిక ప్రస్తావించింది. కేంద్ర జల్‌శక్తి, ఆర్థిక, గిరిజన సంక్షేమ, అటవీ పర్యావరణ శాఖలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌, వాప్కోస్‌, డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ, నిపుణుల కమిటీ వంటి వాటితో సమన్వయం చేసుకోవాల్సి ఉంది.  

పోలవరం అథారిటీ ఏం చెప్పింది?

నిజానికి పోలవరం అథారిటీ ఎగువ కాఫర్‌ డ్యాంలో గ్యాప్‌లు పూడ్చవద్దని చెప్పలేదు. 2019 మే నాటికి పునరావాసం పూర్తి కానందున ఆ వరదల సీజన్‌ వరకు మాత్రమే గ్యాప్‌లు అలా వదిలేయాలని సూచించింది. 2020 ఏప్రిల్‌ 21న జరిగిన సమావేశంలో +35 మీటర్ల వరకు పునరావాసం పూర్తి కానందున కాఫర్‌ డ్యాం మిగిలిన గ్యాప్‌లను చేపట్టరాదని పోలవరం అథారిటీ సూచించిందని, అందువల్ల 2020లో మిగిలిన కాఫర్‌ డ్యాం పని చేపట్టలేదని ఎస్‌ఈ వివరణ ఇచ్చారు. 2019 జూన్‌లో కొత్త ప్రభుత్వం వస్తే 2020 ఏప్రిల్‌ వరకు +35 మీటర్ల వరకు పునరావాసం పూర్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆ పనులు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఆ వైఫల్యాన్ని బయటపెట్టకుండా పోలవరం అథారిటీ గ్యాప్‌లు పూడ్చవద్దని చెప్పినందునే 2020లో ఆ పనులు చేయలేదని తేల్చి చెప్పేశారు.

2020 జనవరి 24న పోలవరం అథారిటీ 11వ సమావేశంలో అథారిటీ అప్పటి సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌.. పునరావాస కమిషనర్‌, పోలవరం చీఫ్‌ ఇంజినీరు కలిసి 2020 జూన్‌లోగా కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ఈ విషయం సమావేశం మినిట్స్‌ 5వ పేజీ రెండో పేరాలో స్పష్టంగా ఉంది.

పునరావాసం బాధ్యత ఎవరిది?

ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లు పూడ్చితే ముంపు గ్రామాల్లో నీరు నిలుస్తుంది. తొలిదశలో +41.15 మీటర్ల స్థాయి వరకు నీటిని నిల్వ చేసేలా ఆ గ్రామాల్లోని 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించి, తరలించాలి. 2019 మే నెలాఖరులో కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికి 3,992 కుటుంబాలను తరలించారు. తర్వాత ఈ మూడున్నరేళ్లలో కేవలం 4,235 కుటుంబాలను మాత్రమే తరలించారు. 2019 మే నుంచి 2020 జూన్‌ మధ్య కేవలం రూ.3,000 కోట్లు ఖర్చు పెట్టి పునరావాసం పూర్తి చేసి ఎగువ కాఫర్‌ డ్యాంల గ్యాప్‌లు పూడ్చి ఉంటే పోలవరంలో ఈ విధ్వంసం సంభవించేది కాదని ‘ఈనాడు’ ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు హైదరాబాద్‌ ఐఐటీ ఇదే తేల్చింది. పునరావాసం సకాలంలో పూర్తి చేయకపోగా ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లు పూడ్చవద్దంటూ పోలవరం అథారిటీయే చెప్పిందంటూ రాష్ట్రం వాదన లేవనెత్తడం గమనార్హం.

ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లు పూడ్చడానికి పునరావాసం పూర్తి చేయకపోవడమే కారణమని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. మంత్రి కూడా అనేకసార్లు చెప్పారు. ఇప్పుడు ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లు పూడ్చి 42.5 మీటర్ల వరకు నిర్మాణం పూర్తి చేసేశారు. ఇప్పటికీ ఇంకా 12 వేలకు పైగా కుటుంబాలను అక్కడి నుంచి తరలించలేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ముంపు మండలాల పర్యటనలో మాట్లాడుతూ సెప్టెంబర్‌ నాటికి వీరిని తరలిస్తామని ప్రకటించారు. ఒక వైపు పునరావాసం పూర్తి చేయక కాఫర్‌ డ్యాం గ్యాప్‌లు పూర్తి చేయలేదంటారు. మరోవైపు అవి పూడ్చేసినా ఇప్పటికీ తొలిదశ పునరావాసం పూర్తి చేయలేదు. ఇదీ పోలవరంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి. పదే పదే చెబుతున్న విషయం ఇది.

కేంద్ర సంస్థలు చెప్పనేలేదు..

సకాలంలో ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లను పూడ్చకపోవడంవల్లే పెద్ద సమస్యలు వచ్చాయని హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులు తేల్చిచెప్పారు. స్పిల్‌ వే కట్టకుండా డయాఫ్రం వాల్‌, ఎగువ కాఫర్‌ డ్యాంలు నిర్మించడం తప్పని వారు ఎక్కడా ప్రస్తావించలేదు. కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ, డీడీఆర్‌పీ ఈ విషయాన్ని ఎక్కడా ఇంతవరకు చర్చించిన, లిఖితపూర్వకంగా ప్రస్తావించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టలేదు.

ఇప్పుడు కేంద్రంపైనే నిందలు

ఎగువ కాఫర్‌ డ్యాంలో గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తాయని ఐఐటీ హైదరాబాద్‌ తేలిస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పోలవరం అథారిటీని తప్పుపట్టింది. అథారిటీ వాటిని పూడ్చవద్దని చెప్పడం వల్లే పనులు ఆపేశామని పోలవరం ఎస్‌ఈ వివరణ ఇచ్చారు.


పోలవరం అథారిటీ 12వ సమావేశంలో ఏం చెప్పింది?

2019లో వర్షాలు ప్రారంభమయ్యే నాటికి కాఫర్‌ డ్యాంలు, అందుకు తగ్గట్టుగా పునరావాసం పూర్తి చేయాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోయిందని 2020 ఏప్రిల్‌ 5న కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో పోలవరం అథారిటీ సీఈవో చెప్పారు. 2020 జూన్‌ నాటికి +35.5 మీటర్ల స్థాయికి కాఫర్‌ డ్యాం నిర్మించేలా పునరావాసం పూర్తి చేయాలని కూడా జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచించారు. ఈ అంశాలను పోలవరం అథారిటీ 12వ సమావేశం మినిట్స్‌ 12.3 అంశంలో పేర్కొన్నారు.
2020 జనవరిలో జరిగిన సమావేశంలోనే జూన్‌ నాటికి కాఫర్‌ డ్యాంల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పినా విలువైన సమయాన్ని ఉపయోగించుకోలేకపోయారని అథారిటీ సీఈవో పేర్కొన్నారు. 2020 ఏప్రిల్‌ 9న జరిగిన సమావేశంలోనూ దీనిపై సుదీర్ఘ చర్చ జరిగిందని ప్రస్తావనకు వచ్చింది. 2020 జూన్‌ నాటికి ఎగువ కాఫర్‌ డ్యాంలో గ్యాప్‌లను సకాలంలో పూడ్చలేని పరిస్థితులు ఉన్నందున రాబోయే వరద దృష్ట్యా ఆ పని చేపట్టవద్దన్న డీడీఆర్‌పీ సూచనపైనా చర్చ జరిగింది. ఈ విషయం మినిట్స్‌ 12.4లో ఉంది.

2019 జూన్‌ నాటికి కాఫర్‌ డ్యాంలు, ఆ మేరకు పునరావాసం పూర్తి చేయాలి. ప్రభుత్వం అప్పుడు చేయలేదు. 2020 జూన్‌ నాటికి పూర్తి చేయాలని పోలవరం అథారిటీ ముందే చెప్పినా ఆ పని చేయలేదు. రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం సకాలంలో పూర్తి చేయలేకపోయారనే అంశం మినిట్స్‌ ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. కొవిడ్‌ కారణాలు, రాబోయే వరదల దృష్ట్యా మాత్రమే ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లను పూడ్చవద్దని 12వ సమావేశంలో తేల్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని