ఓటరు-ఆధార్‌ అనుసంధానంలో అవకతవకలు

రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానంలో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. వాలంటీర్ల నుంచి సేకరించిన సమాచారంతో బీఎల్‌ఓలు అనుసంధానం చేసేస్తున్నారు. గ్రామ/వార్డు

Published : 24 Sep 2022 03:57 IST

వాలంటీర్ల సమాచారంతో బీఎల్‌ఓల చర్యలు

ఇళ్లకు వెళ్లకుండానే వివరాల నమోదు

ఎన్నికల సంఘం ఆదేశాల బేఖాతర్‌

6బి దరఖాస్తులు పరిశీలిస్తే అక్రమాలు వెలుగులోకి..

ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానంలో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. వాలంటీర్ల నుంచి సేకరించిన సమాచారంతో బీఎల్‌ఓలు అనుసంధానం చేసేస్తున్నారు. గ్రామ/వార్డు సచివాలయాల వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశించింది. ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్‌ మీనా గత వారం జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో సమావేశమైన సందర్భంగా ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానంలో వాలంటీర్లను భాగస్వాములను చేయొద్దని చెప్పారు. కానీ వాలంటీర్ల ద్వారా సేకరించిన ఆధార్‌ నంబర్ల ఆధారంగా బీఎల్‌ఓలు ఓటర్లకు తెలియకుండానే అనుసంధానం చేస్తున్నారు. జిల్లా అధికారుల ఒత్తిడి, ఎవరు పట్టించుకుంటారన్న ఉద్దేశంతో చాలామంది బీఎల్‌ఓలు ఓటర్లను సంప్రదించకుండానే చకచకా అనుసంధానం ముగిస్తున్నారు. కాకినాడ, గుంటూరు, నెల్లూరు, ఎన్టీఆర్‌, విజయనగరం, ఇతర జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. అనుసంధాన చర్యల్లో భాగంగా భారత ఎన్నికల సంఘం కుటుంబసభ్యుల నుంచి వివరాల సేకరణకు 6బి దరఖాస్తు రూపొందించింది. వ్యక్తిగత గోప్యత ప్రమాణాలను అనుసరించి రూపొందించిన ఈ దరఖాస్తులో వివరాలు నింపి యజమాని నుంచి సంతకం తీసుకున్న తర్వాతే అనుసంధానానికి బీఎల్‌ఓలు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇది చాలాచోట్ల సరిగా అమలు కావట్లేదు. కుటుంబసభ్యులకు 6బి దరఖాస్తులూ ఇవ్వడంలేదు.

వాలంటీర్ల ద్వారా సేకరించి..
వాలంటీర్ల వద్ద వారికి కేటాయించిన 50 కుటుంబాల వివరాలు ఉంటున్నాయి. దాంతో వారిచ్చిన సమాచారంతోనే బీఎల్‌ఓలు అనుసంధాన ప్రక్రియ ముగిస్తున్నారు. సేకరించిన దరఖాస్తుల్లో కుటుంబసభ్యుల సంతకాలు ఉన్నాయా.. లేవా అన్న వివరాలను పర్యవేక్షించాల్సిన సూపర్‌వైజర్లు పట్టించుకోవడం మానేశారు. మరోవైపు.. ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానం గురించి ఓటర్లకు ఎవరూ చెప్పడంలేదు. ఇదంతా కంప్యూటర్‌ ముందు జరిగిపోవడంతో ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతోందని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

సమయం లేదు
ఆధార్‌కార్డు లేకపోతే తగిన ఆధారాలు చూపి ఓటరు కార్డుతో అనుసంధానం చేయాలని కోరేలా 6బి దరఖాస్తులో వివరాల నమోదుకు వీలు కల్పించారు. ఈ విషయం ఎవరికీ తెలియడంలేదు. త్వరత్వరగా అనుసంధానం పూర్తిచేయాలని జిల్లా అధికారులు ఒత్తిడి చేయడంతో ఇంటింటికీ వెళ్లలేక వాలంటీర్లపై ఆధారపడ్డామని కొందరు బీఎల్‌ఓలు చెబుతున్నారు. ఏకకాలంలో మూడు, నాలుగు పనులు ఉండటంతో ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోపక్క. అనుసంధానానికి సర్వర్‌ పరంగా సమస్యలొస్తున్నాయి. కొందరి వివరాలు నమోదుచేస్తుంటే ఇప్పటికే నమోదైనట్లు సిస్టమ్‌లో కనిపిస్తోందని బీఎల్‌ఓలు చెబుతున్నారు. వారికి మరోచోట ఓటు ఉండి, అనుసంధానం జరిగినందువల్ల ఇలా వస్తోంది. ఈ అనుసంధానం హడావుడిలో చనిపోయినవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తప్పించడంలేదు. కుటుంబసభ్యులు తప్పనిసరిగా ఫాం-7 ఇస్తేనే చనిపోయిన వారి వివరాలు నమోదుచేయాలన్న నిబంధనలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని