అంకబాబుకు 41ఏ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు?

గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్‌ ఘటనతో సీఎంవోలోని ఒక కీలక అధికారికి సంబంధం ఉందంటూ వచ్చిన పోస్టును వాట్సప్‌ గ్రూపుల్లో

Published : 24 Sep 2022 04:19 IST

మీరు ఇవ్వడానికి ప్రయత్నిస్తే.. ఆయన తిరస్కరించారనడానికి రుజువులున్నాయా?

సీనియర్‌ పాత్రికేయుడి అరెస్టు విషయంలో సీఐడీపై  కోర్టు ప్రశ్నల వర్షం

సీఐడీ అధికారులకు నోటీసు

అంకబాబు రిమాండు తిరస్కరణ

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- గుంటూరు లీగల్‌: గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్‌ ఘటనతో సీఎంవోలోని ఒక కీలక అధికారికి సంబంధం ఉందంటూ వచ్చిన పోస్టును వాట్సప్‌ గ్రూపుల్లో ఫార్వర్డ్‌ చేశారంటూ సీనియర్‌ పాత్రికేయుడు కొల్లు అంకబాబు (73)ను అరెస్టు చేసిన సీఐడీ అధికారులపై న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అంకబాబుకు నోటీసులు ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చారు? మీరు ఆయనకు నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించారనడానికి, ఆయన దాన్ని తిరస్కరించారనడానికి రుజువులేంటి’ అంటూ సీఐడీ అధికారులకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. నాలుగు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అంకబాబుకు రిమాండు విధించాలన్న సీఐడీ అభ్యర్థనను తిరస్కరించింది. రూ.25 వేల సొంత పూచీకత్తుపై ఆయన్ను విడుదల చేయాలంటూ గుంటూరు ఆరో అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానం ఇన్‌ఛార్జి న్యాయమూర్తి జి.స్పందన శుక్రవారం రాత్రి ఆదేశాలిచ్చారు. అంకబాబు, మరికొందరిపై ఈ నెల 22న కేసు పెట్టిన సీఐడీ అధికారులు గురువారం సాయంత్రం 6.45 గంటలకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు న్యాయస్థానంలో హాజరుపరిచి, రిమాండు విధించాలని కోరారు.

వీడియో పరిశీలిస్తే తేలిపోతుంది
సీఆర్‌పీసీ 41ఏ నోటీసిచ్చేందుకు ప్రయత్నించినా తీసుకోవటానికి అంకబాబు నిరాకరించారని సీఐడీ తరఫు న్యాయవాది వివరించారు. ‘సీఐడీ అధికారులు నాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. మా ఇంట్లో నన్ను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించేవరకూ సీఐడీ సిబ్బంది వీడియో తీశారు. దాన్ని చూస్తే నాకు నోటీసిచ్చారా? లేదా? నోటీసులు ఇవ్వాలని నేనే వారిని అడిగానా అనేది తేలిపోతుంది’ అని అంకబాబు చెప్పారు. సీఐడీ అధికారులు తన వాంగ్మూలాన్ని మార్చేశారన్నారు. సీనియర్‌ జర్నలిస్ట్‌నయిన తనను తెదేపా సానుభూతిపరుడ్ని అంటూ రిమాండు రిపోర్టులో పేర్కొన్నారని వివరించారు. న్యాయవాదులు తోట శ్రీధర్‌, కావూరి గోపీనాథ్‌, గూడపాటి లక్ష్మీనారాయణ తదితరులు అంకబాబు తరఫున వాదనలు వినిపించారు.

సీఎంవో ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఫిర్యాదు: ‘అంకబాబు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు’ అంటూ సీఎంవో కార్యాలయ మేనేజర్‌ తిరుపతి రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని సీఐడీ న్యాయవాదులు న్యాయస్థానానికి తెలిపారు. అభయగోల్డ్‌కు సంబంధించిన 20 కేసుల్లో అంకబాబు నిందితుడని వివరించారు. తాజాకేసులో విచారణ నిమిత్తం రిమాండు విధించాలని కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు.

బలవంతంగా లాక్కొచ్చారు: అంకబాబు: సీఐడీ అధికారులు తనను బలవంతంగా తీసుకెళ్లారని, ఓ అధికారైతే తన లుంగీ లాగేయటానికి ప్రయత్నించారని అంకబాబు ఆరోపించారు. విచారణ ఎదుర్కోవటానికి సిద్ధమేనని, నోటీసివ్వాలని కోరినా వారు పట్టించుకోలేదని న్యాయస్థానం బయట విలేకరులతో చెప్పారు. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, మందులు తెచ్చుకుంటానని చెప్పినా వినిపించుకోలేదన్నారు. తాను వాట్సప్‌ పోస్టు ఫార్వర్డ్‌ చేసిన గ్రూపులో అనేక మంది ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు ఉన్నారని, తాను చేసినది తప్పుడు పోస్టు అయితే.. వారు అప్పుడే హెచ్చరించి ఉండేవారు కదా అన్నారు.


అంకబాబుకు చంద్రబాబు ఫోన్‌

ఈనాడు, అమరావతి: న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన సీనియర్‌ జర్నలిస్ట్‌ అంకబాబుతో తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. అంకబాబు అరెస్టు అక్రమమని, ఆయనకు లేనిపోని దురుద్దేశాలు ఆపాదించారంటూ సీఐడీ పోలీసులపై మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ధ్వజమెత్తారు.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని