ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగింపు

డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ బుధవారం సవరణ బిల్లును శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Updated : 21 Sep 2022 07:01 IST

డాక్టర్‌ వైఎస్సార్‌ వర్సిటీగా మార్పు

నేడు సభలో బిల్లు

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే - ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం: డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ బుధవారం సవరణ బిల్లును శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ (2022) బిల్లును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రవేశపెట్టనున్నారు. అప్పట్లో రాష్ట్రంలోని వైద్య, దంత వైద్య కళాశాలలన్నీ ఆయా జిల్లాల్లోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉండేవి. వాటి ద్వారానే విద్యార్థులకు డిగ్రీల ప్రదానం జరిగేది. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాలను పరిశీలించి, వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని నిర్ణయించారు. 1986 నవంబరు 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌సైన్సెస్‌ పేరిట ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారు. అప్పట్లో విజయవాడ సిద్దార్థ వైద్య కళాశాల ప్రైవేటు కళాశాలగా ఉండేది. వైద్య, దంతవైద్య, నర్సింగ్‌, పారా మెడికల్‌ కళాశాలలైన 26 సంస్థలను కలిపి విశ్వవిద్యాలయం కార్యకలాపాలను మొదలుపెట్టింది. రాష్ట్రంలో వైద్యవిద్య కోర్సుల కళాశాలలు, అనుబంధ కళాశాలలు భారీగా పెరగడంతో 2000 నవంబరు 1న విశ్వవిద్యాలయాన్ని సిద్దార్థ వైద్య కళాశాల నుంచి కొత్త బ్లాకు (ప్రస్తుతం విశ్వవిద్యాలయం ఉన్న భవనం)లోకి మార్చారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 1998 జనవరి 8న ప్రత్యేక గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా విశ్వవిద్యాలయ పేరును ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారు. 2006 జనవరి 8న అప్పటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. విశ్వవిద్యాలయం రజతోత్సవం (1986-2011) సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆయన కుమార్తె, నాటి కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి 2011 నవంబరు 1న ఆవిష్కరించారు. ప్రస్తుతం సిద్దార్థ ప్రభుత్వ వైద్యకళాశాల ఆవరణలోనే రెండెకరాల విస్తీర్ణంలో విశ్వవిద్యాలయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.  విద్యార్థుల ఫీజులు, కౌన్సెలింగ్‌ రుసుములతో కూడబెట్టిన రూ.400 కోట్లను ఇటీవలే జగన్‌ ప్రభుత్వం లాగేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని