Tirumala: అనుచరుల కోసం గంటకుపైగా ఆలయంలోనే మంత్రి రోజా

తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీనిపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ పెరగడంతో తితిదే ఈనెల 21 వరకు  బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసిన విషయం

Updated : 19 Aug 2022 08:18 IST

తిరుమలలో గంటలతరబడి  క్యూలైనులో సామాన్య భక్తులు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీనిపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ పెరగడంతో తితిదే ఈనెల 21 వరకు  బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసిన విషయం విదితమే. అయినా.. పలువురు రాష్ట్ర మంత్రులు, ఇతర కీలక నేతలు తిరుమలకు భారీ సంఖ్యలో తమ అనుచరులతో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. గంటల తరబడి ఆలయం, పరిసరాల్లోనే గడుపుతున్నారు. ఇటీవల మంత్రి ఉష శ్రీచరణ్‌ 60 మందితో, గతంలో మంత్రి సీదిరి అప్పలరాజు 150 మందితో శ్రీవారిని వీఐపీ ప్రొటోకాల్‌, బ్రేక్‌దర్శనాల సమయంలో దర్శించుకున్నారు. తాజాగా మంత్రి రోజా గురువారం దాదాపు 30మందితో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇందులో పది మందికి ప్రొటోకాల్‌, 20 మందికి బ్రేక్‌ దర్శనం కల్పించినట్లు సమాచారం. అనుచరులందరికీ దర్శనమయ్యే వరకు ఆలయంలోనే గంటకుపైగా ఆమె గడిపారు. దీనిపై మీడియా ప్రతినిధులు మంత్రి రోజాను ప్రశ్నించగా... ‘తితిదే నిబంధనలను పాటించక తప్పడం లేదు. ప్రస్తుతం బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశామని తితిదే అధికారులు చెప్పినందున మా అనుచరులు సర్వదర్శనంలో శ్రీవారిని దర్శించుకోవాల్సి వచ్చింది. అందుకే అప్పటివరకు శ్రీవారి ఆలయంలో ఉన్నా..’ అని సమాధానమిచ్చారు.

30 మంది అనుచరులతో మంత్రి రాజా

శ్రీవారిని 30 మంది అనుచరులతో కలిసి రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా గురువారం దర్శించుకున్నారు. ఉదయం పది మంది వీఐపీ ప్రొటోకాల్‌, మరో 20 మంది బ్రేక్‌ టికెట్లతో శ్రీవారిని దర్శించుకున్నట్లు సమాచారం. తమకు కావాల్సినన్ని ప్రొటోకాల్‌ దర్శన టికెట్లను ఇవ్వకపోవడంపై మంత్రి రాజా తితిదే అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

మూడోరోజూ శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్‌

ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం 3 రోజులుగా శ్రీవారిని వివిధ సేవల్లో దర్శించుకుంటున్నారు. తన కుమారుడి వివాహానంతరం తిరుమలకు కుటుంబసభ్యులతో వచ్చిన ఆయన తొలిరోజు మంగళవారం శ్రీవారి కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. బుధ, గురువారాలు వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని