Published : 19 Aug 2022 04:19 IST

సీఎం ఆదేశమా.. మీ అత్యుత్సాహమా?

ఎంపీ మాధవ్‌ వ్యవహారంలో  సీఐడీకి సంబంధమేంటి?
తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత

ఈనాడు, విశాఖపట్నం: మహిళలు తలదించుకునేలా చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ను వైకాపా పాలకులు, పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. అకస్మాత్తుగా సీఐడీ చీఫ్‌ విలేకరుల సమావేశం నిర్వహించి ఎక్లిప్స్‌ ఫోరెన్సిక్‌ నివేదికను తప్పుగా తేల్చడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. గురువారం విశాఖలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. ‘అసలు ఎక్లిప్స్‌ నివేదిక తప్పని నిర్ధారించేందుకు సీఐడీకి ఏ అధికారం ఉంది? ఎక్లిప్స్‌ ప్రతినిధి జిమ్‌ స్టాఫర్డ్‌ను వివరణ కోరాలనుకుంటే నివేదిక మీరిచ్చిందేనా కాదా అని అడగకుండా మీ పేరుతో ఫేక్‌ సర్టిఫికెట్‌ చలామణిలో ఉందని ఈ-మెయిల్‌ సబ్జెక్టులో పేర్కొన్నారు. అంటే సీఐడీనే ముందుగా ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సీఐడీ ఎందుకు జోక్యం చేసుకుందో అర్థం కావట్లేదు. సీఎం ఆదేశాల మేరకు చేశారా? లేకుంటే అత్యుత్సాహం ప్రదర్శించారా? అసలు ఒక ప్రైవేటు ల్యాబ్‌ను ప్రామాణికంగా తీసుకోబోమని చెప్పిన సీఐడీ... దాన్ని జాతీయ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు ఎందుకు పంపడం లేదు? త్వరలో రాష్ట్రపతిని కలిసి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయనున్నాం. మహిళలు తల దించుకునేలా చేసిన ఆ ఎంపీని వైకాపా నుంచి తొలగిస్తేనే ఈ వివాదానికి తెరపడుతుంది’ అని పేర్కొన్నారు.

ఎంపీ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?

ప్రభుత్వం వాస్తవాలను తేల్చకుండా తెదేపా నాయకులను ఎలా అరెస్టు చేయాలో చూస్తున్నట్లు ఉందని అనిత పేర్కొన్నారు. ‘ఆ వీడియోకాల్‌ వాస్తవమో కాదో తేల్చేందుకు కనీసం ఎంపీ ఫోన్‌ను స్వాధీనం చేసుకోలేదు. ఆయనను అరెస్టు చేయడం లేదు. ఎంపీతో మాట్లాడిన ఆ మహిళ ఎక్కడున్నారు? నిజంగా ఎంపీని ట్రాప్‌ చేస్తే ఆయనెందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? దీనిపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఈ అంశంపై రాష్ట్ర మహిళా కమిషన్‌, జాతీయ మహిళా కమిషన్‌ డీజీపీని వివరణ కోరాయి. నివేదిక ఇచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది? మేమూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. దీనిపై ఆయన కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు’ అని అనిత వ్యాఖ్యానించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని