Bhogapuram Airport: త్వరలో భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన?

అన్ని అడ్డంకులను అధిగమించి భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపనకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విశాఖ

Published : 05 Sep 2022 08:35 IST

విశాఖ ఎయిర్‌పోర్టు మూసివేతకు నౌకాదళం, ఏపీఏడీసీఎల్‌ ఒప్పందం

ఈనాడు, అమరావతి: అన్ని అడ్డంకులను అధిగమించి భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపనకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విశాఖ విమానాశ్రయాన్ని భోగాపురానికి తరలించడానికి భారత నౌకాదళం అధికారులు అంగీకరించారు. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై నౌకాదళం, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) అధికారులు ఇటీవల దిల్లీలో సంతకాలు చేశారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి సేకరించిన భూములపై ఉన్న కోర్టు కేసుల విచారణ కూడా తుది దశకు చేరింది. త్వరలో తీర్పు రానుంది.

విశాఖ విమానాశ్రయాన్ని మూసేయడంపై నౌకాదళ అధికారులతో ఏపీఏడీసీఎల్‌ ఏళ్లుగా సంప్రదింపులు జరుపుతోంది. ఈ సమస్యను పరిష్కరించకుండా భోగాపురంలో విమానాశ్రయాన్ని నిర్మించి ప్రయోజనం లేదని ఏపీఏడీసీఎల్‌ భావిస్తోంది. నగరానికి సమీపంలో ఉన్న విమానాశ్రయాన్ని వినియోగించడానికే ప్రజలు ఆసక్తి చూపుతారు. దీనివల్ల రూ.కోట్లు వెచ్చించి కొత్తది నిర్మించినా ప్రయాణికులు వచ్చే అవకాశం లేదని అంచనా వేస్తోంది. నౌకాదళం భద్రత దృష్ట్యా విశాఖ విమానాశ్రయం విస్తరణ సాధ్యమవడం లేదు. దీంతో సేవలను పెంచేందుకు భోగాపురం విమానాశ్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

నౌకాదళానికి 170 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకారం
విశాఖ విమానాశ్రయం 300 ఎకరాలలో ఉంది. ఇందులో 170 ఎకరాలను నౌకాదళానికి కేటాయించేలా ఎంవోయూలో నిబంధన చేర్చారు. మిగిలిన 130 ఎకరాలను ఏంవోయూ నిబంధనల మేరకు ఏఏఐకి  అప్పగించనున్నారు. మరోవైపు భోగాపురంలో నిర్మాణానికి మరో 28 ఎకరాలను మాత్రమే సేకరించాల్సి ఉంది. దీనిపై ఉన్న కోర్టు కేసుల్లో విచారణ పూర్తయి తీర్పు రిజర్వులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని