అసలుపై విచారణ లేదు.. కొసరుపై మెరుపు వేగం

హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో వెలుగులోకి వచ్చి 14 రోజులైంది. ఈ నగ్న వీడియోకాల్‌ వ్యవహారంపై విచారణ జరిపి త్వరగా తేల్చాలని జాతీయ,

Updated : 19 Aug 2022 11:53 IST

ఎంపీ మాధవ్‌ నగ్న వీడియోకాల్‌ వ్యవహారంపై ఏపీ పోలీసుల తీరు
ఒరిజినల్‌ వీడియో లేనిదే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించలేమని ప్రకటనలు
ఆ వీడియో ఎక్కడ, ఎవరి వద్ద ఉందో కనుక్కునే దిశగా సాగని దర్యాప్తు

ఈనాడు, అమరావతి: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో వెలుగులోకి వచ్చి 14 రోజులైంది. ఈ నగ్న వీడియోకాల్‌ వ్యవహారంపై విచారణ జరిపి త్వరగా తేల్చాలని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌లు డీజీపీని ఆదేశించినా దానిపై ఇప్పటివరకూ నిగ్గుతేల్చలేదు. ఇంకా కేసూ లేదు... దర్యాప్తూ లేదు. ఒరిజినల్‌ వీడియో ఉంటేనే దాన్ని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలో నిర్ధారించగలరనేది మొన్న అనంతపురం ఎస్పీ, తాజాగా సీఐడీ విభాగాధిపతి సునీల్‌కుమార్‌ చెబుతున్న మాట. అలాంటప్పుడు ఆ ఒరిజినల్‌ వీడియో ఎక్కడుందో దర్యాప్తు చేసి, అది ఎవరివద్ద ఉందో గుర్తించి స్వాధీనం చేసుకోవాలి. దాన్ని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపాలి. కానీ పోలీసులు ఆ అసలు పని వదిలేసి కొసరు పని చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మాధవ్‌ తన ఫోన్‌ ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించినా సరే.. దాన్ని సీజ్‌ చేయలేదు. కానీ ఆ వీడియో నిజమైనేదనంటూ ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ సంస్థ పేరిట చలామణిలో ఉన్న ధ్రువపత్రం అసలైనదా? కాదా? తేల్చాలంటూ ఫిర్యాదు అందితే మాత్రం.. ఆగమేఘాలపై స్పందించారు. అది అసలైన ధ్రువపత్రం కాదని... దాన్ని చలామణిలో పెట్టినవారిపై కేసూ నమోదు చేశారు. నగ్న వీడియోకాల్‌ వ్యవహారంలో ఎంపీ మాధవ్‌పై చిన్న ఆరోపణ వచ్చినా.. అది నిజం కాదని చెప్పటానికే అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్‌ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయాలు విశ్లేషిస్తే ఇదే స్పష్టమవుతోంది.
సునీల్‌కుమార్‌ చెప్పింది: ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ నివేదిక పేరిట చలామణిలో ఉన్న ధ్రువపత్రం అసలైనది కాదు. అసలైనది వారు మాకు పంపించారు. మా వద్ద ఉంది.

ఈ ప్రశ్నకు బదులేది?: అసలైన ధ్రువపత్రాన్ని ఎందుకు విడుదల చేయలేదు? అందులో ఏముందో ఎందుకు వెల్లడించలేదు? అందులో ఉన్న విషయాల్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి?

సునీల్‌కుమార్‌: మాకొచ్చిన ఫిర్యాదుతో పాటు ప్రభుత్వ ఆదేశాల మేరకే... ఆ ధ్రువపత్రం గురించి వివరాల కోసం జిమ్‌ స్టాఫర్డ్‌కు మెయిల్‌ పంపించాం.

ఈ ప్రశ్నకు బదులేది?: అమెరికన్‌ ఫోరెన్సిక్‌ సంస్థ జారీచేసిన ధ్రువపత్రం అసలైనదో కాదో తేల్చటంలో ప్రదర్శించిన ఉత్సాహం, చూపించినవేగం ఎంపీ నగ్నంగా ఓ మహిళతో వీడియోకాల్‌లో మాట్లాడుతున్నట్లు ఉన్న వీడియో గురించి తేల్చటంలో పోలీసులు ఎందుకు చూపలేదు? అసలు దాన్ని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించకుండానే ఒరిజినల్‌ వీడియో లేకుండా అది నిజమో కాదో నిర్ధారించలేమంటూ ఎలా చెబుతారు?

సునీల్‌కుమార్‌: వీడియోకాల్‌లో ఉన్న మహిళ, పురుషుడు ఇద్దరి ఫోన్లలో లేదా ఎవరో ఒకరి ఫోన్‌లో అది రికార్డు అయి ఉండొచ్చు. దాన్ని ప్రయోగశాలకు పంపిస్తేనే అందులోని వీడియో మార్ఫింగ్‌, ఎడిటింగ్‌ అయ్యిందా? లేదా? అనేది నిర్ధారించగలరు.

ఈ ప్రశ్నకు బదులేది?: మహిళతో నగ్నవీడియో కాల్‌లో మాట్లాడారంటూ ఆరోపణ ఎదుర్కొంటున్నది ఎంపీ మాధవ్‌. అది మార్ఫింగ్‌ వీడియో అని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినది కూడా ఆయన అభిమానే. అలాంటప్పుడు మాధవ్‌ ఫోన్‌ సీజ్‌చేసి.. దాన్ని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపిస్తే.. నిజం వెలుగుచూసే అవకాశం ఉంది కదా! ఆ పని ఎందుకు చేయట్లేదు?

సునీల్‌కుమార్‌: అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ఇచ్చిన ఫోరెన్సిక్‌ నివేదిక, ధ్రవపత్రానికి ప్రామాణికత ఉండదు. ఆ నివేదిక అధీకృతం కాదు.

ఈ ప్రశ్నలకు బదులేది?: మరి పోలీసులే అధీకృత, ప్రామాణికత, చట్టబద్ధత కలిగిన ఫోరెన్సిక్‌ సంస్థకు వీడియో పంపించి దాని నిగ్గు తేల్చొచ్చు కదా! ఆ పని ఎందుకు చేయట్లేదు?

ఆ వీడియో ఎడిట్‌ కాలేదు: ‘పోతిని ప్రసాద్‌ నాకు ఓ వీడియో పంపించి అది అసలైనదా? కాదా? ధ్రువీకరించమని అడిగారు. ఒక మొబైల్‌లో ప్లే అవుతున్న వీడియోను మరో మొబైల్‌తో చిత్రీకరించిన వీడియో అది. ఆ వీడియో ఎడిట్‌ కానిది. అసలైనదే. ఫోరెన్సిక్‌ నివేదికలో పోతిని ప్రసాద్‌ చేసిన స్వల్పమార్పులు.. పెద్దగా ప్రాముఖ్యత లేనివి’ అని సునీల్‌కుమార్‌కు జిమ్‌ స్టాఫర్డ్‌ పంపించిన మెయిల్‌లో ఉండటం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని