HCA: అభిమానంతో ఆటలు

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అంటేనే వివాదాల నిలయం. కొన్నేళ్లుగా అవినీతి, అక్రమాలు, అంతర్గత కుమ్ములాటలతో పరువు పోగొట్టుకున్న హెచ్‌సీఏ.. ఇప్పుడు లేక లేక ఓ అంతర్జాతీయ

Updated : 23 Sep 2022 07:10 IST

టీ 20 క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల అమ్మకంలో గందరగోళం

జింఖానాలో తొక్కిసలాట.. లాఠీఛార్జి

20 మందికి గాయాలు.. హెచ్‌సీఏపై విమర్శలు

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అంటేనే వివాదాల నిలయం. కొన్నేళ్లుగా అవినీతి, అక్రమాలు, అంతర్గత కుమ్ములాటలతో పరువు పోగొట్టుకున్న హెచ్‌సీఏ.. ఇప్పుడు లేక లేక ఓ అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌కు అవకాశం వస్తే, సవ్యంగా టికెట్లు విక్రయించలేక జాతీయస్థాయిలో అభాసుపాలైంది. ఆదివారం ఉప్పల్‌లో జరగాల్సిన భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌ టికెట్ల అమ్మకాల్లో హెచ్‌సీఏ వైఖరి ఆదినుంచీ అనుమానాస్పదంగా ఉంది. చివరికి అభిమానుల ఒత్తిడి తట్టుకోలేక సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో టికెట్ల అమ్మకం చేపట్టినా.. కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో అభిమానుల ప్రాణం మీదకు వచ్చింది.

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌కు సంబంధించి గురువారం సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో టికెట్ల అమ్మకం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హెచ్‌సీఏ వైఫల్యం అభిమానుల్ని అష్టకష్టాలకు గురిచేసింది. మొత్తం టికెట్లన్నీ ఆన్‌లైన్లోనే అమ్మాలని హెచ్‌సీఏ మొదట నిర్ణయించగా.. పేటీఎంలో టికెట్ల కోసం ప్రయత్నించినవారికి తీవ్ర నిరాశ తప్పలేదు. నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడైనట్లు చూపించడంతో అభిమానులు బుధవారం జింఖానా ముందు ఆందోళనకు దిగారు. స్టేడియం లోపల బైఠాయించారు. దీంతో హెచ్‌సీఏ గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జింఖానాలో టికెట్లు అమ్ముతామని ప్రకటించింది. దీంతో రాత్రి ఒంటి గంట నుంచే అభిమానులు మైదానం గేట్ల వద్ద పడిగాపులు కాశారు. ఉదయం 8 గంటలకల్లా వేల సంఖ్యలో తరలివచ్చారు. గేట్లు తెరవగానే కొందరు లోపలికి వెళ్లి వరుసలో నిల్చున్నారు. అభిమానుల సంఖ్య పెరిగిపోవడంతో భద్రతా సిబ్బంది గేట్లు మూసేశారు. రానురాను అభిమానుల సంఖ్య పెరిగిపోయి.. జింఖానా గేటు నుంచి ప్యారడైజ్‌ సిగ్నల్‌ వరకు బారులు తీరారు. ఉదయం 10.30 గంటలకు టికెట్ల విక్రయం మొదలవుతుందనగా గేట్లు తెరిచారు. ఒక్కసారిగా అభిమానులు పెద్ద ఎత్తున తోసుకుంటూ రావడంతో ముందు నిలుచున్నవారు కిందపడిపోయారు. వారిని తొక్కుకుంటూ కొందరు ముందుకెళ్లిపోయారు. దీంతో పోలీసులు అప్రమత్తమై.. లాఠీఛార్జి చేశారు. కిందపడిపోయిన వారిని పక్కకు తీసుకొచ్చారు. స్పృహ తప్పి పడిపోయిన జింఖానా స్వీపర్‌ రంజిత (48)కు కానిస్టేబుల్‌ నవీన సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు. తొక్కిసలాటలో 20 మంది గాయపడగా.. రంజితతో పాటు బేగంపేట ఠాణా కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌ (36), కవాడిగూడకు చెందిన విద్యార్థి ఆదిత్యనాథ్‌ (23), తిరుమలగిరి ఇందిరానగర్‌ వాసి విద్యార్థి సయ్యద్‌ ఆలియా (19), కొంపల్లి బహదూర్‌పల్లికి చెందిన సాయి కిశోర్‌ (25), సికింద్రాబాద్‌ కంట్రోల్‌ రూమ్‌కు చెందిన అగ్నిమాపకశాఖ కానిస్టేబుల్‌ శ్రీనాథ్‌యాదవ్‌ (37), జేఎన్‌టీయూ కేపీహెచ్‌బీ వాసి సుజాత (26)లను ఆసుపత్రికి తరలించారు. వీరిలో సాయికిశోర్‌, సుజాతలను ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్ఛార్జి చేశారు. మరోవైపు మధ్యాహ్నం తర్వాత టికెట్లు అయిపోయినట్లు నిర్వాహకులు ప్రకటించడంతో అభిమానులు ఉసూరుమంటూ వెనుదిరిగారు.

కొరవడిన నియంత్రణ
క్రికెట్‌ అభిమానులు భారీగా తరలి వస్తారన్న అంచనా ఉన్నా.. నియంత్రణకు బ్యారికేడ్లు పెట్టలేదు. క్యూలైన్లు ఏర్పాటు చేయలేదు. కనీసం మంచినీళ్లు కూడా లేకుండా గాలికొదిలేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌, కార్యదర్శి విజయానంద్‌, మిగతా ఎపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం ఈ దుస్థితికి కారణమన్న విమర్శలొస్తున్నాయి.హెచ్‌సీఏ నిర్వహణ లోపం కారణంగానే తొక్కిసలాట చోటుచేసుకుందని, దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి న్యాయపరమైన చర్యలు చేపడతామని హైదరాబాద్‌ శాంతిభద్రతల అదనపు కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.

ఘటనపై విచారణ చేపట్టాలి: పవన్‌కల్యాణ్‌
హైదరాబాద్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్లను పారదర్శకంగా విక్రయిస్తే లాఠీఛార్జి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కాదని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. జింఖానా గ్రౌండ్స్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట దురదృష్టకరమన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts