కుప్పాన్ని పులివెందులలా చూస్తా

పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించాం. 39 నెలల్లో రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.1,17,667 కోట్ల నగదు బదిలీ చేశాం.

Updated : 24 Sep 2022 06:54 IST

అవసరమైన నిధులు విడుదల చేస్తా

జనవరి నుంచి వృద్ధాప్య పింఛను రూ.2,750

మా ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువే

వైఎస్‌ఆర్‌ చేయూత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్‌

పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించాం. 39 నెలల్లో రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.1,17,667 కోట్ల నగదు బదిలీ చేశాం. అన్నివర్గాలకూ కలిపితే ఇది రూ.1,71,244 కోట్లు. అర్హతే ప్రామాణికంగా పథకాలను అమలు చేస్తున్నాం.

- సీఎం జగన్

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు

ప్రస్తుతం ఇస్తున్న వృద్ధాప్య పింఛనును వచ్చే ఏడాది జనవరి నుంచి రూ.2,750కి పెంచుతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు 33 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నా ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు. ‘కుప్పాన్ని నా సొంత నియోజకవర్గం పులివెందులలా చూస్తా.. అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు విడుదల చేస్తా’ అని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్‌ను శాసనసభ్యుడిగా గెలిపిస్తే మంత్రిని చేస్తానని పునరుద్ఘాటించారు. చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని అనిమిగానిపల్లె సమీపంలో శుక్రవారం వైఎస్‌ఆర్‌ చేయూత మూడో విడత నిధుల విడుదల కార్యక్రమానికి సీఎం జగన్‌ హాజరై ప్రసంగించారు. ఆయన బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ‘వైకాపా అధికారంలోకి రాకముందు ఉన్న బడ్జెటే.. ఇప్పుడూ ఉంది. తెదేపా హయాంలో కన్నా మా ప్రభుత్వం అప్పులు తక్కువ చేసింది. అప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదు? అప్పటి పాలనకు.. ఇప్పటి పాలనకు మధ్య తేడా గమనించాలని ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నా’ అని జగన్‌ పేర్కొన్నారు. ‘మీ ఎమ్మెల్యే గురించి నాలుగు మాటలు చెబుతా. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏం చేశారంటే చెప్పలేం. ఏం చేయలేదో చెప్పడానికి చాలా ఉంది. హంద్రీ-నీవా కాలువ పనులు పూర్తి చేస్తే కరవు ఉండదని తెలిసినా.. ఆయన పరిష్కారం చూపలేకపోయారు.

కుప్పంలో నిత్యం 5వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం బెంగళూరు, చెన్నై వెళ్తున్నారు. మరో ఆరు నెలల్లో హంద్రీ-నీవా పనులు పూర్తి చేస్తాం. కుప్పం బ్రాంచ్‌ కాలువ (కేబీసీ) సామర్థ్యాన్ని పెంచుతాం. పాలారు ప్రాజెక్టుకు న్యాయ, పర్యావరణ ఆటంకాలు తొలగించి నిర్మాణాలు చేపడతాం. ఇక్కడి ప్రజలు అభివృద్ధి వైపు చూశారు కాబట్టే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపా క్లీన్‌ స్వీప్‌ చేసింది. చంద్రబాబుకు ఇప్పటివరకూ కుప్పంలో ఇల్లు కూడా లేదు. ఆయన నియోజకవర్గానికి స్థానికేతరుడు’ అని జగన్‌ దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఇన్‌ఛార్జి మంత్రి ఉష శ్రీచరణ్‌, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేగౌడ, ఎంఎస్‌ బాబు, ఆరణి శ్రీనివాసులు, ద్వారకానాథరెడ్డి, ఎమ్మెల్సీ భరత్‌, ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ఛైర్మన్‌ విజయానందరెడ్డి, కలెక్టర్‌ హరినారాయణన్‌, జేసీ వెంకటేశ్వర్‌, ఎస్పీ రిషాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భారీగా బారికేడ్లు: జగన్‌ ముఖ్యమంత్రిగా తొలిసారి కుప్పం రావడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో స్థానికులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రహదారుల పక్కన, ఇళ్లపైనా ఖాకీలు పహరా కాశారు. సీఎం సభకు కుప్పం నియోజకవర్గవాసుల కన్నా ఎక్కువగా చిత్తూరు జిల్లాలోని పలమనేరు, పుంగనూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లోని మహిళలు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలోని వారిని తరలించడం చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని