Published : 23 Sep 2022 05:19 IST

తల్లీబిడ్డలకు వేర్వేరు చోట్ల చికిత్స!

ఒకేచోట అందుబాటులో లేని  గైనిక్‌, పీడియాట్రిక్‌ సేవలు

ఈనాడు, అమరావతి: ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుబంధ ఆసుపత్రుల్లో గైనిక్‌, పీడియాట్రిక్‌ విభాగాలు ఒకేచోట ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు తక్కువగా ఉన్నందువల్ల తల్లీబిడ్డ, కుటుంబ సభ్యులు అవస్థలు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద కొన్ని ఆసుపత్రుల్లో రెండు, మూడు విభాగాలే గుర్తింపు పొందాయి. గర్భిణి ప్రసవించిన అనంతరం శిశువులకు కొన్ని కేసుల్లో ప్రత్యేక చికిత్స అవసరమవుతోంది. తక్కువ బరువుతో జన్మించడం, ఇతర అనారోగ్య సమస్యలు శిశువులను ఇబ్బంది పెడుతుంటాయి. ఈ పరిస్థితుల్లో గైనిక్‌ ట్రీట్‌మెంట్‌ ఉన్నచోట పీడియాట్రిక్‌ సేవలు లేకపోవడంతో తల్లీ బిడ్డలు ఒక్కోచోట ఉండాల్సి వస్తోంది. శిశువులకు పాలు ఇవ్వడం, ఆలనాపాలనా చూసుకోవడంలో కుటుంబ సభ్యులు అవస్థలు పడుతున్నారు. గైనిక్‌ సేవలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలంటే... జనరల్‌ సర్జరీ సేవలు తప్పనిసరి చేశారు. ఇదే నిబంధన పీడియాట్రిక్‌ సేవల విషయంలో లేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రులవారు గైనిక్‌పాటు పీడియాట్రిక్‌ సేవలకు అనుబంధ గుర్తింపు తీసుకోవడం లేదు. పిల్లల వైద్యుల కొరత, సౌకర్యాలు కల్పించడంలో ఇబ్బందులు ఉన్నాయన్న ఉద్దేశంతో యాజమాన్యాలు దృష్టి పెట్టడం లేదు. చాలాచోట్ల ఈపరిస్థితి ఉంది. కార్పొరేట్‌, ఇతర పెద్దాసుపత్రుల్లోనైతే ఈ సమస్య ఉండటంలేదు. 

ఏకకాలంలో.. ఒకే రోగికి రెండు, మూడు రకాల చికిత్సలు ఏకకాలంలో అవసరమైనప్పుడూ ఒక్కోసారి సమస్యలు వస్తున్నాయి. కోస్తాలో ఇటీవల ఒకరు ఆర్థో సమస్యతో ఆసుపత్రిలో చేరగా తలకు అయిన గాయానికి మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా ఐసీయూలో చికిత్స అందించాలి. పాలీట్రామా కేటగిరీలో ఈ సౌకర్యం ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల వారు అవసరమైతే స్పెషాలిటీ వైద్యులను బయటి నుంచి పిలిపించాలి. కానీ ఆసుపత్రి యాజమాన్యం.. తలకు అయిన గాయానికి తమవద్ద చికిత్స లేదని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీని గురించి తెలిసిన వెంటనే జిల్లా అధికారులు జోక్యం చేసుకుని ‘పాలీట్రామా’ కింద చికిత్స అందించొచ్చని చెప్పడంతో యాజమాన్యం అంగీకరించింది. రోడ్డు ప్రమాదాలకు గురైన వారి విషయంలోనూ ఈ సమస్యలు కొన్ని ఆసుపత్రుల్లో తలెత్తుతున్నాయి. ‘గైనిక్‌ ఉన్న చోట పీడియాట్రిక్‌ సేవలను తప్పనిసరిగా అందించాలని ఆసుపత్రులపై ఒత్తిళ్లు తెస్తున్నాం. దీనికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో హరేందర్‌ ప్రసాద్‌ వెల్లడించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని