రాష్ట్రానికి పారిశ్రామిక దిగ్గజాలు

దేశంలో పేరొందిన పారిశ్రామిక దిగ్గజాలంతా మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంవైపు అడుగులు వేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. భజంకాలు, బంగర్లు, సింఘ్వీలు, బిర్లాలు, అదానీలు, ఆర్సెలర్‌ ఆదిత్య మిత్తల్‌,

Updated : 20 Sep 2022 04:02 IST

దావోస్‌ నుంచి మేమే ఎక్కువ పెట్టుబడులు తెచ్చాం
అసెంబ్లీలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: దేశంలో పేరొందిన పారిశ్రామిక దిగ్గజాలంతా మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంవైపు అడుగులు వేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. భజంకాలు, బంగర్లు, సింఘ్వీలు, బిర్లాలు, అదానీలు, ఆర్సెలర్‌ ఆదిత్య మిత్తల్‌, రుయాలు, టాటాలు మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి వస్తున్నారని చెప్పారు. వారిలో పూర్తి స్థాయిలో నమ్మకం పెంపొందిస్తున్నామని, గతంలో చంద్రబాబు హయాంలో అయితే ఏది కావాలన్నా నాకెంత? అనే పరిస్థితి ఉండేదని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. ‘కడప జిల్లా బద్వేలులో భజంకాలు సెంచరీ ప్లైవుడ్‌ పరిశ్రమను పెడుతున్నారు. శ్రీ సిమెంట్స్‌ ఏర్పాటుకు బంగర్లు, సన్‌ ఫార్మా పెట్టేందుకు సింఘ్వీలు వచ్చారు. కుమార మంగళం బిర్లా తన ప్లాంటును ప్రారంభించారు’ అని వివరించారు. ‘రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలంతా సంతోషంగా ఉన్నారు కాబట్టే 2020 సులభతర వాణిజ్యం ర్యాంకుల్లో 97.89% మార్కులతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ తొలి స్థానంలో నిలిచింది. 2021-22 సంవత్సరంలో 2010-11 స్థిర ధరల ప్రకారం (కాన్‌స్టెంట్‌ ప్రైసెస్‌) 11.43% వృద్ధిరేటుతో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచాం’ అని చెప్పారు. ‘విశాఖ చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్‌- బెంగళూరు పారిశ్రామిక నడవాల పనులు వేగవంతం చేస్తున్నాం. రెండు నైపుణ్య విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలో 30 నైపుణ్య కళాశాలల ఏర్పాటు ద్వారా యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని తెలిపారు.

2,06,638 మందికి శాశ్వత ఉద్యోగాలు..  

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2,06,638 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. అందులో 1,25,110 మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వంలో విలీనం ద్వారా 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులు, 16,880 మంది వైద్య, 6,321 మంది విద్యా రంగాల్లో ఉన్నారని వివరించారు. ఆప్కాస్‌ ఏర్పాటు ద్వారా 95,212 మంది ఒప్పంద ఉద్యోగులకు పూర్తి జీతాలు అందిస్తున్నామన్నారు. ఉద్యోగుల వివరాలు, పథకాలవారీ లబ్ధిదారుల సంఖ్యను సభలో ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

కొవిడ్‌ సమయంలోనూ పెట్టుబడులు తెచ్చాం

కొవిడ్‌ సమయంలోనూ విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, చంద్రబాబు దావోస్‌ వెళ్లి తెచ్చిన వాటి కంటే తామే ఎక్కువ తెచ్చామని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. ‘చంద్రబాబు హయాంలో ఏడాదికి సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడి సమకూరితే.. మా ప్రభుత్వ హయాంలో రూ.12,702 కోట్ల పెట్టుబడులు వచ్చాయి’ అని వివరించారు. ‘2019 జూన్‌ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రూ.46,280 కోట్లతో 99 భారీ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించగా 62,541 మందికి ఉద్యోగాలు వచ్చాయి. రూ.9,742.51 కోట్ల వ్యయంతో 35,181 ఎంఎస్‌ఎంఈలు (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ఏర్పాటు కాగా 2,11,374 మందికి ఉద్యోగాలు లభించాయి. రూ.39,655 కోట్లతో నిర్మాణ దశలో ఉన్న 55 భారీ ప్రాజెక్టుల ద్వారా 78,792 మందికి ఉద్యోగాలు వస్తాయి. రూ.91,129 కోట్ల పెట్టుబడుల అంచనాతో చేపట్టే 10 ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే 40,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. విశాఖపట్నం, కృష్ణా, శ్రీ సత్యసాయి జిల్లాల్లో హెచ్‌పీసీఎల్‌, ఓఎన్‌జీసీ, బీఈఎల్‌ ఆధ్వర్యంలో నిర్మించే ప్లాంట్ల ద్వారా రూ. 1,06,800 కోట్ల పెట్టుబడితో 72,900 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి’ అని సీఎం పేర్కొన్నారు. ‘కొప్పర్తిలో 6,800 ఎకరాల్లో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తి కారిడార్‌, మెగా పారిశ్రామిక హబ్‌ ద్వారా 1,03,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాం’ అని వివరించారు. దేశంలోని 17 రాష్ట్రాలతో పోటీ పడి కాకినాడ బల్క్‌ డ్రగ్‌ పార్కును సాధించామన్నారు. దీనిద్వారా 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయని, కేంద్రం రూ.1,000 కోట్లు ఇస్తుందని చెప్పారు.

దగదర్తి బదులుగా మరోచోట విమానాశ్రయం

నెల్లూరు జిల్లా దగదర్తి బదులుగా మరో ప్రాంతంలో ఒంగోలు వైపు గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నట్లు జగన్‌ చెప్పారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించే విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి న్యాయస్థానంలో నడుస్తున్న భూ వివాదం చివరి దశకు వచ్చిందని వివరించారు. విమానాశ్రయ పనులు పూర్తయ్యే నాటికి రోడ్డు పూర్తి చేస్తామని, కేంద్రం నుంచి దీనికి మద్దతు ఉందని పేర్కొన్నారు. ‘నెల్లూరు జిల్లా రామాయపట్నం, శ్రీకాకుళంజిల్లా భావనపాడు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, కాకినాడలో ప్రైవేటు రంగంలో సెజ్‌ పోర్టును గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నాం. రూ.3,500 కోట్ల వ్యయంతో 9 చేపల రేవులు నిర్మిస్తున్నాం. నాలుగింటిని వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తి చేస్తాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని