Updated : 19 Aug 2022 05:20 IST

జూనియర్‌ లెక్చరర్లకు బీఈడీ తప్పనిసరి

ఇగ్నో ద్వారా కోర్సు పూర్తి చేయించేందుకు చర్యలు
పాఠశాలల విద్యాశాఖలో విలీనం కానున్న ఇంటర్‌ విద్య

ఈనాడు, అమరావతి: జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న రెగ్యులర్‌, ఒప్పంద లెక్చరర్లు అందరూ బీఈడీ చేయాలని ఇంటర్‌ విద్యాశాఖ ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్‌ఈకి అనుబంధంగా మారుతున్నందున భవిష్యత్తులో ప్రత్యేక ఇంటర్మీడియట్‌ బోర్డు ఉండదు. దీన్ని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తారు. దీనికి సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది. సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్‌ను +1,+2గా పరిగణిస్తారు. జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి నిబంధనల ప్రకారం బీఈడీ అర్హత ఉన్న వారే +1,+2కు పాఠాలు బోధించాలి. ప్రస్తుతం  పాఠాలు బోధిస్తున్న వారిలో ఎక్కువ మందికి బీఈడీ అర్హత లేదు. రెగ్యులర్‌గా నియామకాలు పొందిన వారు ఆయా సబ్జెక్టుల్లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. కొంతమంది గతంలో స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి పదోన్నతులపై జూనియర్‌ లెక్చరర్లుగా వచ్చారు. ఇలాంటి వారికి ఇబ్బంది లేదు. రెగ్యులర్‌, ఒప్పంద లెక్చరర్లు కలిపి 5,100మంది ఉండగా.. వీరిలో దాదాపు 350మందికి మాత్రమే బీఈడీ ఉంది. సీబీఎస్‌ఈ అనుబంధంగా మారుతున్న పాఠశాలల్లోని విద్యార్థులు 2026లో +1 పరీక్షలు రాస్తారు. అప్పటిలోగా జూనియర్‌ లెక్చరర్లు ఈ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు అందించేందుకు ఇంటర్‌ విద్యాశాఖ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో)తో సంప్రదింపులు జరుపుతోంది. సామర్థ్యాల పెంపునకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సహకారం తీసుకోనుంది. ఆన్‌లైన్‌లోనే లెక్చరర్లకు ఇగ్నో శిక్షణ ఇస్తుంది. అనంతరం వీరికి పరీక్ష పెట్టి, ఒక సర్టిఫికెట్‌ ఇస్తుంది. ఈ సామర్థ్యాల పెంపు శిక్షణను లెక్చరర్లు అందరికీ తప్పనిసరి చేశారు.

వాటిని మూసివేయాలి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నచోటనే హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్మీడియట్‌ ఏర్పాటు చేశారని, ఇలా రాష్ట్రవ్యాప్తంగా 52 ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణకు జూనియర్‌ లెక్చరర్ల సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. వీటిని మూసివేయాలని విన్నవించారు. రెండు కళాశాలలు పక్కపక్కనే ఉంటే విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తారని ప్రశ్నించారు. సంస్కరణలపై ఇంటర్‌ విద్యామండలిలో గురువారం లెక్చరర్ల సంఘాలతో మంత్రి బొత్స సమావేశం నిర్వహించారు. ‘ప్రస్తుతం హైస్కూల్‌ ప్లస్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్‌ కళాశాలల ప్రిన్సిపల్‌ పోస్టులు సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి. ప్రభుత్వ కళాశాలల్లోని ప్రిన్సిపల్‌ పోస్టులను పదోన్నతులతో భర్తీ చేయాలి. జూనియర్‌ లెక్చరర్లకు డిగ్రీ అధ్యాపకులుగా పదోన్నతులు కల్పించాలి. విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఆర్జేడీ కార్యాలయం ఏర్పాటు చేయాలి. ప్రశ్నపత్రాల మూల్యాంకనం, పరీక్షల విధులకు ఇచ్చే పారితోషికాలను సవరించాలి...’ సంఘాల నాయకులు కోరారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని