క్లిష్టమైన వినికిడి సమస్యకు.. శస్త్రచికిత్సతో పరిష్కారం

క్లిష్టమైన వినికిడి సమస్య (స్టెపిడాటమీ)కు శస్త్రచికిత్స ద్వారా పరిష్కారం చూపిన తెలుగు వైద్యునికి అరుదైన గౌరవం దక్కింది. కేర్‌ ఆసుపత్రికి చెందిన ప్రముఖ ఈఎన్‌టీ వైద్యులు డాక్టర్‌ ఎన్‌.విష్ణు స్వరూప్‌రెడ్డి ఈ ఘనత సాధించారు.

Published : 19 Aug 2022 04:19 IST

తెలుగు వైద్యుని ఘనత.. ప్రపంచంలోనే రెండో వ్యక్తి

ఈనాడు, హైదరాబాద్‌: క్లిష్టమైన వినికిడి సమస్య (స్టెపిడాటమీ)కు శస్త్రచికిత్స ద్వారా పరిష్కారం చూపిన తెలుగు వైద్యునికి అరుదైన గౌరవం దక్కింది. కేర్‌ ఆసుపత్రికి చెందిన ప్రముఖ ఈఎన్‌టీ వైద్యులు డాక్టర్‌ ఎన్‌.విష్ణు స్వరూప్‌రెడ్డి ఈ ఘనత సాధించారు. ఆయన దాదాపు 1100 శస్త్రచికిత్సలను 99 శాతం విజయవంతంగా పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. ఈ అధ్యయన వివరాలు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి వెలువడే ప్రఖ్యాత జర్నల్‌ ‘లారింగోలజీ అండ్‌ ఓటోలజీ’ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ఈ ఘనత సాధించిన వైద్యుల్లో ప్రపంచంలో డాక్టర్‌ విష్ణు స్వరూప్‌రెడ్డి రెండో వ్యక్తి కావడం విశేషం. ఈ వివరాలను గురువారం కేర్‌ ఆసుపత్రి వర్గాలు విలేకరులకు వివరించాయి. చెవి కర్ణభేరి వెనుక ఉండే మూడు ఎముకలు కదులుతూ.. బయట నుంచి వచ్చే శబ్దాలను లోపలకు పంపుతాయి. అక్కడి నుంచి శబ్ద తరంగాలు మెదడుకు చేరతాయి. ఈ మూడు ఎముకల్లో చివరిది కొన్ని కారణాలతో బిగుసుకుపోయి.. వినికిడి లోపం తలెత్తుతుంది. జన్యుపరంగా 8-80 ఏళ్ల వారిలో ఎవరికైనా ఈ సమస్య రావచ్చని డాక్టర్‌ విష్ణు స్వరూప్‌రెడ్డి తెలిపారు. శస్త్రచికిత్సతో దీన్ని నయం చేయవచ్చని చెప్పారు. ఆపరేషన్‌ కాగానే, వినికిడి లోపం తొలగిపోతుందని చెప్పారు. డాక్టర్‌ విష్ణు స్వరూప్‌రెడ్డికి కేర్‌ ఆసుపత్రి యాజమాన్య ప్రతినిధులు, ఇతర వైద్యులు అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని