Paderu: పాడేరులో మళ్లీ ‘ఆంత్రాక్స్‌’ కలకలం

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్‌లో ఆంత్రాక్స్‌ వ్యాధి కలకలం రేపుతోంది. ముంచంగిపట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీలోని దొరగుడ గ్రామంలో ఆంత్రాక్స్‌ బారినపడి,

Updated : 28 Aug 2022 07:34 IST

ఏడుగురు చిన్నారుల్లో అనుమానిత లక్షణాలు

గిరిజనల్లో అవగాహనాలోపం

రోగ నిరోధక శక్తీ అంతంతే

ఈనాడు, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్‌లో ఆంత్రాక్స్‌ వ్యాధి కలకలం రేపుతోంది. ముంచంగిపట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీలోని దొరగుడ గ్రామంలో ఆంత్రాక్స్‌ బారినపడి, చనిపోయిన మేక మాంసాన్ని తిన్నవారిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఈ దిశగానే చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఏడుగురు బాధితుల్లో అందరూ 5-13 ఏళ్లలోపు పిల్లలే. వీరి చర్మంపై పొక్కులు, కురుపులు వచ్చాయని, ఇక్కడి వారికి సరైన పోషకాహారం అందడంలేదని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని ఉబ్బెంగుల గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లేందుకు వాగులూవంకలు దాటాలి. నిత్యావసర సరకులకూ కిలోమీటర్ల కొద్దీ నడవాలి. అంతదూరం వెళ్లలేక అటవీ ఉత్పత్తులతో జీవనాన్ని సాగిస్తున్నారు. రహదారి, విద్య, వైద్యం వంటి కనీస సదుపాయాలు లేని గ్రామాలు పాడేరు డివిజన్‌లో ఎక్కువగా ఉన్నాయి. లక్ష్మీపురం పంచాయతీలోని దొరగుడ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేనందున వైద్యులు, అధికారులు రానూపోనూ సుమారు 70 కి.మీ నడవాల్సి వచ్చింది.

2009 నుంచి కేసులు!
పాడేరు డివిజన్‌లో 2009లో 112 అనుమానిత కేసులు గుర్తించగా 76 మంది ఆంత్రాక్స్‌ బారినపడ్డారని తేలింది. ముగ్గురు చనిపోయారు. 2010-2012 మధ్య కేసులు నమోదుకాలేదు. మళ్లీ 2013లో ఇద్దరిలో,  2015లో ఆరుగురిలో లక్షణాలు బయటపడ్డా, వ్యాధి నిర్ధారణ కాలేదు. 2016లో 38 అనుమానిత కేసుల్లో 10, 2017లో 21లో 14, 2018లో 18 కేసుల్లో ఒకటి ఆంత్రాక్స్‌గా నిర్ధారించారు. తాజాగా బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం విశాఖకు పంపారు. బాధితుల చర్మంపై ఉన్న పొక్కులు, పుండ్లపై ఉన్న చీము కూడా సేకరించి పరీక్షించాల్సి ఉంది.

అవగాహన లేక!
మన్యంలోని గిరిజనులకు ఆంత్రాక్స్‌, ఇతర వ్యాధులపై అవగాహన లోపించింది. తాజా కేసులో దొరగుడ గ్రామంలో పలు కుటుంబాల వారు పది రోజుల క్రితం జబ్బు పడి మరణించిన మేక మాంసాన్ని తిన్నారు. కొందరు నిల్వ ఉంచుకుని, ఎండబెట్టిన మాంసాన్ని తింటున్నారు. బాసిల్లస్‌ ఆంత్రాసిన్‌ అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే ఈ వ్యాధికి మేకలు, గొర్రెలు, గుర్రాలు వాహకాలుగా పనిచేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు మూడు రోజుల్లోనే బయటపడతాయి. ఆంత్రాక్స్‌ వ్యాధి ఒక ప్రాంతంలో వ్యాపిస్తే 60 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ వ్యాధితో చనిపోయిన జీవాల మృతకళేబరాలను సరిగ్గా పూడ్చకపోతే వాటిలోంచి సూక్ష్మక్రిములు బయటకు వచ్చి నేలలో ఏళ్ల తరబడి పాతుకుపోతాయి. అక్కడి నీరు, గాలి, గడ్డి ద్వారా పరిసరాల్లోని మనుషులకు, పశువులకు వ్యాపిస్తూనే ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని