దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల, ఆసుపత్రి డీన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌.. దేశంలో అత్యున్నత వైద్య విద్యాసంస్థ దిల్లీ ఎయిమ్స్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. తెలుగు

Updated : 24 Sep 2022 06:34 IST

తెలుగు రాష్ట్రాల నుంచి ఆ స్థాయికి ఎదిగిన మూడో ప్రముఖుడు

ఈనాడు, దిల్లీ - సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల, ఆసుపత్రి డీన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌.. దేశంలో అత్యున్నత వైద్య విద్యాసంస్థ దిల్లీ ఎయిమ్స్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్థాయికి ఎదిగిన మూడో ప్రముఖుడిగా నిలిచారు. ఈయన నియామకానికి కేంద్ర నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న రణ్‌దీప్‌ గులేరియా పదవీకాలం ముగిసిన నేపథ్యంలో కేంద్రం కొత్త డైరెక్టర్‌ను నియమించింది. శ్రీనివాస్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న రణ్‌దీప్‌ గులేరియా 2017 మార్చి 28 నుంచి కొనసాగుతూ వచ్చారు. రెండుసార్లు పొడిగింపు ఇచ్చారు. ఆ గడువు శుక్రవారంతో ముగిసింది. ఆయన తర్వాత ఆ సంస్థ 16వ డైరెక్టర్‌గా డాక్టర్‌ శ్రీనివాస్‌ బాధ్యతలు చేపడతారు. ఇదివరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రొ.ఉలిమిరి రామలింగస్వామి, రాజమహేంద్రవరానికి చెందిన ప్రొ.పనంగిపల్లి వేణుగోపాల్‌ తెలుగు రాష్ట్రాల నుంచి దిల్లీ ఎయిమ్స్‌కు డైరెక్టర్‌లుగా సేవలందించారు.

ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల అభివృద్ధికి విశేష కృషి

సనత్‌నగర్‌లో ఈఎస్‌ఐసీ వైద్యకళాశాల నిర్మించి చాలాకాలం పాటు ప్రారంభించలేదు. ఈ క్రమంలో ఎయిమ్స్‌లో ఉన్న డా.శ్రీనివాస్‌ను 2016 ఫిబ్రవరి 9న ఈఎస్‌ఐసీ వైద్య కళాశాలకు డీన్‌గా నియమించారు. ఆపై ఆయన తొలిసారిగా ఆ కళాశాలకు 100 ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించేలా చొరవ చూపారు. ఈఎస్‌ఐ బీమాదారులైన కార్మికుల పిల్లలకూ వైద్యవృత్తిని ఎంచుకునే అవకాశమిచ్చేందుకు శ్రీనివాస్‌ చేసిన ప్రయత్నం ఫలించింది. దేశంలోనే ఈఎస్‌ఐ బీమాదారులైన కార్మికుల పిల్లలకు 35శాతం ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించేలా కృషిచేశారు. ఇపుడు మరో 25 ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లనూ తీసుకొచ్చారు. ఈఎస్‌ఐసీ వైద్య కళాశాలలో 16 విభాగాల్లో పీజీ కోర్సులు మరో 5 విభాగాల్లో సూపర్‌ స్పెషాలిటీ కోర్సులనూ డా.శ్రీనివాస్‌ సాధించారు. తాను బాధ్యతలు చేపట్టాక సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలన్నింటినీ ఇక్కడే అందేలా చూశారు.

సైకిల్‌పై విధులకు..

డా.శ్రీనివాస్‌ భార్య డా.అరుణ సైతం ఈఎస్‌ఐసీ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. వారి ఏకైక కుమారుడు బెంగళూరులో ఇటీవలే డిగ్రీ కోర్సులో చేరాడు. సనత్‌నగర్‌ జెక్‌కాలనీలో ఉండే శ్రీనివాస్‌ రోజూ సైకిల్‌పై విధులకు హాజరవుతుండటం ఆయన నిరాడంబరతకు నిదర్శనం.

సాధారణ జీవనం.. అసాధారణ విజయాలు

కష్టించి పనిచేయటం, సామాన్య జీవితం గడపడాన్ని ఇష్టంగా భావించే డా.శ్రీనివాస్‌ను దిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌ డైరెక్టర్‌ పదవి ఆయన దరఖాస్తు చేయకుండానే వరించటం విశేషం. హైదరాబాద్‌కు చెందిన ఈయన పూర్వీకులు చాలాకాలం కిందట కర్ణాటకలోని మైసూరులో స్థిరపడ్డారు. బళ్లారిలో విద్యాభ్యాసం కొనసాగించిన శ్రీనివాస్‌ అక్కడే ఎంబీబీఎస్‌, ఎంఎస్‌(జనరల్‌ సర్జరీ) పూర్తిచేశారు. తరువాత దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరి ప్రొఫెసర్‌ స్థాయికి ఎదిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని