పోలవరం ముంపుపై సమగ్ర అధ్యయనం చేయాలి

పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ముంపు ప్రభావం, తెలంగాణ ప్రాంతంలో పరిరక్షణ చర్యలను ఏపీ చేపట్టాలని కోరుతూ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌

Updated : 23 Sep 2022 04:15 IST

కాళేశ్వరం అదనపు టీఎంసీకి అనుమతులు ఇవ్వాలి

కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు తెలంగాణ లేఖలు

ఈనాడు, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ముంపు ప్రభావం, తెలంగాణ ప్రాంతంలో పరిరక్షణ చర్యలను ఏపీ చేపట్టాలని కోరుతూ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ గురువారం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లోనూ ముంపు ఏర్పడుతోందని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏపీ స్పందించి రెండు రాష్ట్రాల పరిధిలో రక్షణ చర్యలు చేపట్టిందని, తెలంగాణలో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అదనపు టీఎంసీ తరలింపునకు అనుమతులివ్వాలని మరో లేఖలో కోరారు. కర్ణాటక చేపడుతున్న ఎగువ తుంగ-భద్ర ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం అనుమతులు ఇవ్వడం సరికాదని మరో లేఖ ద్వారా తెలిపారు. లేఖల్లో ఏం చెప్పారంటే...

* పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే 50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో (42.67 మీటర్లు) సీడబ్ల్యూసీ డిజైన్‌ చేయగా 36 లక్షల క్యూసెక్కుల మేరకు మాత్రమే నిర్మించారని ఐఐటీ హైదరాబాద్‌ అధ్యయనం చెబుతుంది. ఈ మేరకు వచ్చే ముంపుపైనే సాంకేతికంగా అధ్యయనం జరిగింది. ఇప్పటికే భద్రాచలం టెంపుల్‌ టౌన్‌, మణుగూరు భారజల కర్మాగారం, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలతో పాటు పలు గ్రామాలు ప్రభావితమవుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే నది వెనుక భాగంలో ఏర్పడే పూడికతో ముంపు పెరుగుతుంది. ఈ కోణంలో అధ్యయనం చేయాలి.

నివేదికను ఏపీ పట్టించుకోవడం లేదు
* గోదావరిలో కలిసే నదులు పోటెత్తడం వల్ల సాగుభూములు, ఎత్తిపోతల పథకాలు, ఐటీసీ పార్కు, భారజల కర్మాగారం ప్రభావితమవుతున్నాయి. ఇప్పటికే వంద గ్రామాల్లో ముంపు ఏర్పడుతుండగా మరో అరవై గ్రామాలకు ప్రమాదం ఉంది. భదాద్రి జిల్లాలోని ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ నివేదిక సూచిస్తుండగా ఏపీ పట్టించుకోవడం లేదు.

* పోలవరం జలాశయం వెనుక మిగులు, వరద జలాల ఆధారంగా ఏపీ పలు ఎత్తిపోతల పథకాలు చేపట్టింది. వీటి కోసం ప్రాజెక్టులో నిల్వను ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్థాయిలో ఎక్కువ కాలం కొనసాగిస్తే ఎంతో ప్రమాదం. ఈ నిర్మాణాలను నిలువరించాలి.

* పోలవరం స్పిల్‌వే, కాఫర్‌ డ్యాం (42.5 మీటర్లు) పూర్తవ్వగా ఈ ఏడాది జులైలో 38.76 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయి. ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యాక పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్ల వద్ద నిల్వ ఉంటే దుమ్ముగూడెం నుంచి భద్రాచలం వరకు రెండు వైపులా అదనంగా 60 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ నేపథ్యంలో జలాశయంలో గరిష్ఠ స్థాయి 193.5 అడుగుల వద్ద (59 మీటర్లు) నిల్వ ఉన్న సమయంలో భద్రాచలం వద్ద వరద స్థాయి 33.60 లక్షల క్యూసెక్కులు ఉండే అవకాశాలున్నట్లు సీడబ్ల్యూసీ 2012లో పేర్కొంది. దీనికి అనుగుణంగా సమగ్ర అధ్యయనం చేయాలి.

* కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగానే అదనపు టీఎంసీ తరలింపునకు చేపడుతున్న నిర్మాణాలపై (కంపోనెంట్లు) మాత్రమే సుప్రీంకోర్టు స్టేటస్‌ కో ఇచ్చింది. గోదావరి బోర్డు జారీ చేయాల్సిన అనుమతుల ప్రక్రియకు కోర్టు ఉత్తర్వులు వర్తించవు. కేంద్రం జారీ చేసిన గెజిట్‌లో పేర్కొన్న అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితా నుంచి దీనిని తొలగించండి.

* కర్ణాటక చేపట్టిన ఎగువ తుంగ, ఎగువ భద్ర ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం ఇచ్చిన అనుమతులు నిలిపివేయాలి. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-2 తీర్పు అమల్లోకి రావాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు కృష్ణా పరీవాహక(సబ్‌ బేసిన్‌-8) పరిధిలోనివి. కేడబ్ల్యూడీటీ-1 ఆ ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని