కుప్పం.. అష్టదిగ్బంధం

ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ తొలిసారి చిత్తూరు జిల్లా కుప్పం వస్తుండటంతో పోలీసులు పట్టణాన్ని అష్టదిగ్బంధం చేశారు. మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి

Updated : 23 Sep 2022 07:07 IST

సీఎం రాక నేపథ్యంలో అడుగడుగునా పోలీసులు

రోడ్లను తవ్వి మధ్యలో బారికేడ్ల ఏర్పాటు

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, కుప్పం పట్టణం: ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ తొలిసారి చిత్తూరు జిల్లా కుప్పం వస్తుండటంతో పోలీసులు పట్టణాన్ని అష్టదిగ్బంధం చేశారు. మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆయన తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి శుక్రవారం వస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా 2,500 మంది వరకు పోలీసు సిబ్బంది పట్టణంలో అడుగడుగునా మోహరించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ ట్రయల్‌రన్‌ కోసం గురువారం కొద్దిసేపు కుప్పం చెరువు కట్ట వద్ద వాహనాలు నిలిపేయడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పలేదు. పట్టణ సమీపంలోని హెలిప్యాడ్‌ నుంచి సభాప్రాంగణం వరకు రోడ్డును మధ్యలో తవ్వి బారికేడ్లు ఏర్పాట్లు చేయడంతో పట్టణంలో రాకపోకలు సాగించే వాహనదారులు అవస్థలు పడ్డారు. మరోవైపు దుకాణాలకు వెళ్లేందుకు దారి లేక రెండు రోజులుగా వ్యాపారాలు సరిగా లేవని వ్యాపారులు వాపోతున్నారు. జగన్‌ వెళ్లాక రోడ్డు మధ్యలో ఉన్న గుంతలను ఎవరు పూడ్చుతారోననే చర్చ పట్టణంలో సాగుతోంది. హెలిప్యాడ్‌ నుంచి సుమారు నాలుగు కి.మీ.మేర బ్యానర్లు, ప్లెక్ల్సీలను వైకాపా శ్రేణులు ఏర్పాటుచేశాయి. సీఎం సభకు ప్రజలను తరలించేందుకు ప్రైవేటు బస్సులు ఇవ్వాలంటూ ఆ పార్టీ నాయకులు ముందుగానే మాట్లాడుకున్నారు. గురు, శుక్రవారాలు కుప్పం మండలంలోని ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

 

దుకాణాల మూసివేతకు హెచ్చరికతో కూడిన సూచన

కుప్పం పట్టణంలోని అనిమిగానిపల్లె సమీపంలో వైఎస్‌ఆర్‌ చేయూత ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి జగన్‌ నిర్వహించనున్నారు. కుప్పం చెరువు కట్టనుంచి బస్టాండ్‌, కృష్ణగిరి బైపాస్‌ మీదుగా అనిమిగానిపల్లె వరకు సీఎం కాన్వాయ్‌ వెళ్లనుంది. ఈ రహదారి వెంట ఉన్న దుకాణదారుల, ఇళ్ల వివరాలను వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సాయంతో పోలీసులు సేకరించారు. వారి పేర్లు, ఫోన్‌నెంబర్లు, దుకాణంలో ఎవరెవరు ఉంటారని తెలుసుకున్నారు. మీ ఇళ్లపై నుంచి కాన్వాయ్‌పై ఏమైనా పడితే మీరే బాధ్యత వహించాలని చెప్పారు. కొందరు సిబ్బంది ఓ అడుగు ముందుకేసి దుకాణాలు మూసేస్తే మీకే మంచిదంటూ హెచ్చరికతో కూడిన సూచనలిచ్చారు. దీంతో శుక్రవారం తాము దుకాణాలే తెరవమంటూ వారు సమాధానమిచ్చారు.


ముఖ్యమంత్రే రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని కోరుతున్నా, ఆయన రాక నేపథ్యంలో జగన్‌ ఫొటోలతో కుప్పంలో భారీగా వెలిశాయి. రోడ్డు వెంట ఉన్న చెట్లకు సైతం వైకాపా రంగులద్దారు.

- ఈనాడు, చిత్తూరు


తెదేపా నాయకుల గృహ నిర్బంధం

సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగానే ఇప్పటికే కేసులు నమోదైన తెదేపా నాయకులు, కార్యకర్తలకు సమన్లు ఇచ్చారు. విజయపురం, కార్వేటినగరం మండలాల తహసీల్దార్ల ముందు గురువారం వారు హాజరయ్యారు. దీనికితోడు నియోజకవర్గంలో క్రియాశీలంగా ఉన్న తెదేపా కార్యకర్తలను గురువారం ఉదయంనుంచే గృహనిర్బంధంలో ఉంచారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని