‘అమరావతి మున్సిపాలిటీ’ వెనుక మీ ఉద్దేశమేంటి?.. గ్రామసభల్లో నిలదీసిన ప్రజలు

అమరావతిని మున్సిపాలిటీగా చేయాలనుకోవటం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో చెప్పాలని గ్రామసభల్లో అధికారులను ప్రజలు నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఏర్పాటుకు

Updated : 17 Sep 2022 08:23 IST

ఈనాడు, అమరావతి, తుళ్లూరు గ్రామీణం, మంగళగిరి, న్యూస్‌టుడే: అమరావతిని మున్సిపాలిటీగా చేయాలనుకోవటం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో చెప్పాలని గ్రామసభల్లో అధికారులను ప్రజలు నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఏర్పాటుకు అంగీకరించమని స్పష్టంచేశారు. మూడు రాజధానుల ఏర్పాటుపై గ్రామసభలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు ప్రతిపాదనపై మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, తుళ్లూరు మండలం మల్కాపురం, వెలగపూడి, పెదపరిమి గ్రామాల్లో శుక్రవారం అధికారులు ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ నాలుగు గ్రామాల ప్రజలు ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. రాజధాని పరిధిలో లేని గ్రామాలను మున్సిపాలిటీలోకి ఎందుకు తేవాలనుకుంటున్నారు? మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌లో కొన్ని గ్రామాలను కలిపి రాజధాని గ్రామాలను ముక్కచెక్కలుగా చేసేందుకే ప్రభుత్వం అమరావతి మున్సిపాలిటీ ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చిందని మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌చేశారు. ‘అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక దానికి తిలోదకాలిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఏర్పాటుకు అంగీకరించం’ అని స్పష్టంచేసిన గ్రామస్థులు 12 అంశాలతో కూడిన అభ్యంతర పత్రాలు అధికారులకు అందజేశారు. మున్సిపాలిటీ ప్రతిపాదనను వెలగపూడి గ్రామస్థులు ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. అమరావతి నుంచి ఉత్తరాంధ్రకు వెళ్లటం తప్పా? భారతీయులం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాజధాని గ్రామాల పరిధిలో లేని పెదపరిమిని అమరావతి మున్సిపాలిటీలోకి ఎందుకు ప్రతిపాదించారని గ్రామస్థులు అధికారులను నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని