కడపలో సచివాలయ సిబ్బందిపై దాడి

రహదారి విస్తరణలో భాగంగా వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరంలోని ఉక్కాయపల్లిలో గురువారం ఉదయం ఆక్రమణల తొలగింపునకు వెళ్లిన వార్డు సచివాలయ సిబ్బందిపై అధికార పార్టీకి చెందిన కొందరు దాడి చేశారు. తమ ఇంటి

Published : 19 Aug 2022 04:19 IST

ఆక్రమణల కూల్చివేతకు వెళ్లగా అధికార పార్టీ ప్రజాప్రతినిధి బంధువుల దౌర్జన్యం

ఈనాడు డిజిటల్‌, కడప: రహదారి విస్తరణలో భాగంగా వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరంలోని ఉక్కాయపల్లిలో గురువారం ఉదయం ఆక్రమణల తొలగింపునకు వెళ్లిన వార్డు సచివాలయ సిబ్బందిపై అధికార పార్టీకి చెందిన కొందరు దాడి చేశారు. తమ ఇంటి నిర్మాణాలపై కోర్టు స్టే ఉన్నప్పటికీ ప్రహరీని కూల్చివేయడానికి వచ్చారంటూ సిబ్బందిని చితకబాదారు. దేవుని కడపకు వెళ్లే రహదారిలో ఉక్కాయపల్లిలో పల్లవిరెడ్డి పేరిట ఉన్న ఇంటి నిర్మాణం అక్రమంగా చేపట్టారని సచివాలయ సిబ్బంది కూల్చివేతకు ప్రయత్నించగా ఇంటి యజమాని క్రాంతికుమార్‌రెడ్డితో పాటు అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. కమిషనరు, నగర ప్రణాళిక విభాగం విభాగం అధికారులను తీసుకురమ్మంటూ గదమాయిస్తూ వారిని అక్కడి నుంచి తరిమేశారు. విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌, నగరంలో వార్డు సచివాలయాల సిబ్బంది అక్కడికి తరలివచ్చారు. కమిషనర్‌ దగ్గరుండి జేసీబీ సాయంతో ఆక్రమణలు పూర్తిగా కూల్చివేయించారు. శుక్రవారం ఉదయంలోగా ఇల్లు ఖాళీ చేయాలని.. ఆక్రమణలోని ఇంటిని సైతం కూల్చివేస్తామని తేల్చిచెప్పారు. తమ సిబ్బందిపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించబోమని కమిషనర్‌ హెచ్చరించారు. తహసీల్దార్‌ శివరామిరెడ్డి, రెండో పట్టణ పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. క్రాంతికుమార్‌రెడ్డి, సతీష్‌కుమార్‌రెడ్డి, రాజా రంజిత్‌ కుమార్‌తో పాటు మరికొందరు దాడి చేశారని సచివాలయ ఉద్యోగి కిషోర్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన వ్యక్తులు పరారీలో ఉన్నారు. నిందితులు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి సమీప బంధువులని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని