ఆ ఫోరెన్సిక్‌ నివేదిక నిజమైనది కాదు

ధ్రువపత్రం అసలైనది కాదు’ అని సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్‌ అన్నారు. ఆ ఫోరెన్సిక్‌ సంస్థ ప్రతినిధి జిమ్‌ స్టాఫర్డ్‌ను మెయిల్‌లో ఈ అంశంపై వివరణ కోరగా, తన పేరిట చలామణిలో ఉన్న ధ్రువపత్రం అసలైనది కాదని సమాధానమిచ్చినట్లు వివరించారు.

Updated : 19 Aug 2022 06:59 IST

ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ ప్రతినిధి జిమ్‌ స్టాఫర్డే ఈ విషయం చెప్పారు
ఎంపీ మాధవ్‌ వీడియోపై  సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: ధ్రువపత్రం అసలైనది కాదు’ అని సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్‌ అన్నారు. ఆ ఫోరెన్సిక్‌ సంస్థ ప్రతినిధి జిమ్‌ స్టాఫర్డ్‌ను మెయిల్‌లో ఈ అంశంపై వివరణ కోరగా, తన పేరిట చలామణిలో ఉన్న ధ్రువపత్రం అసలైనది కాదని సమాధానమిచ్చినట్లు వివరించారు. అసలైన ధ్రువపత్రం తమవద్ద ఉందని, అది జిమ్‌ స్టాఫర్డ్‌ తనకు పంపించారన్నారు. తనకు అందిన మెయిల్‌ ప్రతిని ఆయన విడుదల చేశారు. వెలగపూడి సచివాలయంలో సునీల్‌కుమార్‌ గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘పోతిని ప్రసాద్‌ నుంచి ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం అందిన వీడియో అసలైనదా? కాదా? అనేది మాత్రమే నేను చెప్పాను. ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు నిజమైనవా? కాదా? అనేది తేల్చాలని నన్ను అడగలేదు. నేను పరీక్షించలేదు. పరీక్షించకుండా చెప్పలేను’ అని జిమ్‌ స్టాఫర్డ్‌ తనకు తెలిపారని సునీల్‌కుమార్‌ వివరించారు. ‘ఫోరెన్సిక్‌ నివేదికలో స్వల్ప మార్పులు చేయాలని పోతిని ప్రసాద్‌ నన్ను అడిగారు. నేను మార్చకుండానే అంతకుముందు ఇచ్చిన నివేదికను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు’ అని జిమ్‌ స్టాఫర్డ్‌ చెప్పారన్నారు. ఫోరెన్సిక్‌ నిపుణుల నివేదికలో కామా, ఫుల్‌స్టాప్‌కు కూడా అర్థం ఉంటుందని, దాన్ని మార్చటానికి వీల్లేదని ఆయన అన్నారు. చట్టప్రకారం ఇది నేరమని.. బాధ్యులపై ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమెరికాకు చెందిన.. అందులోనూ ఒక ప్రైవేటు ఫోరెన్సిక్‌ ప్రయోగశాల ఇచ్చిన నివేదికకు ప్రామాణికత ఉంటుందని తాను చెప్పట్లేదని.. ఆ నివేదిక ధ్రువీకరించదగినది కాదని వివరించారు. ఆయన మాటల్లోని ప్రధానాంశాలు ఇవి..

ప్రపంచంలోని ఏ ఫోరెన్సిక్‌ సంస్థా తేల్చలేదు

ఒక మహిళ, పురుషుడి మధ్య జరిగిన వీడియో కాల్‌ను ఎవరో మూడోవ్యక్తి మరో మొబైల్‌లో చిత్రీకరించి, ఆ వీడియో విడుదల చేశారు. అందులో ఉన్న వ్యక్తి గోరంట్ల మాధవ్‌ అనేది ఒక అభియోగం. అది మార్ఫింగ్‌ వీడియో అని.. అందులో ఉన్నది తాను కాదని ఎంపీ మాధవ్‌ చెబుతున్నారు. వీడియోకాల్‌లో ఉన్న మహిళ, పురుషుడు ఇద్దరి ఫోన్లలో లేదా ఎవరో ఒకరి ఫోన్‌లో అది రికార్డు అయి ఉండొచ్చు. ఆ ఫోన్‌ను యథాతథంగా ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపిస్తేనే అందులోని వీడియో మార్ఫింగ్‌ అయ్యిందా? ఎడిటింగ్‌ అయ్యిందా? అనేది నిర్ధారించగలరు. అంతేతప్ప ఒక ఫోన్‌లో ప్లే అవుతున్న వీడియోను మరో ఫోన్‌ ద్వారా చిత్రీకరించి.. ఆ వీడియో అసలైనదా? కాదా? అంటే ప్రపంచంలోని ఏ ఫోరెన్సిక్‌ సంస్థా తేల్చలేదు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో పులులు, ఎలుగుబంట్లు దూకే సన్నివేశం థియేటర్‌లో ప్రదర్శితమవుతున్నప్పుడు ఎవరైనా ఆ దృశ్యాల్ని మొబైల్‌లో చిత్రీకరించి దాన్ని యథాతథంగా ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపిస్తే ఆ రికార్డు చేసిన వీడియో అసలైనదేనని తేలుతుంది. అందులోని దృశ్యాలు నిజమైనవా.. కావా? తేలాలంటే సినిమా తీసినవారి వద్దనున్న వీడియో ఉంటేనే సాధ్యమవుతుంది. గ్రాఫిక్స్‌ వినియోగించారా? గ్రీన్‌మ్యాట్‌పై చిత్రీకరించారా? అనేది తేలుతుంది.

ఆ విషయం డీజీపీని అడగాలి...

విలేకరి: ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ సంస్థ ఇచ్చిన  ధ్రువపత్రం అసలైనదా? కాదా? అనే అంశాన్ని మీరు సుమోటోగా అడిగారా? ఎవరైనా ఫిర్యాదు చేశారా?

సునీల్‌కుమార్‌: మాకు ఫిర్యాదు అందింది. దాన్ని పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఎంపీ మాధవ్‌ ఫోన్‌ సీజ్‌ చేసి పరిశీలిస్తే వీడియో ఉందో లేదో తేలుతుంది కదా?

మీ సూచన అనంతపురం ఎస్పీకి తెలియజేస్తాను.

ఫోన్‌ ఇవ్వడానికి సిద్ధమని ఎంపీ చెప్పారు కదా?

మాధవ్‌ ఏమన్నారో నాకు తెలియదు. దానిపై నేను వ్యాఖ్యానించలేను.

మాధవ్‌ వీడియో వ్యవహారంపై విచారణ జరపాలని జాతీయ మహిళా కమిషన్‌ డీజీపీని ఆదేశించింది కదా? ఎందుకు తేల్చట్లేదు?

ఆ విషయం మీరు డీజీపీని అడగాలి. నేను డీజీపీని కాదు. సీఐడీ అదనపు డీజీని.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts