సంక్షిప్త వార్తలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో అన్‌-సర్వేడ్‌ భూమికి రీసర్వే చేసేందుకు వీలుగా శుక్రవారం గెజిట్‌ వెలువడింది. పేరుపాలెం సరిహద్దు, బంగాళాఖాతానికి మధ్యలో

Updated : 24 Sep 2022 06:19 IST

అన్‌ సర్వేడ్‌ భూమిపై గెజిట్‌ విడుదల

ఈనాడు, అమరావతి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో అన్‌-సర్వేడ్‌ భూమికి రీసర్వే చేసేందుకు వీలుగా శుక్రవారం గెజిట్‌ వెలువడింది. పేరుపాలెం సరిహద్దు, బంగాళాఖాతానికి మధ్యలో ఉన్న భూమి (బీచ్‌వద్ద 116.24 సెంట్లు) రికార్డుల్లో అన్‌-సర్వేడ్‌గా ఉంది. దీనిపై భూ పరిపాలన శాఖ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు రీసర్వే చేయనున్నారు.


ఆంధ్ర కేసరి వర్సిటీ ఉపకులపతి నియామకానికి సెర్చ్‌ కమిటీ

ఈనాడు, అమరావతి: ప్రకాశం జిల్లాలోని ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఉపకులపతి నియామకానికి ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఉపకులపతి పోస్టుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఈ కమిటీ ముగ్గురు పేర్లను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది.


26 నుంచి డీఎస్సీ-98 అభ్యర్థుల ధ్రువపత్రాల అప్‌లోడ్‌

ఈనాడు, అమరావతి: మినిమం టైం స్కేల్‌లో పని చేయడానికి ఆసక్తి తెలిపిన డీఎస్సీ-98 అభ్యర్థులు ధ్రువపత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఈ నెల 26 నుంచి అక్టోబరు 2 వరకు ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలని తెలిపింది. అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలను జిల్లా విద్యాధికారుల కార్యాలయంలో అక్టోబరు 6 నుంచి 14 వరకు పరిశీలన చేయించుకోవాలని సూచించింది.


విద్యార్థుల అప్రెంటిస్‌షిప్‌కు  ఉన్నత విద్యామండలి ఒప్పందం

ఈనాడు, అమరావతి: విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌ అందించేందుకు ఉన్నత విద్యామండలి శుక్రవారం టీమ్‌ లీజ్‌ ఎడ్‌టెక్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ రామమోహన్‌రావు సమక్షంలో కార్యదర్శి నజీర్‌ అహ్మద్‌, టీమ్‌ లీజ్‌ ఎడ్‌టెక్‌ ప్రాంతీయ విభాగాధిపతి రోహిత్‌ డోగ్రా ఒప్పందపత్రాలను మార్చుకున్నారు. ఈ కంపెనీ తరఫున 20 వేల మంది విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌ అందిస్తారు. విద్యార్థులు సొంతంగా నేర్చుకుంటే ఉచితంగా ఇస్తారు. కంపెనీ తరఫున సహాయకులను ఏర్పాటు చేయాలంటే ఒక్కో విద్యార్థి రూ.3 వేలు చెల్లించాలి.


ఆ వర్సిటీకి అనుమతుల్లేవు ఏపీఈఆర్‌ఎంసీ

ఈనాడు, అమరావతి: ఒంగోలులోని ఓం శ్రీగాయత్రీ విశ్వకర్మ విశ్వవిద్యాలయానికి ఎలాంటి అనుమతులు లేవని, ఇందులో ప్రవేశాలు పొందే ముందు విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ కార్యదర్శి రాజశేఖరరెడ్డి తెలిపారు. ప్రభుత్వం, ఇతర నియంత్రణ సంస్థలు నిర్దేశించిన నిబంధనలను పాటించకపోవడంతో దాని పేరును ప్రభుత్వ వర్సిటీల జాబితాలో చేర్చలేదన్నారు. విశ్వవిద్యాలయం హైకోర్టును ఆశ్రయించడంతో అన్ని నిబంధనలు పాటించి, లోపాలను సరిదిద్దుకొని, అనుమతులు పొందాలని న్యాయస్థానం సూచించిందని వెల్లడించారు.ఈ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.


డిగ్రీ ప్రవేశాల్లో వెబ్‌ ఐచ్ఛికాల నమోదు వాయిదా

ఈనాడు, అమరావతి: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో వెబ్‌ ఐచ్ఛికాల నమోదు ఆదివారానికి వాయిదా పడింది. ఇప్పటికే ప్రవేశాలను 2 నెలలుగా సాగదీస్తున్నారు. తాజాగా వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు శుక్రవారం నుంచి అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. దీన్నీ వాయిదా వేసి, అభ్యర్థులకు సమాచారం కూడా ఇవ్వలేదు. చాలా మంది ఇంటర్నెట్‌ కేంద్రాల వద్ద పడిగాపులు పడ్డారు. మొదట దరఖాస్తులు తక్కువ వచ్చాయని వాయిదా వేశారు. ఆ తర్వాత సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసమని ఓసారి, ఇంజినీరింగ్‌ ప్రవేశాలు ముగిశాక ప్రవేశాలు చేపట్టాలని మరోసారి వాయిదా వేస్తూ పోయారు. కళాశాలల అనుబంధ గుర్తింపులో జాప్యం, కళాశాలల జాబితాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంలో ఆలస్యం కారణంగా ఇటీవలే మళ్లీ వాయిదా వేశారు. ఆన్‌లైన్‌ ప్రవేశాలకు జులై 22న ప్రకటన విడుదలైనా ఇలా వాయిదా వేస్తూ వెళ్తున్నారే తప్ప ఇంతవరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పటి వరకు 1.39లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.


వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: వివిధ డిప్లమో కోర్సుల్లో సీట్ల భర్తీకి గత మూడు విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించిన తర్వాత మిగిలిన ఖాళీల భర్తీకి శుక్రవారం ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శుక్రవారం తుది నోటిఫికేషన్‌ను జారీచేసింది. టీఎస్‌-పాలిసెట్‌ (అగ్రి, ఇంజనీరింగ్‌), పదో తరగతి తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైన వారు వీటికోసం ఈ నెల 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు. ‘‘దరఖాస్తుదారులు అక్టోబరు 1న విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించే స్పాట్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. కౌన్సెలింగ్‌కు వచ్చే అభ్యర్థులు నిర్ణీత రుసుం, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకురావాలి. ఈ కోర్సులకు గతంలో దరఖాస్తు సమర్పించినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో చూడాలి’’ అని రిజిస్ట్రార్‌ సూచించారు.


ఏఎస్‌ఓ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

ఈనాడు, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో పనిచేసే అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌(ఏఎస్‌ఓ) అసోసియేషన్‌కు శుక్రవారం 9 మందితో నూతన కార్యవర్గం ఏర్పడింది. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్‌.హరినాథ్‌ (వాటర్‌ రిసోర్స్‌శాఖ), ఆర్‌.సత్యనారాయణ (ఆర్‌అండ్‌బీశాఖ) ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఇతర కార్యవర్గ సభ్యులుగా టి.రవి, జి.ప్రియాంక, ఇ.జగదీష్‌కుమార్‌, ఎస్‌.నీలిమ, ఎస్‌.శివప్రసాద్‌, కె.వరప్రసాద్‌, ఐ.శ్రీనివాసన్‌ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారని హరినాథ్‌ తెలిపారు.


నియంత పాలన ఎంతోకాలం కొనసాగదు: ముప్పాళ్ల

రాజమహేంద్రవరం నేరవార్తలు: నియంత పాలన ఎంతోకాలం కొనసాగడం సాధ్యం కాదని, రాష్ట్రంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లేదని ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు పేర్కొన్నారు. సీనియర్‌ జర్నలిస్టు కొల్లు అంకబాబును సీఐడీ పోలీసులు కుట్ర పూరితంగా అదుపులోకి తీసుకోవడం అన్యాయమని శుక్రవారం రాజమహేంద్రవరంలోని ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను జేబులో సంస్థగా వాడుకుని రాజ్య హింసకు పాల్పడుతోందన్నారు.


కాంట్రాక్టు పనులపై జీఎస్‌టీ పెంపు

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వం సవరించిన ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కూడా వివిధ కాంట్రాక్టు పనుల విలువపై వసూలు చేసే జీఎస్టీని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు చేపట్టే కాంట్రాక్టు పనుల్లో 12శాతం ఉన్న జీఎస్టీని 15శాతానికి పెంచింది. ఇది ఈ ఏడాది జనవరి నుంచి వర్తింపజేసేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థలు చేపట్టే పనులపైనా ఈ పెంపును జులై 18 నుంచి వర్తింపజేసింది. 75శాతం మట్టి పని ఉన్న పనుల్లో జీఎస్టీ గతంలో 5 శాతం ఉండేది. ఇప్పుడు అది 12 శాతానికి పెంచింది. ఈ పెంపు జులై 18 నుంచి వర్తిస్తుంది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.


ఇద్దరు ఎంఈఓలపై నియామక ప్రక్రియపై  స్పష్టమైన విధానాలు ఇవ్వాలి: యూటీఎఫ్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో ఇద్దరు ఎంఈఓలను నియమించే ప్రక్రియపై స్పష్టమైన విధి విధానాలను ఉమ్మడి సర్వీసు నిబంధనల ఆధారంగా రూపొందించాలని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(యూటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు మువ్వ రామలింగంను కలిసి వినతిపత్రం సమర్పించారు. కొత్తగా ఏర్పాటు చేసిన 292 జూనియర్‌ కళాశాలల్లో 998 ప్రధానోపాధ్యాయ, 4,500 స్కూల్‌ అసిస్టెంట్ల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. విజయవాడ, విశాఖపట్నం నగరœపాలక సంస్థలకు రెవెన్యూ మండలాల ఆధారంగా నాలుగు ఎంఈఓ పోస్టులు ఇచ్చారని, మిగతా నగరపాలక సంస్థలకు రెండేసి చొప్పున పోస్టులను మంజూరు చేసిందని తెలిపారు.


పెన్షన్‌దారుల గ్రాట్యూటీ, కరువు భత్యాలు విడుదల చేయాలి: బుచ్చిరాజు

పెన్షన్‌దారులకు రావాల్సిన గ్రాట్యూటీ, కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలని.. హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ పెన్షన్‌దారుల సంఘం ప్రధాన కార్యదర్శి బిచ్చిరాజు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఆరోగ్య మిత్రలు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని, సరోజనిదేవి కంటి ఆసుపత్రిలో పింఛన్‌దారులకు వైద్య సదుపాయం కల్పించాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని