అంకబాబు అరెస్టుపై నిరసనలు

సీనియర్‌ పాత్రికేయుడు అంకబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేయడంపై తెదేపా, జనసేన, సీపీఐ సహా ప్రజాసంఘాలు, పాత్రికేయ సంఘాలు పెద్ద ఎత్తున

Published : 24 Sep 2022 05:31 IST

ఈనాడు,అమరావతి; న్యూస్‌టుడే, గుంటూరు లీగల్‌: సీనియర్‌ పాత్రికేయుడు అంకబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేయడంపై తెదేపా, జనసేన, సీపీఐ సహా ప్రజాసంఘాలు, పాత్రికేయ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేశాయి. తెదేపాకు చెందిన మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఆ పార్టీ నాయకులు కనపర్తి శ్రీనివాస్‌, చిట్టాబత్తిన చిట్టిబాబు, రావిపాటి సాయికృష్ణ, డేగల ప్రభాకర్‌ తదితరులు తొలుత సీఐడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను పోలీసులు సీఐడీ కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు. అంకబాబును అరెస్టు చేశామని, ఆయన్ను న్యాయస్థానంలో హాజరుపరుస్తామని సీఐడీ అధికారులు చెప్పి పంపేశారు. అనంతరం అంకబాబు అరెస్టును నిరసిస్తూ ఓ టీవీఛానల్‌ ఎండీ మారెళ్ల వంశీకుమార్‌, ఏపీజేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు రహదారిపై బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి నగరపాలెం పోలీసుస్టేషన్‌కు తరలించారు. తర్వాత వారిని విడిచిపెట్టారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ, తెదేపా న్యాయవిభాగానికి చెందిన చుక్కపల్లి రమేష్‌, రాజీవ్‌ ఆనంద్‌ తదితరులతో పాటు జర్నలిస్టు నాయకులు మీరా, రవీంద్ర, రాజేష్‌, అనిల్‌, గాంధీ తదితరులు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కోర్టు రహదారిలో బారికేడ్లు
మరోవైపు స్థానిక పోలీసులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కోర్టు రహదారిలోకి ఎవరూ రాకుండా బారికేడ్లు అడ్డుపెట్టడంతో అటుగా రాకపోకలు సాగించేవారంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అంబులెన్సులు, రైల్వేస్టేషన్‌కు వెళుతున్న ప్రయాణికులనూ తిప్పిపంపటంతో వారు చుట్టూ తిరిగి గమ్యస్థానాలకు చేరాల్సి వచ్చింది. వైద్యకళాశాల నుంచి చాలా దూరంలో ఉన్న సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి ఎవరూ చేరకుండా ప్రధాన రహదారిని మూసివేయటంపై పలువురు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బార్‌అసోసియేషన్‌కు ఫిర్యాదు చేస్తామని న్యాయవాదులు తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని