ఆర్‌బీకేల నుంచే అక్రమాలు

మద్దతు ధరపై ధాన్యం కొనుగోలులో అక్రమాలకు కొన్ని రైతు భరోసా కేంద్రాలే వేదికలవుతున్నాయి. అక్కడ పనిచేసే వ్యవసాయ సహాయకులే ఈ-క్రాప్‌ నమోదులో అవకతవకలకు

Published : 01 Sep 2022 02:56 IST

ఈ-క్రాప్‌ నమోదులో ఇష్టారాజ్యం

పలు జిల్లాల్లో వ్యవసాయ సహాయకులపై చర్యలు

ఈనాడు, అమరావతి: మద్దతు ధరపై ధాన్యం కొనుగోలులో అక్రమాలకు కొన్ని రైతు భరోసా కేంద్రాలే వేదికలవుతున్నాయి. అక్కడ పనిచేసే వ్యవసాయ సహాయకులే ఈ-క్రాప్‌ నమోదులో అవకతవకలకు పాల్పడుతున్నారు. పలు జిల్లాల్లో ఈ విషయం వెల్లడైంది. పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 48 మంది వీఏఏలను సస్పెండ్‌ చేయగా.. వందల మందికి తాఖీదులిచ్చారు. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు తదితర జిల్లాల్లోనూ అవకతవకలు వెలుగు చూశాయి. పంట నమోదులోనే కాకుండా.. ఆర్‌బీకేల్లో ధాన్యం కొనుగోలులోనూ పెద్ద ఎత్తున అక్రమాలున్నాయి. ధాన్యం అక్కడికి తీసుకురాకుండా నేరుగా మిల్లులకే తరలుతున్నా.. అన్నీ వాటి ద్వారా కొనుగోలు చేసినట్లే చూపిస్తున్నారు.

ఈ-క్రాప్‌ నుంచీ మొదలై
ఈ-క్రాప్‌ నమోదులోనే అక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత ధాన్యం కొనుగోలు వరకు ఇవి కొనసాగుతున్నాయి. చాలా గ్రామాల్లో వ్యవసాయ సహాయకులు బీడు భూములు, ఆక్వా చెరువులు, రోడ్లు, ఇళ్ల స్థలాలనూ తమ బంధువుల పేర్లతో పంట పొలాలుగా నమోదు చేశారు. మరికొన్ని చోట్ల ధాన్యం వ్యాపారులు, మిల్లర్లు చెప్పిన పేర్లను జాబితాల్లోకి ఎక్కించారు. కోనసీమ జిల్లాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. తర్వాత ప్రభుత్వం విచారణ చేయించగా.. పలు జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. అసలు పొలం సాగు చేయని వారి పేరుతోనూ ధాన్యం అమ్మకాలు జరిగినట్లు గుర్తించారు. ఉచిత పంటల బీమా పరిహారంలోనూ అనర్హుల పేర్లు ఉన్న విషయం వెల్లడైంది. భారీగా సొమ్ము అక్రమార్కుల పేరుతో విడుదలైంది. గ్రామాల్లో పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వీటిపై విచారణ చేయించింది. ఈ సందర్భంగా వ్యవసాయ సహాయకులు తమ ఇష్టానుసారం ఈ-క్రాప్‌ చేశారని వెల్లడైంది. దీంతో కొన్ని చోట్ల బీమా పరిహారం చెల్లించకుండా నిలిపేశారు.

అధికారులు పరిశీలించలేదా? గుర్తించలేదా?
ఈ-క్రాప్‌ నమోదుపై అధికారుల స్థాయిలో పర్యవేక్షణ మొక్కుబడి చందంగా తయారైంది. ఈ-క్రాప్‌లో నమోదైన వివరాల్లో 10% నమోదును జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, 20% నమోదును అప్పటి జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు, డిప్యూటీ డైరెక్టర్లు తనిఖీ చేయాలి. మండల స్థాయిలోని వ్యవసాయ  అధికారులు 30% నమోదు వివరాలను పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇంత మంది పర్యవేక్షిస్తున్నా అవకతవకలు బయటపడకపోవడం.. అధికార యంత్రాంగం పర్యవేక్షణ తీరుకు అద్దం పడుతోంది.

ధాన్యం కొనుగోలులోనూ
పంట కొనుగోలుకు కూడా రైతు భరోసా కేంద్రాలనే వేదికలుగా ప్రభుత్వం మార్చింది. వాస్తవానికి అధికశాతం రైతులు నేరుగా మిల్లర్లకే ధాన్యం చేరవేస్తున్నారు. వీరిలో 90% పైగా రైతులకు మద్దతు ధర కూడా దక్కడం లేదు. తర్వాతే మిల్లర్లు ఆయా గ్రామాల్లోని ఆర్‌బీకేల్లో కొనుగోలు చేసినట్లు నమోదు చేయిస్తున్నారు. ఇందులోనూ పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. క్వింటాలుకు రూ.120 వరకు వివిధ స్థాయిల్లోని వారికి చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.


చర్యలకు ఆదేశించాం
సి.హరికిరణ్‌, ప్రత్యేక కమిషనర్‌, వ్యవసాయశాఖ

ఈ-క్రాప్‌ నమోదులో అవకతవకలపై ఫిర్యాదులు అందిన చోట విచారణ చేయించాం. దీనికి బాధ్యులైన వ్యవసాయ సహాయకులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో చర్యలు తీసుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని