29లోగా విచారణ ముగించండి

అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్‌రెడ్డితోపాటు ఇతర నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లపై ఈనెల 29లోగా విచారణ ముగించి వీలైతే తీర్పునూ వెలువరించాలని హైదరాబాద్‌లోని సీబీఐ స్పెషల్‌ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది

Published : 23 Sep 2022 04:08 IST

గాలి అక్రమ మైనింగ్‌ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై

సీబీఐ ప్రత్యేక కోర్టుకు సుప్రీం ఆదేశం

ఈనాడు, దిల్లీ: అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్‌రెడ్డితోపాటు ఇతర నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లపై ఈనెల 29లోగా విచారణ ముగించి వీలైతే తీర్పునూ వెలువరించాలని హైదరాబాద్‌లోని సీబీఐ స్పెషల్‌ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్‌ ఎంఆర్‌షా, జస్టిస్‌ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. కేసు విచారణను జాప్యం చేయడానికి నిందితులు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేశారని, ఇక ముందు అందుకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేసింది. వాయిదాలు లేకుండా డిశ్చార్జి పిటిషన్లను తేల్చాలని ఆదేశిస్తూ ఈ ఉత్తర్వులు వెంటనే హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు చేరేలా చూడాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ‘పిటిషనరు గాలి జనార్దన్‌రెడ్డి తరఫు న్యాయవాది విజ్ఞప్తి మేరకు కేసు విచారణను ఈనెల 29కి వాయిదా వేస్తున్నాం. ఐపీసీ సెక్షన్‌ 120-బి, 379, 420, 427, 447, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(1)(డి)ల కింద 2009లో దాఖలైన కేసుల విచారణను జాప్యం చేయడానికి నిందితులు అన్ని రకాల ప్రయత్నాలు చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది. ఈ ఉత్తర్వులకు సంబంధించిన సమాచారాన్ని రిజిస్ట్రీ వెంటనే స్పెషల్‌ కోర్టుకు తెలియజేయాలి’ అని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. గాలి జనార్దన్‌రెడ్డి అక్రమ తవ్వకాల కేసుల్లో కోర్టు విచారణలో జాప్యానికి కారణాల గురించి హైదరాబాద్‌ సీబీఐ స్పెషల్‌ కోర్టు సీల్డ్‌కవర్‌లో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ కేసులు నమోదై 12 ఏళ్లయినా ఇప్పటికీ విచారణ ముందుకు సాగకపోవడానికి కారణాలేంటి? ప్రస్తుతం విచారణ ఏ దశలో ఉందో చెప్పాలంటూ ఈనెల 14న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ కోర్టు నివేదిక సమర్పించింది. కేసుల విచారణలో జాప్యానికి నిందితులు పదేపదే డిశ్చార్జి అప్లికేషన్లు దాఖలు చేయడమే కారణమని పేర్కొన్నట్లు సమాచారం.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts