Updated : 23 Sep 2022 05:41 IST

ఏపీలో రూ.5 లక్షల కోట్లతో హైవేల అభివృద్ధి

భువనేశ్వర్‌ నుంచి భోగాపురం వరకు ఆరులైన్ల మార్గం

విజయవాడ తూర్పు బైపాస్‌ రోడ్డు మంజూరు చేస్తాం

రాజమహేంద్రవరంలో కేంద్రమంత్రి గడ్కరీ

రూ.3 వేల కోట్ల విలువైన  8 ప్రాజెక్టులకు శంకుస్థాపన

ఈనాడు, రాజమహేంద్రవరం, టి.నగర్‌, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో 2024 నాటికి రూ.5 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 129 కి.మీ విస్తీర్ణంలో సుమారు రూ.3వేల కోట్లతో చేపట్టనున్న 2, 4 వరుసల 3 జాతీయ రహదారులు, 5 ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఇదే వేదిక నుంచి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. ‘ఏపీకి రానున్న 3 నెలల్లో రూ.3వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి భూములు కేటాయిస్తే లాజిస్టిక్‌ పార్కులు ఇస్తాం. భువనేశ్వర్‌ నుంచి భోగాపురం వరకు 6లైన్ల హైవే.. విజయవాడ తూర్పు బైపాస్‌ రోడ్డు మంజూరు చేస్తాం. రాజమహేంద్రవరం- వేమగిరి- కాకినాడ కెనాల్‌ రోడ్డును కాకినాడ పోర్టుకు అనుసంధానం చేస్తాం. సముద్ర రవాణాలో కీలకమైన ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాలూ సౌర, విద్యుత్తు, బయోడీజిల్‌ వాహనాలను ప్రోత్సహించాలి. గ్రీన్‌ బ్యాంకు ద్వారా పచ్చదనం అభివృద్ధిచేసి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలి. భవిష్యత్తు గ్రీన్‌ ఎనర్జీదే’ అని గడ్కరీ పేర్కొన్నారు.


రాజమహేంద్రవరంలో జరిగిన సభలో మీటనొక్కి అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రి గడ్కరీ. వేదికపై రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మార్గాని భరత్‌రామ్‌, వంగా గీత, చింతా అనురాధ, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు సత్తి సూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాసనాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, జడ్పీ ఛైర్మన్‌ వి.వేణుగోపాలరావు, రుడా ఛైర్‌పర్సన్‌ షర్మిలారెడ్డి తదితరులు


అటవీ అనుమతులివ్వండి..: మంత్రి రాజా

రాష్ట్ర ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ఎన్‌హెచ్‌ ప్రాజెక్టులకు అటవీ అనుమతులు ఇచ్చేలా చొరవ చూపాలని కేంద్ర మంత్రిని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సహకరించాలని రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్‌ విజ్ఞప్తి చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రానికి 20 ఫ్లైఓవర్లు అడిగితే.. గడ్కరీ 30 మంజూరు చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మాధవి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కేంద్ర రోడ్డు రవాణా, పౌర విమానయాన మంత్రి జనరల్‌ (రిటైర్డ్‌) వి.కె.సింగ్‌, ఆర్‌ అండ్‌ బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు, నేషనల్‌ హైవే పీడీ సురేంద్రబాబు, అదనపు డైరెక్టర్‌ రవిప్రసాద్‌, కలెక్టర్‌ మాధవీలత, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల వివరాలివి..

* వాకలపూడి- ఉప్పాడ- అన్నవరం ఎన్‌హెచ్‌- 516ఎఫ్‌ రహదారిపై రూ.1,345 కోట్లతో 40.62 కి.మీ లైనింగ్‌ పనులు

* సామర్లకోట- అచ్చంపేట జంక్షన్‌ వరకు ఎన్‌హెచ్‌- 516ఎఫ్‌ రహదారిపై రూ.710 కోట్లతో 12.25 కి.మీ లైనింగ్‌ పనులు

* రంపచోడవరం- కొయ్యూరు ఎన్‌హెచ్‌- 516ఈ రహదారిపై 70.12 కి.మీ పొడవున రూ.570 కోట్లతో రెండు లైన్ల నిర్మాణం

* కైకవరం ఎన్‌హెచ్‌- 216ఏ వద్ద 1.79 కిమీ పొడవున రూ.70 కోట్లతో నాలుగు లైన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణం

* మోరంపూడి ఎన్‌హెచ్‌- 216ఏ వద్ద రూ.60 కోట్లతో 1.42 కి.మీ పొడువున నాలుగు లైన్ల ఫ్లై ఓవర్‌ నిర్మాణం

* ఉండ్రాజవరం ఎన్‌హెచ్‌-216ఏ వద్ద 1.25 కి.మీ పొడవుతో రూ.35 కోట్ల వ్యయంతో నాలుగు లైన్ల ఫ్లై ఓవర్‌ నిర్మాణం

* తేతలి ఎన్‌హెచ్‌-216ఏ వద్ద 1.03 కి.మీ పొడవున రూ.35 కోట్లతో నాలుగులైన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణం

* జొన్నాడ ఎన్‌హెచ్‌-216ఏ వద్ద 0.93 కి.మీ పొడవున రూ.25 కోట్లతో నాలుగు లైన్ల ఫ్లైఓవర్‌ నిర్మాణం

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని