Andhra News: జైళ్ల అధికారికి నగరపాలన.. పలుకుబడితో కోరుకున్నచోట పోస్టింగులు

జైళ్లశాఖలో అదనపు సూపరింటెండెంట్‌గా ఉన్న అధికారి మహా విశాఖ నగర పాలక సంస్థలో (జీవీఎంసీ) కీలక విభాగానికి అదనపు కమిషనరు.సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడు ఏలూరు నగరపాలక సంస్థకు కమిషనరు

Updated : 12 Sep 2022 09:31 IST

డిప్యుటేషన్‌పై 38 మంది రాక

* జైళ్లశాఖలో అదనపు సూపరింటెండెంట్‌గా ఉన్న అధికారి మహా విశాఖ నగర పాలక సంస్థలో (జీవీఎంసీ) కీలక విభాగానికి అదనపు కమిషనరు.

* సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడు ఏలూరు నగరపాలక సంస్థకు కమిషనరు

* స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోలో (సెబ్‌) అసిస్టెంట్‌ కమిషనరు రాజమహేంద్రవరం పట్టణాభివృద్ధి సంస్థకు వైస్‌ ఛైర్మన్‌

ఈనాడు, అమరావతి: పురపాలక, నగర పరిపాలనతో సంబంధం లేని ఇతర శాఖలకు చెందిన అధికారులకు పలుకుబడితో కీలక బాధ్యతలు దక్కుతున్నాయి. జైళ్లు, సాంఘిక సంక్షేమశాఖ, సెబ్‌ అధికారులే కాదు.. వైద్య కళాశాలలో అధ్యాపకురాలు, వ్యవసాయ, సహకారశాఖలో సహాయ సంచాలకులు, డిప్యూటీ రిజిస్ట్రార్‌, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి, వాణిజ్య పన్నులశాఖ ఉప కమిషనరు.. ఇలా దాదాపు 38 మంది డిప్యుటేషన్‌పై పుర, నగరపాలక సంస్థల్లో కమిషనర్లు, సహాయ, ఉప కమిషనర్లుగా పని చేస్తున్నారు. పట్టణాభివృద్ధి సంస్థల్లో వైస్‌ ఛైర్మన్లుగా, కార్యదర్శులుగా కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వీరిలో అత్యధికులు ప్రభుత్వంలో తమ పలుకుబడినుపయోగించి గత రెండు, మూడేళ్లలోనే నచ్చిన చోటుకు డిప్యుటేషన్‌పై పోస్టింగులు తెప్పించుకున్నారు.

పుర, నగరపాలక సంస్థల్లో, పట్టణాభివృద్ధి సంస్థల్లో కమిషనర్లుగా, వైస్‌ ఛైర్మన్లుగా బాధ్యతలు చేపట్టేందుకు అర్హత కలిగిన అధికారులకు పురపాలకశాఖలో కొదవ లేదు. అయినా ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్లపై వచ్చే అధికారుల సంఖ్య భారీగా పెరుగుతోంది.విచిత్రం ఏమిటంటే సీనియర్‌ అధికారులు ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చే జూనియర్‌ అధికారుల కింద పని చేస్తున్నారు. కమిషనర్ల సర్వీసు నిబంధనల్లో ఏ పోస్టునూ డిప్యుటేషన్‌పై నియమించడానికి లేదు. ఇలాంటి నియామకాలు నిబంధనలకు విరుద్ధమైనా పట్టించుకోవడం లేదు.

పురపాలనపైనే ఎందుకీ ప్రేమ?

ఇతర ప్రభుత్వశాఖల్లో కంటే ఎక్కువ మంది పుర, పట్టణాభివృద్ధిశాఖలో డిప్యుటేషన్‌పై పని చేయడానికే ఆసక్తి చూపుతున్నారు.  కీలకమైన పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌, ప్రజారోగ్య విభాగాలను చేతుల్లో పెట్టుకుంటే నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చన్న భావనతోనూ చాలామంది ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అనిశా ఇటీవల కొన్ని తనిఖీలు నిర్వహించినపుడు వెలుగు చూసిన అక్రమాల్లో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న కొందరి అధికారుల పాత్ర ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది.


పుర, నగరపాలక, పట్టణాభివృద్ధి సంస్థల్లో డిప్యుటేషన్‌పై కమిషనర్లు, అదనపు కమిషనర్లు, వైస్‌ ఛైర్మన్లుగా పని చేస్తున్న ఇతర ప్రభుత్వశాఖల అధికారులు

పుర, నగరపాలక కమిషనర్లు: 12

వైస్‌ ఛైర్మన్లు: 6

అదనపు కమిషనర్లు, ఉప కమిషనర్లు: 10

జోనల్‌ కమిషనర్లు: 2

కార్యదర్శులు: 6

ప్రాజెక్టు అధికారులు, సహాయ ప్రాజెక్టు అధికారులు: 2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని