నడిరోడ్డుపై చంపుతున్నా దిక్కులేదు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే చాలు.. వారు ఎక్కడున్నా వెతికి పట్టుకోవడం, కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం.. ఇదే

Updated : 04 Sep 2022 06:43 IST

ఇంట్లో చొరబడి అంతమొందిస్తున్నా అడ్డులేదు

రాష్ట్రంలో కలవరపెడుతున్న వరుస ఘటనలు

ప్రాథమిక బాధ్యతలను వదిలేసిన ఏపీ పోలీసులు

నేర నియంత్రణను పక్కనపెట్టి... రాజకీయ పోలీసింగ్‌పైనే శ్రద్ధ

ఈనాడు - అమరావతి

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే చాలు.. వారు ఎక్కడున్నా వెతికి పట్టుకోవడం, కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం.. ఇదే అసలైన పోలీసింగ్‌ అన్నట్లుగా రాష్ట్రంలోని పోలీసుల పరిస్థితి తయారైంది.

పోలీసింగ్‌ అంటే... నేరాల్ని నియంత్రించాలి. శాంతి భద్రతల్ని పరిరక్షించాలి. అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపాలి. అరాచక శక్తుల్ని అణచివేయాలి. కేసుల్ని శరవేగంగా ఛేదించి దోషుల్ని పట్టుకోవాలి. వారికి శిక్షలు పడేలా చూడాలి. కానీ... ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు దాని అర్థాన్నే మార్చేశారు. అధికార పార్టీ నాయకుల సేవలో తరించడం, వారి ఆదేశాల్ని అమలు చేయడమే అసలైన పోలీసింగ్‌ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నేరాలకు బదులు ప్రతిపక్ష పార్టీలను నియంత్రిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కాకుండా.... ప్రజాసంఘాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అరాచకశక్తులను వదిలేసి... హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల్ని అణచివేస్తున్నారు. రాజకీయ పోలీసింగ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. వాటి ఫలితంగానే రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెచ్చరిల్లుతున్నాయి. హత్యలు, అత్యాచారాలు, అపహరణలు, అత్యంత హింసాత్మక నేరాలు, మహిళలు, చిన్నారులపై ఆకృత్యాలు పెరుగుతున్నాయి. కొన్నాళ్లుగా వరుసగా జరుగుతున్న సంచలన నేర ఘటనల్ని చూస్తే రాష్ట్రంలో అసలు పోలీసింగ్‌ ఉందా? అనే సందేహం కచ్చితంగా కలుగుతుంది.

విధులను వదిలేసిన ఫలితం
* పట్టపగలూ, సాయంత్రం సమయంలో అందరూ చూస్తుండగానే దారుణంగా హత్యలు జరుగుతున్నా వాటిని పోలీసులు నియంత్రించే పరిస్థితే లేదు. ఇళ్లల్లోకి చొరబడి అత్యంత కిరాతకంగా అంతమొందిస్తున్నా వాటిని అడ్డుకునే దిక్కే లేదు. వీటికి ప్రధాన కారణం.. పోలీసులు వారి ప్రధాన విధులు, బాధ్యతల(కోర్‌ పోలీసింగ్‌)ను విస్మరించి రాజకీయ బాస్‌ల సేవలో తరించడమే. తాజాగా జరిగిన కొన్ని ఉదంతాల్ని చూస్తే రాష్ట్రంలో పోలీసింగ్‌ ఎంత దారుణమైన స్థితిలో ఉందో అర్థమవుతుంది.

* ఎస్పీ సహా ముఖ్యమైన పోలీసు యంత్రాంగం అంతా ఉండే జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణంలో రాత్రి 9-10 గంటల మధ్య ఓ కానిస్టేబుల్‌ను కొందరు రౌడీషీటర్లు రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి... దారుణంగా చంపుతుంటే అడ్డుకునే దిక్కేలేదు.

* సాయంత్రం వేళ అందరూ చూస్తుండగానే విశాఖపట్నం నగరం నడిబొడ్డున ఓ రౌడీషీటర్‌ను నేరచరిత్ర కలిగిన మరో వ్యక్తి అత్యంత పాశవికంగా అంతమొందిస్తుంటే పోలీసులకు తెలియనే తెలియదు. అదే నగరంలో.. ఓ వ్యక్తిని పట్టపగలే వెంబడించి విచక్షణారహితంగా దాడిచేసి.. రాయి పట్టుకుని ముఖంపై చితకబాదుతూ చంపుతుంటే నియంత్రించే పరిస్థితే లేదు.

* నెల్లూరులో ఓ ఇంట్లోకి రాత్రి 11-12 గంటల మధ్య చొరబడి మరీ కొందరు దుండగులు దంపతుల్ని దారుణంగా హత్య చేశారు. కర్రతో కొట్టి.. కత్తితో పొడిచి అంతమొందించారు.

* తాజాగా సాయంత్రం ఏడు గంటల సమయంలో చీరాల సురేష్‌ మహల్‌ సమీపంలోని ఓ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండగా.. దుండగులు చొరబడి ఆమెను హత్య చేశారు. బంగారు ఆభరణాల్ని ఎత్తుకెళ్లారు.

* ఆదోని పట్టణంలో ఓ బంగారు దుకాణానికి కన్నం వేసి రూ.కోటి విలువైన బంగారు, వెండి ఆభరణాల్ని అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో దొంగలు ఎత్తుకెళ్లారు.

* అసలు ఏ మాత్రం పోలీసు గస్తీ ఉన్నా, కనీస నిఘా, భద్రత, బీట్ల వ్యవస్థ ఉన్నా.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశమే ఉండదు.

* ఘటన జరిగిన అనంతరమైనా వెంటనే నిందితుల్ని పట్టుకోగలుగుతున్నారా అంటే... ఎక్కువ సందర్భాల్లో అదీ లేదు. రోజుల తరబడి వారి కోసం వెతుకులాటకే పరిమితం అవుతున్నారు.

* విజయవాడలో శనివారం తెదేపా రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీపై వైకాపా నాయకులు మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఇనుపచువ్వతో దాడి చేయడంతో గాంధీ కుడి కన్ను పూర్తిగా దెబ్బతింది.

రాజకీయ పోలీసింగ్‌!
డీజీపీ మొదలుకుని ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుల్‌, హోంగార్డుల వరకు అంతా తమ మూల విధులైన నేరనియంత్రణ, నేరాల ఛేదన, శాంతిభద్రతల పరిరక్షణలను పక్కనపెట్టేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారి దృష్టంతా రాజకీయ పోలీసింగ్‌పైనే ఉంటోంది. ఇదే అదనుగా నేరగాళ్లు, అరాచకశక్తులు చెలరేగిపోతున్నారు.

* ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు ఏదైనా నిరసన, ప్రదర్శనకు పిలుపిస్తే చాలు... ఆయా సంఘాల ప్రతినిధులందరికీ నోటీసులివ్వడం, వారిని గృహ నిర్బంధం చేయడం, ఎక్కడికీ కదలనీయకుండా అడ్డుకోవడం, భారీ ఎత్తున బలగాలను మోహరించి భయభ్రాంతులకు గురిచేయడం... ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసుల ప్రధాన విధి ఇదే. సీపీఎస్‌ను రద్దు చేయాలన్న డిమాండుతో ఉద్యోగ సంఘాలు ఇటీవల చలో విజయవాడ, సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. అది మొదలు దాదాపు పదిహేను రోజులపాటు ఆయా ఉద్యోగ సంఘాల నాయకులకు నోటీసులివ్వటం, నిర్బంధించటం, కేసులు పెట్టటం, భయభ్రాంతులకు గురిచేయటం వంటి పనుల్లోనే రాష్ట్రంలోని పోలీసులంతా గడిపారు. చివరికి వారి నిర్బంధాన్ని తట్టుకోలేక ఉద్యోగ సంఘాలే నిరసన కార్యక్రమాలు విరమించుకున్నాయి. దీన్నిబట్టే రాష్ట్రంలో పోలీసింగ్‌ తీరు ఎలా ఉందో చెప్పొచ్చు.

* రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీల నాయకుల పర్యటనలుంటే చాలు ఆ జిల్లాతోపాటు పొరుగు జిల్లాల్లోని ఎస్పీలు మొదలుకుని కానిస్టేబుల్‌, హోంగార్డు వరకూ మొత్తం యంత్రాంగమంతా ఆ పర్యటనను అడ్డుకోవడం, వారిని నియంత్రించడంలోనే తలమునకలై ఉంటోంది. ఆ పర్యటనకు నాలుగైదు రోజుల ముందు నుంచే ఆ బాధ్యతల్లో ఉంటోంది. ప్రతిపక్ష పార్టీలు నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా నిరసన కార్యక్రమం తలపెడితే చాలు... వారిపై కేసులు బనాయించడం, అడ్డుకోవడమే తమ బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తోంది.

* అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చడం, వైకాపా నేతలను వ్యతిరేకించే వారిని అణిచివేయటమే పోలీసింగ్‌ అన్నట్లు ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారు.

సమర్థుల్ని పక్కన పెట్టి...
గతంలో సమర్థత, నిజాయతీ, నేర పరిశోధన, నియంత్రణలో అనుభవం వంటి అంశాలను బేరీజు వేసుకుని నేరాలు ఎక్కువగా జరిగే కీలకమైన పోలీసుస్టేషన్లలో పోస్టింగులను ఇచ్చేవారు. ఇప్పుడు రాజకీయ సిఫార్సులు ఉన్నవారికే పెద్దపీట వేస్తున్నారు. వారేమో పోలీసింగ్‌ను వదిలేసి అధికార పార్టీ నాయకుల సేవలో తరిస్తున్నారు.


గస్తీ లేదు... అసాంఘిక శక్తులపై నిఘా కరవు

* రాష్ట్రంలో పగటిపూట, రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ నామమాత్రంగా మారింది. ఎక్కువ మంది సిబ్బంది రాజకీయ పోలీసింగ్‌ విధుల్లో తలమునకలై ఉండటంతో చాలాచోట్ల బీట్ల సంఖ్య తగ్గిపోయింది.

* రౌడీషీటర్లు, హిస్టరీషీట్లు కలిగిన వారు, నేరచరిత్ర ఉన్నవారు, పాత నేరగాళ్ల కదలికలు, కార్యకలాపాలపై ఏమాత్రం నిఘా లేదు. వారేం చేస్తున్నారనే దానిపై దృష్టి పెట్టట్లేదు.

* నడక గస్తీ మరిచిపోయారు. అనుమానితుల్ని విచారించడమూ లేదు.

* గతంలో ఆయా పోలీసు రేంజ్‌ల పరిధిలో రేంజ్‌ పార్టీలు చాలా సమర్థంగా, సమన్వయంతో పనిచేసేవి. దొంగలు, నేరగాళ్ల సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసి వారిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు.

* ఎక్కడైనా వరుస దొంగతనాలు జరుగుతుంటే మిగతా ప్రాంతాల్లో ప్రజల్ని పోలీసులు అప్రమత్తం చేసేవారు. అసలు అలాంటి చర్యలే లేవు.

* పోలీసులు ఎక్కువ శాతం ప్రొటోకాల్‌ విధులు, అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పే పనులు చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారు.

* చాలాచోట్ల సీసీ కెమెరాలు లేవు. ఉన్నవి కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి. కనీసం వాటి మరమ్మతులపైనా దృష్టిసారించట్లేదు.

* జైళ్ల నుంచి విడుదలవుతున్న పాత నేరగాళ్ల కదలికలపై దృష్టి పెట్టట్లేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని